సర్వజీవుల్లో సాయి కొలువై ఉన్నారు !

 

సర్వజీవుల్లో సాయి కొలువై ఉన్నారు !

"ఎవరైతే అన్ని జీవుల్లో, అన్నింటా దైవాన్ని చూస్తారో, అశాశ్వతమైన వస్తువులలో ఉన్న శాశ్వతమైన దైవాన్ని చూస్తారో, వారి దృష్టి మాత్రమే సరైనది. భగవంతున్ని ఒకటిగా, అన్నింటా నెలకొని ఉన్నట్టు దర్శించటం ద్వారా మాత్రమే తనలోని పరమాత్మను దర్శించుకుని, ఆ వెలుగులో పరమ గమ్యాన్ని చేరుకుంటాడు."

భగవద్గీత, మహా భాగవతం, ఉపనిషత్తులు, శ్రీసాయి సచ్చరిత్ర...ఇవన్నీ చెప్పేది ఈ పరమ సత్యాన్నే !

ఆత్మారామ్ తర్ఖడ్ భార్య షిర్డీకి వచ్చి అతిథుల ఇంట బసచేసింది. ఆ రోజు మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చున్నారు. ఇంతలో ఒక కుక్క అక్కడికి వచ్చి ఆకలితో మొరగసాగింది. తర్ఖడ్ భార్య తాను తినే రొట్టెలోని ముక్కను విరిచి కుక్కకు విసిరింది. కుక్క తృప్తిగా ఆ రొట్టెముక్కను తిని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

తర్ఖడ్ భార్య ఆ సాయంకాలం మసీదుకు వెళ్లి బాబాను దర్శించుకుంది.

"తల్లీ! కడుపు  నిండుగా భోజనం పెట్టావు. నా జీవశక్తులన్నీ సంతుష్టి చెందాయి. ఎల్లప్పుడూ ఇలాగే చెయ్యి. అదే నీకు సద్గతి కలిగిస్తుంది. మసీదులో కూర్చుని నేనెప్పుడూ అబద్దమాడను, ఆకలితో ఉన్న జీవుల కడుపు నింపితే నా కడుపు నింపినట్టే" అన్నారు బాబా.

తర్ఖడ్ భార్యకు బాబా చెప్పిన మాటలు అర్థం కాలేదు.

"నేనే ఒకరి ఇంట భోజనానికి ఉంటే నీకెలా భోజనం పెట్టగలను బాబా! నేనే ఒకరిపై ఆధారపడి ఉన్నాను" అంది తర్ఖడ్ భార్య.

"నువ్వు మధ్యాహ్నం భోజనానికి ముందు ఏ కుక్క కడుపు నింపావో అది నేను వేరు కాదు. సమస్త జీవరాశి నా అంశలే. ఎవరైతే సకల జేవకోటిలో నన్నే చూస్తారో వారే నా ప్రియభక్తులు. నేను వేరు, భగవంతుడు వేరు అనే ద్వంద్వ భావం వీడి నన్ను సేవిస్తే సద్గతి కలుగుతుంది."

తర్ఖడ్ భార్య ఆనందానికి అవధుల్లేవు. ఆ ఆనందంతో ఆమె పులకరించిపోయింది. మనసంతా శాంతి ఆవరించింది. అలాంటి ఆనందమే శాశ్వతమైనది. దానిని సొంతం చేసుకోవాలంటే అన్నింటా భగవంతుడిని చూడటం అలవర్చుకోవాలి.