లక్ష్మిపూజ ఎలా చేయాలి ? (Lakhsmi Pooja)
లక్ష్మిపూజ ఎలా చేయాలి ? (Lakhsmi Pooja)
హిందువులు ప్రత్యేకంగా లక్ష్మీపూజ చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయి. దీపావళి రోజున అలాగే, శ్రావణమాసంలో. శ్రావణమాసంలోని ప్రతిరోజూ లక్ష్మీపూజ చేయవచ్చు. అయితే దీపావళి రోజు, శ్రావణమాసంలోనూ ఏకరీతిని లక్ష్మీపూజ ఎలా చేయవచ్చు అంటే...
శ్రీ సూక్త మంత్రాలతోకానీ, లక్ష్మీ సహస్ర నామాలతో కానీ, లక్ష్మి ఆశతో అష్టోత్తర శత నామాలతో కానీ లక్ష్మిదండకం లేదా స్తుతితో కానీ లక్ష్మీదేవిని అర్పించాలి. లక్ష్మీదేవిని పూజించే రోజున ఇంటిని శుభ్రంగా కడిగి, తుడిచి ఇంటిమధ్యలో ధాన్యాన్ని రాసిగా పోసి, దానిమీద తెల్లని వస్త్రాన్ని కప్పి, ఆ వస్త్రం మీద లక్ష్మి విగ్రహాన్ని ఉంచి, ఆమెకి ఇష్టమైన తెల్లని పూలు, తెల్లని గంధము, తెల్లని వస్త్రాలు, ముత్యాలు మొదలైన వాటితో
నరసిజనిలయే! సరోజ హస్తే
దవళ తామాంశుక గంధామాల్య శోభే
భగవతి హరివల్లభే! మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్
అంటూ పూజించవచ్చు. పై పద్యంలోని భావం ఏమిటంటే...
పద్మమే నివాసంగా కలదానా, పద్మాన్ని నీ చేతిలోని ఆభరణంగా ధరించిన దానా, మిక్కిలి తెల్లనైన వస్త్రాలను, గంధాన్ని మాలికలుగా వేసుకుని రమణీయంగా ఉండేదానా! శ్రీహరికి భార్యవైనదానా! నా మనసులోని భావాన్ని గ్రహించిన దానా, త్రిభువనాలకీ సంపదనిచ్చే తల్లీ నన్ను రక్షించు అని భావం.
లక్ష్మి కటాక్షం కోసం భగవద్గీత పారాయణ చేయాలని శాస్త్రం చెబుతోంది. భగవద్గీతలో అధ్యాయాల సంఖ్య 18. అయ్యప్ప ఆలయంలోని పడిమెట్ల సంఖ్య కూడా 18. ఈ 18 సంఖ్యకు ఉన్న విశిష్టత ఏమిటంటే... ఆ సంఖ్యలోని మొదటి అంకెను, రెండవ అంకెను కలిపితే తొమ్మిది వస్తుంది. ఈ తొమ్మిది అనే సంఖ్య మనిషిలోని చెడును, పాపాలను నాశనం చేస్తుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. భగవద్గీత పారాయణ కానీ, అయ్యప్ప దీక్ష 41 కానీ చేసినట్టయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పద్మపురాణం చెబుతోంది.
యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా
నానాస్తస్యై నమో నమః
దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరమ్
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే...
ఈ పద్యం భావం ఏమిటంటే..
దీపం చీకటిని నశింపచేస్తుంది. జ్ఞానదీపం అంధకారాన్ని నశింపచేస్తుంది. బాహ్య అంధకారాన్ని అంతర్యముగా ఉండే అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానజ్యోతి. అటువంటి జ్ఞానజ్యోతికి నమస్సులు. అష్టలక్ష్ముల వైభవంతోనే జగత్తు తేజోమయం అయ్యింది. ఈ అష్టలక్ష్మి శక్తిలేని చోటు ప్రపంచంలో మనకు కనిపించదు. ఈ శక్తులన్నిటినీ అధిదేవత లక్ష్మీదేవే. అందుకే ఆమెను పూజించాలి. ఆమె కటాక్షం పొందాలి.
నమస్తే సర్వలోకానాం జననీమజ్జసంభవామ్
శ్రియమున్నిద్ర పద్మాక్షిం విష్ణువక్షః స్థితామ్
లక్ష్మిదేవి క్షీర సముద్రం నుండీ ఉద్భవించినప్పుడు దేవతలందరూ ఆమెను ఈ శ్లోకంతో స్తుతించారు. వారి స్తుతులకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి, వారిని వరం కోరుకోమనగా, అప్పుడు దేవతలు ఈ స్తోత్రం పఠించినవారిని విడువవద్దని ఇంద్రుడు కోరాడు. ఆమె ఆ వరాన్ని అనుగ్రహించింది. ఈ శ్లోకాన్ని పఠిస్తూన్నవారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్న నమ్మకం ఉంది.