శ్రీవారి కరుణ కలగాలంటే తిరుమల యాత్ర ఎలాచేయాలి.

 

శ్రీవారి కరుణ కలగాలంటే తిరుమల యాత్ర ఎలాచేయాలి.

 

 

తిరుమల మామూలు క్షేత్రము కాదు. పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే అని చెప్పబడుతున్నాయి. ఆ ఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి. కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు. అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసం కోసం తపించి తరించారు. ఇక యాత్ర నెలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము.

 

 

కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది. చెప్పులతో కొండ ఎక్కరాదు. మొదటగా స్వామి వారు భక్తునకు స్వయంగా తన పాదరక్షల కొలతలనివ్వగా ఆ భక్తుడు తయారు చెసిన పాదరక్షలు అక్కడ పూజింపబడుతుంటాయి. ఆపాదరక్షలను ముందుగా తలపై వుంచుకుని స్మామివారిని స్మరించుకోవాలి. అక్కడ రాజైనా చక్రవర్తియైనా సరే వాళ్ల అహంకారాలు అణగేలా చెప్పులతో కొట్టబడతారు. దానితో నేనింతవానిని అంతవానిననే అహంకారం అణగిపోతుంది. ఆతరువాత బహుకష్ట సాధ్యమైన ఆ కొండనెక్కుతూ వుంటే [అప్పటిలో ఇంత సౌకర్యాలు లేవులెండి] ఆయాసముతో కళ్ళుతిరుగుతుంటాయి. భక్తులు భగవన్నామస్మరణంతో బహుకష్టాలతో చేరుకుంటారు పైకి . దానితో తమ చెడుఖర్మలు నశించటమేకాదు, తమ శారీరిక బలం ఎంతో దాని పరిమితి ఎంతో తెలిసివస్తుంది. దానితో తమ శరీర బలాన్ని చూసుకుని విర్రవీగే వారికి వాస్తవం అర్ధమవుతుంది.

 

 

ఆ తరువాత ముఖ్యమయిన పని శిరోముండనమ్ అంటే గుండు చేయించుకోవటం ఒక ముఖ్యమయిన నియమము అందరికీ. ఇది ఆడమగ అందరూ పాటించేవారు పూర్వము, ఆధునికత పేరుతో బాహ్యసౌందర్య పోషణపట్ల శ్రద్ధపెరిగి ఇప్పుడు కొందరు పాటించటం లేదు. కాని దీనివెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక కారణమున్నది. మనిషిని మభ్యపెట్టి మనో వికారాలను కల్పించేది సౌందర్యం. దానికి ఆధారము శిరోజాలు. అవి వున్నప్పుడు ఎక్కడకెళ్ళినా తమ సౌందర్యము పట్ల అతిశయమైన భావన వెన్నంటివస్తూ మనసును కామవికారాలవైపు పరుగుపెట్టిస్తుంది. కనుక ఆ వికారాలను తొలగించకపోతే మనసు మాధవుని వైపు మళ్లదు పక్కదోవలగుండా పారి పోవాలని చూస్తుంది. కనుక ఆ శిరోజాలను తీసి వేస్తే ప్రతి మానవునికి తమ సహజస్వరూపమేమిటో అర్ధమయిపోతుంది. ఎదుట వున్న జీవులను చూడగానే కామ భావన సమూలంగా నశిస్తుంది. నిర్వికారమైన మనోస్థితి కలుగుతుంది. [గుండు చేయించుకుని మిమ్మల్ని మీరు అద్దములో చూసుకోండి ఒకసారి, ఏవిధమయిన వికారాలు లేక ప్రశాంతమైన స్థితి వస్తుంది.]

 

 

అప్పుడు ఆలయ ప్రవేశము చేస్తుంటే మనసంతా ఆ దివ్యస్వరూపాన్ని చూడాలనే తపన తప్ప మరొకటి తలపుకు రాదు. ఆస్థితిలో కోటిసూర్యకాంతుల సమప్రభుడు ఆ కొండలరాయుడు మనకు దర్శనమిస్తాడు. ఆ తన్మయత్వంతో స్వామిని దర్శించి నప్పుడు తిరుమల యాత్ర సఫలమవుతుంది. ఆ తరువాత నిలువుదోపిడీ చేసి మనలను ధనవంతులమనే అహంకారాన్నుంచి రక్షించి ప్రపంచములో ఏజీవైనా నీవొక్కడివే దిక్కు నాకు అనేలా భావన కలగచేస్తాడు స్వామి. ఇలా వెళ్ళినప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మనకు శుభాలు కలుగుతాయి.

 

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ స్వామి ముందు తమ తుచ్చమైన పలుకుబడులను, ధనాన్ని ప్రదర్శించి చెసే దర్శనముమేలు చేయదు సరికదా ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుందని చెప్పవచ్చు. ఆ పవిత్ర క్షేత్రములో అడుగు పెట్టిన ప్రతి భక్తుడు స్వామి వారి పరివారమే. కనుక మన అతితెలివి తోటి సాటి భక్తుల కిబ్బందికలిగేలా మనము దర్శనాదులను చేయరాదు. భక్తులకు చెసే అపచారాన్ని ఆయన అసలు క్షమించడు. అందుకే ఎక్కడెక్కడ మనం చేసిన తప్పులన్నిటికీ కొండమీదకు వెళ్లాక అనేకరూపాలుగా దోపిడిగా మనకు అనుభవానికొచ్చి మనసు విలవిల లాడుతుంటుంది. మీకు తెలుసోలేదో నిరుపేదలు రోజులతరబడి ఆ గదులలో స్వామి వారి దర్శనానికి వేచివున్నా వారికి శ్రీవారి పట్ల విసుగు కాని, అక్కడ అసౌకర్యాల పట్ల గమనికే వుండదు. కాస్త స్థితి కలిగాక మనమే గంటసేపన్న ఆగలేక అల్లడిపోయి పక్కదారిలో దర్శనమేమన్నా దొరుకుతుందా అని వెతుకుతుంటాము.