కాశీ కబుర్లు 16 కాశీలో దర్శనీయ స్ధలాలు

 

 

కాశీ కబుర్లు 16 కాశీలో దర్శనీయ స్ధలాలు

 

 

కాశీలో దేవాలయాలు అనేకం.  ఎన్ని చూసినా ఇంకా చూడనివి చాలా వుంటాయి.  ముఖ్యమైన కొన్ని దేవాలయాలను అక్కడ ఆటోవారు, టాక్సీవారు ఒక పేకేజ్ కింద చూపిస్తారు.  సమయం ఒక పూట పడుతుంది.  అందులో మొదటిది

కాలభైరవ మందిరం

 

 

పరమ శివుని ఆగ్రహంనుంచి పుట్టిన వాడు కాలభైరవుడు.  ఆయన ఒకసారి ఆబధ్ధం చెప్పిన బ్రహ్మదేవుని ఐదవ తలని తన గోటితో తుంచేశాడు.  బ్రహ్మగారి తల తుంచటంవల్ల కాలభైరవునికి బ్రహ్మ హత్యాదోషం పట్టుకుని, ఆ బ్రహ్మగారి తెగిన తల ఈయన చేతికి అతుక్కుపోయింది.  పాపం ఆయన ఆ తలను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.  లోకాలన్ని తిరిగినా పోని పాపం ఆయన కాశీకి రాగానే పోయింది.   చేతికి అతుక్కున్న తల వూడి కిందపడింది.  కాశీ ప్రవేశంతోనే బ్రహ్మ హత్యాది పాపాలుకూడా నశిస్తాయంటారు అందుకే మరి.

 ఆ భైరవుడిని విశ్వేశ్వరుడు కాశీ నగరాధిపతిగా నియమించాడు.  ఈయనకు చాలా పెద్ద పనులున్నాయి.  కాశీకి వచ్చినవారివి, అక్కడ నివసిస్తున్నవారివీ పాప పుణ్యాల చిట్టాలు మైయిన్టెయిన్ చెయ్యటం ఈయన డ్యూటీనే.  వీళ్ళందరి పాపాలనూ కడిగివెయ్యటం కూడా ఈయన డ్యూటీనే.  కాశీలో మరణించినవారికి మరణ సమయంలో సాక్షాత్తూ ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.  మరి సాక్షాత్తూ భగవంతునితో తారక మంత్ర ఉపదేశం పొందాలంటే దానికి అర్హత వుండాలికదా.  కాశీలో మరణించటమే ఆ అర్హత.  వారి పాపాలను పటాపంచలు చేసి తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిగా జీవులను తయారు చెయ్యటం కూడా భైరవులంగారి పనే.  మరి మనం చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవించాలికదా.  దానికోసం కాల భైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు.  అన్నట్లు యమ ధర్మరాజుకీ, చిత్ర గుప్తుడికీ కాశీలో నివసిస్తున్న వారిపైగానీ, అక్కడ మరణించిన వారిపైగానీ ఎటువంటి అధికారం లేదు.  కానీ అంతకుమించి తక్కువ సమయంలో ఎక్కువ శిక్షలు అనుభవింప చేసే కాలభైరవుడిని దర్శించి సేవించటం మరువకండి.

 

 

విశ్వనాధుని ఆలయంనుంచి రెండు కిలో మీటర్ల దూరం లోపే వుంది ఈ ఆలయం.      విశ్వేశ్వరుని దర్శనానికి ముందే కాల భైరవుడి దర్శనం చేసి, విశ్వేశ్వరుని దర్శనానికి ఆయన అనుజ్ఞ తీసుకోవాలని కొందరంటారు.  

గవ్వలమ్మ గుడి, భేలూపురి

అసలే కాశీలో రోడ్లు చిన్నవనుకుంటే, ఆ చిన్న రోడ్లల్లోంటి ఇంకో చిన్న సందులోకి వెళ్తే వస్తుంది గవ్వలమ్మ గుడి.  ఆటో ఆ సందులోకి వెళ్ళ లేదు.  కొంచెం దూరంగానే ఆపుతాడు.  మరీ దూరం కాదులెండి.  వెళ్ళచ్చు.  

 

 

కొంచెం ఎత్తుగా వుండే చిన్ని మందిరం ఇది.  అసలు కాశీలో చాలా ఆలయాలు చిన్నవే.  వాటి మహత్యమే అత్యున్నతం.  ఈ గవ్వలమ్మ విశ్వనాధుని సోదరి అనీ, ఆవిడకి మడీ ఆచారాలు ఎక్కువనీ, వాటితో ఆ దంపతులను విసిగిస్తుంటే స్వామి ఈవిడని  ఊరు బయట దళితవాడలో వుండమని పంపాడని ఒక కధ.  ఈవిడని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటేగానీ కాశీ యాత్ర ఫలితం లభించదనీ ఒక ప్రచారం.  ఇక్కడ దుకాణంలో ఐదు గవ్వలు ఒక సెట్ గా అమ్ముతారు.  అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవాలిట.

లోకల్ ట్రిప్ లో చూపించే ఆలయాలన్నీ దగ్గరగానే వుంటాయి.  సారనాధ్ కూడా ఈ ట్రిప్ లోనే చూపిస్తారు.  వచ్చే వారం ఇంకొన్ని ఆలయాలు....

 

-పి.యస్.యమ్. లక్ష్మి

 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)