కాశీ యాత్ర -12 విశ్వనాధుని హారతులు
కాశీ యాత్ర -12 విశ్వనాధుని హారతులు
విశ్వనాధుని పూజలూ, అభిషేకాలూ గురించి చెప్పాను కదా. ఇప్పుడు అతి ముఖ్యమైనవి హారతులు. శ్రీ కాశీ విశ్వనాధుని ఆలయంలో స్వామికి నిత్య హారతులు మూడు. తెల్లవారుఝామున 3గంటలనుంచి 4గంటల మధ్య ఇచ్చే హారతి మొదటిది. దీనికి టికెట్ వున్నది. ఇది మేము చూడలేదు. కనుక వివరించలేను. కానీ ఈ హారతిలో మణికర్ణిక ఘాట్ నుంచి శవం భస్మం తీసుకు వచ్చి అభిషేకం చేస్తారని అన్నారు. ఇలా ఉజ్జయినిలో చేస్తారు. మేము చూశాము.
ఇంక రెండవది సప్త ఋషి హారతి. ఇది సాయంకాలం 7 గంటల ప్రాంతంలో వుంటుంది. టికెట్ 51 రూపాయలు (ఇప్పుడు పెరిగి వుండవచ్చు). హారతి మొదలు పెట్టే ముందు టికెట్ లేని వాళ్ళని బయటకి పంపుతారు కానీ, మొదలు కాగానే అందరూ వస్తారు. టికెట్ వున్న వాళ్ళని 4 గుమ్మాల దగ్గర నాలుగు బల్లలు వేసి, గుమ్మంలోనూ, వాటిమీదా కూర్చోబెడతారు. గుమ్మంలోనో, బెంచీ మీద మధ్యలోనో కూర్చున్నవారు అదృష్టవంతులు. మిగతావారికి అన్నివైపులనుంచీ తోపుళ్ళు తప్పవు.
ఈ సప్త ఋషి హారతిలో సప్త ఋషులకు ప్రతినిధులుగా ఏడుగురు పండితులు స్వామికి అభిషేకం, అర్చన చేసి హారతి ఇస్తారు. ఈ హారతి సమయంలో అందరూ గంటలు ఎంత లయ బధ్ధంగా వాయిస్తారంటే, మనం కొంచెం మనసు లగ్నం చేస్తే ఆ పరమ శివుని ఆనంద తాండవం కళ్ళముందు గోచరిస్తుంది. అంత తన్మయత్వంలో మునుగుతాము. ఆ అపురూపమైన అనుభవాన్ని కాశీకి వెళ్ళినవాళ్ళెవరూ వదులుకోవద్దు. అది అనుభవించవలసినదే.
హారతి పూర్తి అయిన తర్వాత ఆ పండితులంతా నాలుగు వైపులకూ వచ్చి, స్వామికి వేసిన పూల మాలలు, తీర్ధం గుడిలో బయట వున్న భక్తులకందరికీ ఇస్తూ దక్షిణ తీసుకుంటారు.
దీని తర్వాత రాత్రి 8 గంటలు దాటిన తర్వాత సేజ్ హారతి వుంటుంది. ఈ రెండు హారతుల మధ్యా, రాత్రి హారతి తర్వాత 11 గంటలదాకా స్వామి దర్శనం వుంటుంది. హారతుల సమయంలో గర్భగుడిలోకి ఎవరినీ వెళ్ళనివ్వరు.
ఈ హారతిలో కూడా స్వామికి అభిషేకం, పూజ అంటే మంత్రాలు చదువుతూ పూల మాలలు అలంకరించటం ఎక్కువసేపు వుంటుంది. హారతి సప్త ఋషి హారతి అంత ప్రభావితంగా వుండదు. కానీ ఇదీ చూడదగ్గదే. దీనికీ టికెట్ 51 రూపాయలు.
ఈ హారతి తర్వాత కూడా బయట తీర్ధం, హారతి సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదం భక్తులందరికీ ఇస్తారు.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)