కాశీ కబుర్లు - 17 కాశీలో దర్శనీయ ప్రదేశాలు

 

 


కాశీ కబుర్లు - 17 కాశీలో దర్శనీయ ప్రదేశాలు

 


 తులసీ మానస మందిర్

ఇది 1964లో నిర్మింపబడిన పాలరాతి మందిరం.  నిర్మాత సేఠ్ రతన్ లాల్ సురేఖా.  భవనం లోపల గోడలపై తులసీ రామాయణం మొత్తం వ్రాయబడివున్నది.  రామాయణంలోని కొన్ని ఘట్టాల చిత్రాలుకూడా వున్నాయి.  రెండంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పై భాగంలో తులసీదాసు విగ్రహాలున్నాయి.


దుర్గా మందిరం

 

పూర్వం దుర్గుడనే రాక్షసుడు ప్రజలను పలు బాధలు పెట్టగా జగన్మాత భీకర యుధ్ధంలో అతనిని సంహరించింది.  తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసినది. దుర్గుని సంహరించినది కనుక దుర్గాదేవిగా ప్రసిధ్ధిగాంచినది.  ఇక్కడ భక్తుల రద్దీ ఎల్ల వేళలా వుంటుంది.  శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో ఇక్కడ జాతర జరుగుతుంది.  ఆ సమయంలో భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో దేవీ దర్శనం చేసుకుంటారు.  సమీపంలో దుర్గా కుండము వున్నది.


బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ఇక్కడ వున్నది.   పూర్వం కాశీ రాజుగారిచే ఇవ్వబడిన దాదాపు 2000 ఎకరాల సువిశాల క్షేత్రంలో ఈ విశ్వ విద్యాలయం వున్నది.  దీనిని  1916లో పండిట్ మదన్ మోహనమాలవ్యాగారు స్ధాపించారు..  ఏటా 15000 మంది క్రొత్త విద్యార్ధులకి అనేక రంగాలలో ప్రవేశం కల్పించే ఈ విశ్వ విద్యాలయం పేరులో మాత్రమే హిందూ విశ్వ విద్యాలయం.  భారతదేశంనుంచే కాక విదేశాలనుంచికూడా అనేక మంది విద్యార్ధులు కుల, మత ప్రసక్తి లేకుండా ఈ విశ్వ విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు.  

 

ఇందులోని గ్రంధాలయం ఆసియా ఖండంలోనే అతి పెద్దది.  ఇందులో 15 లక్షల గ్రంధాలు వున్నాయి.  ఇవేకాక దాదాపు పది వేల రాత ప్రతులు, 15 వేల పరిశోధనా పత్రాలు కూడా వున్నాయి.


 ఈ ఆవరణలోనే బిర్లాలచే నిర్మింపబడిన విశ్వనాధుని ఆలయం వున్నది.  బిర్లాలచే నిర్మింపబడింది కనుక దీనిని బిర్లామందిర్ గా కూడా వ్యవహరిస్తారు.   ఈ పాలరాతి కట్టడం కాశీ విశ్వనాధుని ఆలయాన్ని పోలి వుంటుంది.  కాశీ విశ్వనాధుని ఆలయంలోకి విదేశీయులకు అనుమతి లేదు కానీ ఈ ఆలయంలో స్వామి దర్శనం ఆసక్తిగల ఎవరైనా చేసుకోవచ్చు.

ఇక్కడే భారత కళాభవన్ అనే మ్యూజియంకూడా వున్నది.  సమయాభావంవల్ల మేము చూడలేదు.  అవకాశం వున్నవారు  ఉదయం 11 గం. ల నుండి సాయంత్రం 4 గం. ల వరకు దర్శించవచ్చు.   అయితే విశ్వవిద్యాలయానికి  సెలవు  వున్న రోజుల్లో ఈ మ్యూజియం కూడా మూసివుంటుంది.

 

 

వ్యాస కాశీపూర్వం వ్యాస మహర్షి నివసించిన ప్రదేశమే వ్యాస కాశీ.  వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన వాడు.  వేద విభాగము చేసినవాడు.  అంతటి గొప్ప వ్యక్తి తన కోప కారణంగా కాశీనుంచి బహిష్కరింపబడి గంగ ఆవలి ఒడ్డున నివసించాడు.  ఆ కధేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?  పురాణ కధనం ప్రకారం పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో  కాశీలో వుండి  తపస్సు చేసుకోసాగాడు.  ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది.  మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు.  అలా మూడు రోజులయింది. 

 

ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు.  అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు.  సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి  కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది.  అందుకే వారికి అహంకారం పెరిగి  తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది.  ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు.  మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు.  అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది.  తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది.  మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది.  కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది.  ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు.  వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే పరవడి రోజుల్లో వచ్చి తన దర్శనం చేసుకోవచ్చని అనుమతిస్తాడు.

 

 

తర్వాతకాలంలో కాశీ పాలించిన రాజుల కోట అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది.  ఇప్పుడు కోటనంతా మ్యూజియంగా మార్చి పూర్వం కాశీరాజులు వాడిన అనేక సామగ్రిని అక్కడ భద్రపరిచారు.  ప్రస్తుతం ఈ మ్యూజియంకి మైంటినెన్స్ సరిగ్గా లేదనిపిస్తుంది మ్యూజియం శుభ్రత చూస్తే.  మ్యూజియం సందర్శనానికి టికెట్ వుంది.  సమయం ఉదయం 9 గం. ల నుంచి సాయంత్రం 5 గం. ల దాకా.  మధ్యలో ఒకటి రెండు గంటల విరామం వున్నది.

-పి.యస్.యమ్. లక్ష్మి

 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)