బాబా అభయహస్త ముద్ర... సర్వజగద్రక్ష !
బాబా అభయహస్త ముద్ర... సర్వజగద్రక్ష !
మనకేది మంచిదో అది బాబా చేస్తారనే విశ్వాసమే సాయిపథంలో ముందుకెళ్ళే తొలిమెట్టు. సాయినాథుడు భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులు. ఎన్నోసార్లు బాబా తన ముందు చూపుతో భవిష్యత్తులో జరగబోయే కష్టాలు గురించి చెప్పారు. అదే సమయంలో తన భక్తులకు జ్యోతిష్యులు ప్రాణ గండం ఉందని చెబితే వాటిని చిత్తు చేశారు. తన భక్తుల్ని జ్యోతిష్యం ఏం చేస్తుందో చూస్తానని ప్రకటించి తన ప్రాణాలను అడ్డువేసి భక్తులను అపాయాల నుంచి కాపాడిన భక్త వత్సుడు సాయినాథుడు.
బాబా జ్యోతిషం, హస్తసాముద్రికాలను నమ్మేవారు కాదు. తన భక్తుల్నీ వాటి జోలికి పోవద్దనేవారు.
భవిష్యత్తు తెలుసుకోవాలని, దానిని అనుకూలంగా మార్చుకోవాలని మనిషికి అపరిమితమైన ఆశ, అంతా దైవానుసారమే నిర్ణయమై ఉంటుందని, మనం నిమిత్తమాత్రులమని తెలుసుకుంటే జ్యోతిషాల వెంటపడటం ఉండదు.
బాబా ఎన్నో సందర్భాల్లో మనముందే కలిగే ఆపదల నుంచి భక్తులను బయటపడేసిన దాఖాలున్నాయి. మరి, బాబా కూడా అనేక సందర్భాల్లో భక్తులకు భవిష్యత్త్తును చెప్పారు. బాబాకు జ్యోతిష్యం వచ్చా? అనే సందేహం కలగవచ్చు. నిజానికి మనలోని పామరత్వం వల్లే బాబా చూపిన చమత్కారాలు మనకు జ్యోతిషాలుగా కనిపిస్తాయి. నిజానికి బాబా భగవంతుని అవతారం. ఏం జరుగుతుందో?, ఏం జరగాలో?, ఎలా జరగాలో? భగవంతుడు అందరి విషయంలో ముందే నిర్ణయించేసి ఉంటాడు. మనం అందుకు తగిన పాత్ర పోషిస్తాం అంతే.
జ్యోతిష్యులు పైపై అంచనాలతో కొంచెం ముందు జరగబోయేది చెప్పగలరేమో కానీ, బాబా చెప్పింది మాత్రం 'జరిగి తీరుతుంది.'
ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన నీతి భవిష్యత్తు గురించి చింతపడుతూ వర్తమానంలోని విలువైన సమయాన్ని వృథా చేసుకోకూడదు. నిన్న గడిచిపోయింది. రేపేమిటో తెలియదు. వర్తమానమే మన కర్తవ్యం. ఈ రోజు మాత్రమే మన చేతుల్లో ఉన్న ఆస్తి. పనిచేసి దానిని దక్కించుకోవాలి.
మలేశాస్త్రి ఒకసారి చేయి చూపించమంటే బాబా నవ్వి ఊరుకున్నారు. త్రికాలజ్ఞునిచేయి చూసి జ్యోతిష్యులు చెప్పేదేముంది? వివేకంతో మనం చేయాల్సిన విధులను పూర్తి చేసినప్పుడే సాయి శరణాగత పథంలో పయనిస్తాం.