రేపల్లెలో కృష్ణుడి జీవితం.. అక్కడి జీవనంలో లోతు ఇదే!
రేపల్లెలో కృష్ణుడి జీవితం.. అక్కడి జీవనంలో లోతు ఇదే!
శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ప్రతి ఇంట్లో పసివాళ్లకు, పిల్లలకు కృష్ణుని వేషం వేస్తుంటారు. అసలు ఎన్నో ఏళ్ళుగా పిల్లలకు కృష్ణుని వేషం వేసేవారికి కూడా ఆ పరమాత్మ రూపం వెనుక, రేపల్లెలో గోపబాలకుడిలా జీవించిన జీవనం వెనుక గల లోతు తెలియదు. ఆ లోతును తెలియజేసే వృత్తాంతం తెలుసుకుంటే ప్రతి మది ఆనందపరవశం అవుతుంది.
కన్నయ్య ఎప్పుడూ అమ్మ యశోద దగ్గర చేరి "చుంచు దువ్వి పింఛం పెట్టవే! ఓ యమ్మ! నన్ను గోపాల కృష్ణుడనవే!” అని అడుగుతూ ఉండేవాడట. అప్పుడు యశోదమ్మ “కన్నా! నీవు చక్కగా పాలు త్రాగితే నీ కురులు ఒత్తుగా ఎదుగుతాయి. అప్పుడు నీకు చక్కగా చుంచు దువ్వి, పింఛం పెడతాను. చక్కగా పాలు త్రాగు" అంటూ బుజ్జగించేదట! అలా అమ్మ కరస్పర్శామృతంతో ఒత్తుగా పెరిగి, మెడ మీద దోబూచులాడే కన్నయ్య కురులు చుంచు దువ్వి నెమలి పింఛం పెట్టేలా ఎదిగాయి.
శిరస్సున నెమలి పింఛంతో, నుదుట కస్తూరి తిలకంతో, ధగధగాయమాన మణిహారాలతో, కనకాంబరధారియై, ఒక చేత గోవులను కాచే కర్రతో, నడుమున చిరుగాలికి కదిలే ఎరుపు | కుచ్చుల పిల్లన గ్రోవితో ఆ పురుషోత్తముడు మూర్తి దాల్చిన గోపాలుడై గోగణాన్ని రక్షిస్తున్నాడు. జన్మాంతర పుణ్యం పండిన ఆ గోపాలురు తమ సర్వస్వాన్నీ కృష్ణ సాన్నిధ్యంలో అర్పణ చేసుకున్నారు. అక్కడ 'అహం' లేదు. అంతా పరమాత్మ భావనే. యమునా నదీ సైకతాల్లో ఆడి, పాడి, అలసిసొలసి చెట్ల క్రింద అంతా చేరగిలపడితే, పొన్నమాను కొమ్మ మధ్యన కూర్చుని, కన్నయ్య పిల్లనగ్రోవిని ఊదడం మొదలు పెట్టాడు. ఆ మురళీ గానంలో జగత్తు రసమయం అయిపోయింది. గోపబాలకులు కొందరు ఆ కృష్ణ పాదాల దగ్గర జారగిలపడి, కొందరు పాదాలు పట్టుకుని, కొందరు తన్మయంతో, ఆర్తితో చేతులు చాచి ఆ రసమయ జగత్తులో ఓలలాడుతూ ధన్యులవుతున్నారు. గోవులు మోరలు ఎత్తి అరమోడ్పు కన్నులతో గోవిందుని చూస్తూ, మురళీ గాన రసాస్వాదనలో దేహాలు పులకించి, ఆపలేని చేపుతో, పాలధారలతో పృథివికి అభిషేకం చేస్తున్నాయి. లేగదూడలు గోమాతలు స్రవించే పాలను త్రాగాలన్న తలపే లేక, చెవులు రిక్కించి, నాదోపాసకుల్లా తోకలు ఎత్తి కన్నయ్య ముఖంలోకి తన్మయత్వంగా చూస్తున్నాయి. ఆ మాధవుని ముఖంలో జాలువారే ఆ నాదరస వాహిని ప్రాణికోటి జన్మాంతర కర్మల భవబంధాలను పటాపంచలు చేస్తుంది. అంతా తేజోమయం, రసమయం.
కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదడం ఆపేసరికి అక్కడ అందరికీ బాహ్య స్మృతి కలిగింది. ఆకలి దప్పులు తెలిశాయి. అప్పటి వరకు పరమాత్మతో రమించిన ఆ మనుస్సులకు మరల మాయా మోహం క్రమ్మింది. "కృష్ణయ్యా! ఆకలి వేస్తున్నది చల్ది తిందాం రావా!" అని ఆహ్వానించారు. అష్టవిధ క్రియలతో భువనాండాన్ని లక్షణాంగములుగా పుట్టించే ఆ బ్రహ్మాండ భాండోదరుడు, భక్త జన మందారుడు జన్మ జన్మల పుణ్యరాశులైన ఆ గోపాలురు ఆర్తితో సమర్పించిన నివేదనకు పరమానందం చెందాడు. సమర్పణ తప్ప వేరెరుగని ఆ గోప బాలుర ఆకులలోని చల్దినీ, చల్ల మిరపకాయలనూ స్వీకరించాడు. గోవిందుని సాహచర్యంలో గోకులం, గోగణం కూడా దినమొక క్షణంగా వెళ్ళదీస్తున్నాయి.
గోధూళి వేళ అయిన దగ్గర నుండి కన్నయ్య కోసం యశోద ఎదురు చూస్తున్నది. కనుచీకటి పడుతున్నది. అడవిన తిరిగి, ఎండలో ఆడి, యమునలో నాని, అలసి సొలసి వసివాడి వచ్చే తన బిడ్డను జాలితో, ప్రేమతో అక్కున చేర్చుకొని బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకున్నది. లోనికి తీసుకొని వెళ్ళి మందోష్ణజలంతో స్నానం చేయించింది. చందన లేపనం పూసింది. ఆ మేటి తండ్రి అలకల తడిని సాంబ్రాణి ధూపంతో అల్లార్చింది. జున్నుతో, వెన్న, పరమాన్నాలతో, పనస తొనలతో పసిడి గిన్నెలో పుష్టిగా, తుష్టిగా భోజనం పెట్టింది. జిడ్డు మూతిని కొంగుతో తుడిచింది.
ఊయల మంచం మీద మెత్తని పానుపు వేసి కన్నయ్యను మురిపెంగా పడుకోపెట్టింది. కన్నయ్య తలను నెమ్మదిగా నిమురుతూ, ఎన్ని జన్మల పుణ్యమో తన కొంగు బంగారం అయిందని మురిసిపోతూ ఊయలను ఊపసాగింది. రాజీవ లోచనుడు కనులను నెమ్మదిగా అరమూతలు వేశాడు. బిడ్డ నిద్రించాడనుకున్నది అమ్మ యశోద. కానీ సృష్టిలో తనను తాను బందీ చేసుకున్న ఆ బాలపరమాత్మకు నిద్ర ఎక్కడిది? అయినా ఎందరో తల్లులు, ఎందరో భక్తులు ప్రతి నిత్యం ఆ పరమాత్మకు సమర్పణ చేసే భక్తి ఉపచారాలు ఇవే. ఆ తల్లి యశోదలా, ఆ గోపబాలకుల్లా, పరమాత్మను నిత్యం లాలించి పాలించే ఇంట్లో దీపకళికల్లాంటి పసివాళ్ళు, అనంత రూపుడైన పరమాత్మకు ప్రతిరూపాల్లా నట్టింట నడయాడతారనేది తరతరాల భారతీయ సంప్రదాయపు భక్తి ఒరవడి. అదే అందరికీ ఆచరణీయం. ఇహపరాలకు ప్రథమ సోపానం
*నిశ్శబ్ద.