కాశీ కబుర్లు – 2
కాశీ కబుర్లు – 2
ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు చూసుకోవాల్సింది అక్కడి వాతావరణ పరిస్ధితి. కాశీ వెళ్ళటానికి, మరీ ఎండా, అతి వృష్టీ కాకుండా అనువైన సమయం అక్టోబర్ నుంచీ ఏప్రిల్ దాకా. మా ట్రిప్ మార్చి 23నుంచీ ఏప్రిల్ 3 దాకా. ఆ సమయంలో అక్కడా ఎండలు బాగానే వున్నాయి. తర్వాత రోజుల్లో మనం భరించలేనంత ఎండలు వుంటాయి. ఎండలు మనకలవాటేకదా అని బయల్దేరిపోయారనుకోండి...ఏ ఎండలు ఎలా వుంటాయో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అంతే. పైగా అక్కడ పవర్ కట్ కూడా చాలా ఎక్కువ. దాదాపు పగలంతా పవర్ వుండదు. మేమున్నచోట జనరేటర్ ద్వారా లైట్స్ మాత్రం వచ్చేవి. పగలు సగం పైగా ఫాన్ వుండేది కాదు. ఫైవ్ స్టార్ హోటల్స్ సంగతి నాకు తెలియదు. కాశీలో అవ్వికూడా వున్నాయి. నెట్ ద్వారా ముందే రిజర్వు చేసుకోవచ్చేమో చూసుకోండి.
హైదరాబాదులో మార్చి 23వ తారీకు ఉదయం 9-50 కి పాట్నా ఎక్సప్రెస్ ఎక్కాము మా గ్రూప్ ఐదుగురం. ఉదయం 10 గం. లకల్లా రైలు సికింద్రాబాద్ లో బయల్దేరింది. మా ప్రయాణం సాగీ, సాగీ, సాగీ, మధ్యలో ఇంటినుంచీ తెచ్చుకున్న పులిహోరలూ, పెరుగన్నాలూ, చపాతీలూ, ఇంకా చాలా బోలెడు ఐటమ్స్ కి న్యాయం చేస్తూ, మర్నాడు సాయంకాలం 3 గం. లకు వారణాసి స్టేషన్ చేరాము. 29 గంటల ప్రయాణం. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన వారణాసి గాలి తగలగానే ప్రయాణ బడలిక అంతా ఎగిరి పోయింది.
సామానుతో బయటకు వచ్చి, 2 ఆటోల్లో మా సామానుతో సహా ఎక్కి గడోలియాలోని శ్రీ సాయి విశ్వనాధ అన్నపూర్ణ సేవాసమితివారి సత్రంకి చేరుకున్నాము. ఈ సత్రాన్ని సింపుల్ గా బనారస్ లాడ్జి అంటే చాలామందికి అర్ధమవుతుంది ఇది విశ్వనాధుని మందిరానికి వెళ్ళే దోవలో మైన్ రోడ్డు మీదే వుంది. కాశీలో వసతికి ఇబ్బంది లేదు. అనేక సత్రాలు, హోటల్స్ వున్నాయి. సత్రాలలో కూడా ఎటాచ్డ్ బాత్ రూమ్స్, ఎసీ రూమ్స్ వుంటాయి. సత్రాలని ఫ్రీ అనుకునేరు. వాటికి అద్దెలు కూడా వుంటాయి. మేమున్నది రెండు వరస గదులు, ప్రతి గదిలో రెండు బెడ్స్, కానీ ఒకే బాత్ రూమ్. పెద్ద వరండా. అందులోనే భోజనాలు. భోజనాలంటే గుర్తొచ్చింది. ఇక్కడ చాలా సత్రాలలో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫెన్ ఏర్పాట్లు వుంటాయి. ఇవి ఉచితమేగానీ, కాశీలో అన్నదాన మహాత్యాన్ని గురించి కొన్నిచోట్ల ఊదరగొడుతూ వుంటారు. అర్ధమయిందిగా. మేమున్న సత్రంలో రూ. 1516 ఇస్తే సంవత్సరంలో మనం కోరుకున్న ఒక రోజు మనమేపేరు చెప్తే ఆపేరుతో అన్నదానం జరుగుతుంది.
సాయంకాలం టిఫెన్లంటే ఇడ్లీ, వడా వూహించుకోకండి. మా సత్రంలో ఇంచక్కా రోజుకోరకం ఉప్మా పెట్టాడు. రెండు రోజులు తినేసరికి ఎక్కడ ఏముందా అని వెతుక్కోవాల్సివచ్చింది. కిందనే అయ్యర్స్ హోటల్ లో ఊతప్పం, ఇడ్లీ, వడ, దోశ దొరికాయి. పొద్దున్న రోడ్డు పక్కన వేడి వేడి ఇడ్లీ, దోశ తిన్నాము. కాఫీ, టీలకు లోటు లేదు. మంచి పాలు కూడా దొరుకుతాయి. ఇంచక్కా కొంచెం మీగడ వేసి చిక్కని లస్సీ దొరుకుతుంది. స్వీట్స్ కోవాతో చేసినవి బాగుంటాయి. గులాబ్ జామ్, జిలేబీ మనదగ్గరకన్నా అక్కడ రుచి ఎక్కువ. భోజన ప్రియులూ, ఆహారం గురించి కంగారు పడకండి. ఎటొచ్చీ యాత్రా స్ధలాల్లో తినటం అలవాటు చేసుకోవాలి.
సరే కాశీ చేరాము.....రూమ్ దొరికింది. ఇవ్వన్నీ అయ్యేసరికి సాయంకాలం అయింది. సమయం వృధా చెయ్యరాదు. రాత్రి 7 గంటలకి గంగ హారతి ఇస్తారు. గంగానదిని, ఆ హారతిని చూడాలనుకున్నాము. ఇంక కాలు నిలవలేదు. గబగబా తయారయి గంగ హారతికి బయల్దేరాము.
గంగ హారతి
కాశీలో వీధులు చాలా సన్నగా వుంటాయి. దానికి తోడు రోడ్డుకటూ ఇటూ షాపులు, కొనేవారు, ఎప్పుడూ రద్దీగా వుంటాయి. ఆయాసం, జన సమ్మర్దం ఎక్కువ పడని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వుండాలి. మనుషులు నడవటమే కష్టమయిన ఈ రోడ్లలో రిక్షాలు కొన్నిసార్లు దొరుకుతాయిగానీ ఆటోలకి ఆంక్షలున్నాయి. కనుక మనం సమయానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడకే ఉత్తమం. (మేమున్న చోటునుంచీ దేవాలయాలకీ, గంగ ఒడ్డుకీ మేము నడిచే వెళ్ళేవాళ్ళం.).
రోజూ సాయంత్రం 7 గంటలకి దశాశ్వమేధఘాట్ లో రెండుచోట్ల గంగమ్మతల్లికి హారతి ఇస్తారు. గంగ ఒడ్డున మెట్లమీద నుంచీ, ఒక్కో చోటా 7గురు చొప్పున హారతి ఇస్తారు. 45 నిముషాలుపాటు సాగే ఈ హారతి దృశ్యం కన్నులపండుగగా వుంటుంది. దీనిని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తారు. టూరిస్టులను ఆకర్షించటానికి ఒక ప్రత్యేక సౌకర్యం. గంగానదిలోని బోట్లోంచి హారతి చూడవచ్చు. రేటంటారా, బేరమాడటంలో మీ ప్రతిభ బయటపడేది ఇలాంటిచోట్లేనండీ. ఒకళ్ళిద్దరున్నా ప్రత్యేక పడవకి రూ. 200 నుంచీ, హారతి మొదలయ్యే సమయానికి మనిషికి రూ. 20 చొప్పున కూడా ఎక్కించుకుంటారు. హారతి జరిగినంతసేపూ పడవ కదలదు. తర్వాత దానికీ కదలటం వచ్చని నిరూపించటానికి అలా తిప్పి తీసుకొస్తారు. ఏదైనా పడవలోంచి హారతి ఎదురుగా చూడవచ్చు. అదే మెట్ల మీదనుంచి అయితే వెనకనుంచో, పక్కనుంచో చూడాలి.
హారతి సమయంలో గంగ ఒడ్డున దీపాలకి గిరాకీ ఎక్కువ. యాత్రీకులంతా మగ, ఆడ తేడాలేకుండా తాముకూడా ఒడ్డున అమ్మే పూలు, దీపాలు కొని గంగకి హారతి ఇవ్వటానికి ఉత్సాహ పడతారు. దీపాల వెలుగులతో కళ కళలాడే ఆ సంబరం చూసి తీరాలి.
మేము హారతి సమయానికి ఒక బోటులో ఎక్కాము. అందులో రామకృష్ణ మఠం స్వామి శారదాత్మానంద స్వామి వున్నారు. శిష్యులతో కలిసి కాశీ యాత్రకి వచ్చారు. వేరే ప్రదేశాలు కూడా చూసుకుంటా, ఇక్కడనుండి కలకత్తాలోని బేలూరు రామకృష్ణ మఠం వారి ఈ యాత్రలో చివరి మజీలీ.
హారతి చివరలో పడవల్లో పిల్లలు రకరకాల పౌరాణిక వేషాలలో పడవలలో ఊరేగింపుగా వచ్చారు. గంగమ్మ ఒళ్ళో ఆ ఊరేగింపు కూడా అందంగా వుంది. శ్రీరామనవమి స్పెషల్ అనుకుంటా ఆ ఊరేగింపు, గంగ ఒడ్డున జరిగిన నాట్య ప్రదర్శన. అవ్వన్నీ చూసిన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ మా మజిలీ చేరాం. సత్రంవాళ్ళు పెట్టిన వేడి వేడి రైస్ పొంగలి, వడ తిని విశ్రాంతి తీసుకున్నాం.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)