లక్ష పసుపు నోము - 2 (Laksha Pasupu Nomu - 2)

 

లక్ష పసుపు నోము - 2

(Laksha Pasupu Nomu - 2)

 

కథ

ఒక వూరిలో ఒక బ్రాహ్మణ ఇల్లాలు వుండేది. ఆమె భర్త రూపసి, విద్యావంతుడు. గౌరవంగా బతకడానికి తగినన్ని సిరిసంపదలు వున్నవాడే అయినా తరచూ అనారోగ్యాల పాలబడుతూ వుండేవాడు. భర్త అనారోగ్యాల వల్ల, ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఏ సుఖానికీ నోచుకోక ఏడుస్తూ వుండగా, ఆ వూరికి వచ్చిన ఒక యతీశ్వరుడు, ఆమె చేసిన అతిథి సత్కారాలకు ఆనందించి, ఆమె పరిస్థితిని దివ్య దృష్టితో తెలుసుకొని "సాధ్వీమణీ ! చింతించకు. లక్ష పసుపు నోము నోచి ఉద్యాపన చేసుకుంటే అన్నీ చక్క బడుతాయి ” అని చెప్పాడు. ఆమె అలాగే చేయగా, అది మొదలామె భర్త అనారోగ్యమనే ప్రసక్తి లేకుండా, ఆఖరికి జలుబయినా లేకుండా పూర్ణాయువుతో జీవించాడు. భార్యకు ఎనలేని సుఖం ఇచ్చాడు.

విధానం

ఆరు నెలల పాటు ప్రతిరోజూ పై కథ చెప్పుకుని, తలపై అక్షతలు వేసుకోవాలి. ఏడవ నెల మొదటి రోజున ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపనం

వెన్ను విరగని పసుపు కొమ్ములు లక్ష ఏరి పెట్టుకుని, తగినంత కుంకమతో శ్రీ మహా లక్ష్మీని గాని, శ్రీ గౌరీని గాని, ఎవరో ఒక అమ్మవారిని పూజించాలి. ఆ పసుపు కొమ్ములూ కుంకుమ తీసుకుని యింటి చుట్టూ వున్న వీధులన్నీ తిరిగి యింటింటా పంచిపెట్టాలి. ఏ ఇంట్లోనూ కూడా దోసెడుకు తక్కువగా పసుపు కొమ్ములివ్వకూడదు. తగినంత కుంకుమ కూడా యివ్వాలి. శక్తివంతులు పిండివంటలు కూడా పంచుకోవచ్చు.