పిలిస్తే పలికే బోళా శంకరుడు (Mahashiva Bola Shankara)
పిలిస్తే పలికే బోళా శంకరుడు
(Mahashiva Bola Shankara)
ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్ర మహత్యం గురించిన కథ ఇలా సాగుతుంది...పూర్వం ఒక నాగుపాము, సాలెపురుగు, ఏనుగు వేటికవే మహాశివుని తమతమ పద్ధతులలో మనసారా పూజించి తరించేవి. చివరకు తమలో తాము కలహించుకుని పోరాడుకుని శివుడిలో ఐక్యం అయ్యాయని ఆ పాము, ఏనుగు, సాలీడుల కారణంగానే శ్రీకాళహస్తికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
శ్రీకాళహస్తి మాత్రమే కాదు ఆంధ్రదేశంలో ప్రతి జిల్లాలోనూ ప్రసిద్ధి చెందిన శివాలయం ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ పుణ్య క్షేత్రాలలో ఒక్కో క్షేత్రానిదీ ఒక్కో చరిత్ర ఉంది. ఇంద్రకీలాద్రి మీద మల్లికార్జునిది ఒక కథ అయితే, కోటప్పకొండ మీద త్రికూటేశ్వరునిది మరో గాథ. ఇంకా వేములవాడ లాంటి మహా క్షేత్రాలన్నీ శివరాత్రి రోజు భక్తులతో కిటకిటలాడిపోతాయి. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. ఆయన పూజా విధానమూ తేలికే.
శ్రీమహావిష్ణువుకు సమర్పించినట్టు చక్రపొంగలి, దద్దోజనం లాంటి నైవేద్యాలు పరమేశ్వరుడికి అక్కరలేదు. కేవలం అభిషేకం జరిపించినా మహాశివుడు పరవశించిపోతాడు. మనమంతా శివుడిపై లగ్నం చేసి, చేసే అభిషేకం చాలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి. భక్తి మాత్రమే ప్రధానం తప్ప ఇతర ఆడంబరాలు ఏవీ అవసరం లేదని చాటిచెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు. ఆ మహేశ్వరుని అనుగ్రహం పొందడం ఎంత తేలికో, ఆయన ఆగ్రహిస్తే రక్షణ పొందడం అంత కష్టం.
తెలిసీతెలీక భక్తుడు చేసే తప్పుల్ని పెద్ద మనసుతో క్షమిస్తాడా శంకరుడు. బోళా శంకరుడు భక్తులపై వెనకా ముందూ చూడకుండా కరుణ కురిపించే బోళా శంకరుడు కావడంవల్లనే ఎందరో రాక్షసులు, ఆయనను ప్రసన్నం చేసుకుని ప్రపంచానికి చేటు తెచ్చే వరాలు పొందారు. వరాలు ప్రసాదించడంలో, భక్తులను కటాక్షించడంలో ఈశ్వరుడి గుణమే అంత. ఆయన కరుణే అంత. భస్మాసురుడు వంటి రాక్షసులపై ఆయన కురిపించిన కరుణ అపారం.
మహాశివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రాలు మహా మహిమాన్వితమైనవి. సౌరాష్ట్రలో సోమనాథునిగా, శ్రీశైలంలో మల్లికార్జునిగా, ఉజ్జయినిలో మహా కాళేశ్వరునిగా ఇలా 12 ప్రాంతాలలో జ్యోతి స్వరూపంలో వెలశాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రాలన్నీ పరమ పవిత్రమైనవి. కోట్లాదిమందికి పుణ్యక్షేత్రమైన కాశీలో కూడా జ్యోతిర్లింగం వెలసింది.
జ్యోతిర్లింగాలలో ఎక్కువ అంటే ఐదు క్షేత్రాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఆ క్షేత్రాలు వరుసగా ఉజ్జయని, పర్లి, డాకిని, నాసిక్, దేవసరోవర్. ఈ పుణ్య క్షేత్రాలలో మహాకాళుడిగా, వైద్యనాథుడిగా, త్రయంబకేశ్వరుడిగా, భీమశంకరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు
మహాశివుడు కావడానికి లయ కారకుడే అయినప్పటికీ భక్తులకు ఏదైనా ముప్పు వాటిల్లుతుంటే చూస్తూ కోర్చోడు. జన సంరక్షణకు వెంటనే ఉపక్రమిస్తాడు, సాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని లోకానికి హాని చేయకుండా తన గళంలో దాచాడు. ఆకాశం నుంచి మహా ఉధ్రుతంగా కిందికి దుముకుతున్న గంగ వేగాన్ని తగ్గించడానికి జటాజూటం అడ్డువేసి తలలో ధరించాడు. ఇలా ఎన్ని ఉదాహరణలో!
అవకాశాన్ని బట్టి శైవ క్షేత్రాన్ని దర్శించుకుని ఇహంలో సుఖశాంతులను, పరంలో ముక్తిని పొందుదాం. భక్తుల మొరను ఆలకించి వారిని ఆదుకోవడంలో ముందుండే పరమేశ్వరుని మనసారా స్మరించుకుందాం. భక్తిగా పూజిద్దాం. ఆయన కృపకు పాత్రులమవుదాం.
Mahashiva and jyotirlingas, Srikalahasti Shaiva kshetra, Parameswara Jyothi Swaroopa , Sourashtra Somanatha Srisaila Mallikarjuna Ujjayini Maha Kala