Read more!

ప్రేమతో కూడిన భక్తికి తలవంచే సాయినాథుడు

 

ప్రేమతో కూడిన భక్తికి తలవంచే సాయినాథుడు

బాబాకు మనం ఏది నివేదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎలా?, ఏ భావంతో ఇస్తున్నామనేదే ముఖ్యం. ఆడంబరాలు, భేషజాలు బాబాకు సరిపడవు. తన భక్తులు కూడా వాటిని వదులుకోవాలని బాబా చెప్పారు.

కొందరు కొన్ని విషయాల్లో బాబాను ఆక్షేపించారు. కొన్ని విషయాల్లో పరీక్షించాలనుకున్నారు. చివరకు కళ్లు తెరిచి చెంపలేసుకుని బాబాకు ప్రణమిల్లారు. చిత్తశుద్ధిలేని ప్రేమ భగవంతుడిని గెలవదు.

ఒకసారి కాకా మహాజని, అతని స్నేహితుడు షిర్డీ వచ్చారు. బాబాకు నమస్కరించనని, దక్షిణ ఇవ్వనని మిత్రుడు ఒట్టు పెట్టుకున్నాడు. మసీదులు అడుగుపెట్టగానే బాబా కాకా మిత్రుడిని అంత దూరాన్నుంచే 'రా...రమ్మని' సాదరంగా ఆహ్వానించారు. బాబా స్వరం అచ్చు గతించిన తండ్రి స్వరంలాగే ఉందేమిటా? అని మిత్రుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన షరతు మరిచి బాబాకు నమస్కరించాడు.

బాబా కాకాను రెండుసార్లు దక్షిణ అడిగారు. "బాబా నన్నెందుకు దక్షిణ అడగటం లేదా?" అని ఆ మిత్రుడు మనసులో అనుకున్నాడు.

"ఇవ్వటానికి ఇష్టముంటే నువ్వూ ఇవ్వొచ్చు" అన్నారు బాబా. తరువాత అతన్ని దగ్గర కూర్చోబెట్టుకుని బాబా ఇలా భోదించారు.

"నీకు, నాకు మధ్య ఉన్న అడ్డు (అహంకారం) గోడను తొలగించు. అప్పుడు నువ్వు, నేను పరస్పరం ముఖాముఖి చూసుకోవచ్చు."

భక్తి అనేది పూర్తిగా ప్రేమకు సంబంధించినది. అది మనలోని శక్తుల్ని ఎలా కేంద్రీకరించాలో, ఎలా అదుపు చేయాలో, ఎలా ఉపయోగించాలో, ఎలా సంబాలించాలో, కొత్త లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవలో, అత్యుత్తమమైనది అయిన ఫలితాలను ఎలా పొందాలో, చివరిగా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎలా పొందాలో తెలుపుతుంది. భక్తి అనే భావం "నీకున్నండి వదిలిపెట్టు" అని ఎప్పుడూ చెప్పాడు. "ప్రేమించు. ఇంకా అత్యుత్తమమైన దాన్ని ప్రేమించు" అని మాత్రమే చెబుతుంది. బాబా పట్ల ఎవరి ప్రేమ సర్వోత్కృష్టమైనదో, వారి నుంచి అసహజంగానే హీనమైనవన్నీ రాలిపోతాయి.