జయజయాహే మహిషాసురమర్ధిని!!

 

జయజయాహే మహిషాసురమర్ధిని!!

 

నవరాత్రులలో తొమ్మిదవ రోజు, మరియు చివరి రోజు నవమి. అందరూ మహర్నవమి అని పిలుచుకునే ఈరోజుకు అధిదేవత మహిషాసురమర్ధిని.

వరాహ పురాణం ప్రకారం త్రికళ మరోమాయ. బ్రహ్మవిష్ణు మహేశ్వరుల వీక్షణం వల్ల జన్మించింది. ఈమె శరీరంలోని మూడు వర్ణాల్లో ఒకటి శ్వేత పర్వతానికి వెళ్లి బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అతనిలో లీనమయ్యింది. రెండవదైన నారాయుణి మందర నగరంలో వుండి నారదుని ప్రేరణతో మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. మూడో శక్తి అయిన ఈశ్వర శక్తి రురుణ్ణి చంపుతుంది. అతడి చర్మాన్ని మొండాన్ని వేరు చేసింది కనుక చాముండి అనే పేరు వచ్చింది. 

నవమిరోజు అందరూ కొలిచే ఈ మహిషాసురమర్ధిని అమ్మవారు ఎంతో శక్తివంతమైనది.  నవమి వెనుక ఆసక్తికర కథనం ఉంది.

అసుర రాజైన దనువుకు ఇద్దరు కుమారులు. వీరు రంభ కరంభులు. వీరిద్దరు సంతానం లేక మాలవత యక్షుడిని సంతానం కొరకు ప్రార్థించారు. కరంబుడు నీటి మధ్య, రంభుడు అగ్ని మధ్య మహావిష్ణు తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో దేవాసుర నీటిలో వుండి కరంభుడిని అంతమొందించగా రంభుడు దీన్ని చూసి ఆత్మహత్య చేసుకోబోగా శ్రీ విష్ణువు ప్రత్యక్షమై ఆత్మహత్య పాపమని చెప్పి నీకు కావలసిన వరం కోరుకొమ్మనగా “ముల్లో కాలను జయించగల వాడు, దేవాసురులచే మరణం లేనివాడు" అయిన పుత్రుడిని ప్రసాదించమనగా నీ హృదయాన్ని గెలిచిన స్త్రీ కన్పిస్తే ఆమెవల్ల అలాంటి పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. రంభుడు మాలయక్షమునకు ప్రయాణిస్తుండగా ఎన్నో జంతువులు కన్పించాయి. అందులో మహిషుని ఏనుగులు, గుర్రాలు, మహిషాలు, ఆవులు, గొర్రెలు కన్పించాయి. అందులో ఓ ఆడ మహిషాన్ని చూసి రంభుడు మోహంలో పడగా అదికూడా రంభుడిని చూసి ప్రేమలో పడింది. వారిమధ్య సంయోగం జరిగింది. వారికి ఓ మహిషి రూపంలో వుండే అసురుడు జన్మించాడు. మహిషి గర్భిణి కాగా దాన్ని పాతాళంలోని తన స్వగృహానికి తీసుకు వెళ్లగా ఇతడిని సహచరులు ఈసడించగా తిరిగి మలయక్షయానికి వెళ్లి అక్కడ కాపురం చేయగా ఒక పురుష మహిషం, స్త్రీ మహిషం పైకి రాగా రంభుడు దానిని సంహరించడానికి వెళ్లగా అది తన కొమ్ములతో చంపింది. రంభుడిని దహనం చేస్తుండగా స్త్రీ మహిషం ఆ చితిలో దూకి మరణించింది. ఆ మంటల మధ్య నుండి ఓ వికృత రూపుడు అవతరించి అక్కడున్న యక్షుల్ని సంహరించాడు. ఒక్క రంభుని వల్ల జన్మించిన మహిషాన్ని మాత్రమే వదిలాడు. అతడే రక్తబీజుడు. మహిషం వల్ల జన్మించిన మహిషుడు కనుక మహిషాసురుడను పేరు వచ్చింది. ఇతడు అసురులకు రాజై ముల్లోకాలను భయపెట్టాడు.

రాక్షసుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి సింహం రూపంలో దేవతలపైకి దూకి ఎంతో మందిని వధించాడు. మహావిష్ణువు చక్రాయుధం, శివుని త్రిశూలం ఇతడినేమీ చేయలేక పోవుటచే వారు వారి వారి స్థానాలకు చేరుకున్నారు. ఆ తర్వాత దేవతలు ఆ సమాలోచన జరిపి బ్రహ్మ ఏ పురుషుడి వల్ల మరణం లేనట్లు వరమివ్వడమే ఇందుకు కారణ మనగా బ్రహ్మ తన తేజస్సు నుండి ఓ స్త్రీ మూర్తిని సృష్టించాడు. దేవతలు, విష్ణువు, శివుడు, వరుణుడు, అగ్ని తేజస్సులను ఆ స్త్రీ మూర్తిలో నింపగా ఆమె దేవిగా మారింది. ఆమె సౌందర్యమునకు ముగ్ధుడైన మహిషాసురుడు తనను వివాహం చేసుకొమ్మని కోరగా తనను జయించిన వారినే వివాహం చేసుకుంటానని బదులిచ్చింది. మహిషాసురుడు ఆమెతో పోరాడగా ఆమె మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఇతణ్ణి వధించింది.

ఈ మహిషాసురమర్ధిని కథను విన్నవారికి, చదివిన వారికి తమ జీవితాల్లో ఉన్న సమస్యలను ఆ అమ్మ తొలగిస్తుందని అందరి ప్రఘాడ విశ్వాసం.

◆ వెంకటేష్ పువ్వాడ