కాశీ కబుర్లు

 

 

 

కాశీ కబుర్లు

 


                                                           

ఈ వారంనుంచీ మీకోసం కాశీ కబుర్లు మొదలు పెడుతున్నాము.  కాశీ వెళ్ళొచ్చారా?  లేక వెళ్ళబోతున్నారా?  ఏదైనా పర్వాలేదండీ.  వెళ్ళొస్తే మీ అనుభవాలు ఇక్కడ పంచుకోండి.  వెళ్ళేవాళ్ళకి ఉపయోగ పడతాయి.  వెళ్ళబోతున్నారా?  అయితే ఈ కబుర్లు వినెయ్యండి..అదేనండీ  ..  చదివెయ్యండి.  మీకు ఉపయోగ పడతాయి.

 

కాశీ…ఆ పేరు చెబితేనే ఏ హిందువుకైనా మనసు ఉప్పొంగుతుంది.  ఆ క్షేత్రాన్ని దర్శించనివారు ఎప్పుడెప్పుడు దర్శిస్తామా అని తహతహలాడుతారు.  దర్శించినవారు ఆ కమనీయ దృశ్యాలను తలచుకుంటూ, పునః దర్శన ప్రాప్తి ఎప్పుడా అని ఎదురు చూస్తారు.  జీవితంలో ఒక్కసారైనా ఎంతో పుణ్యప్రదమైన కాశీ దర్శించి, పావన నదీమతల్లి గంగలో స్నానం చేసి, కాశీ విశ్వేశ్వరునికి మనసారా అభిషేకం చేసి, అమ్మ విశాలక్ష్మిని కుంకుమతో అర్చించి, అన్నపూర్ణాదేవిని దర్శించి ఆశీర్వాదం పొందాలని హిందువైన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.  కొందరైతే తమ జీవిత తుది సమయంలో కాశీలో గడిపి, అక్కడే ప్రాణాలొదలాలనుకుంటారు.  అనుకున్నంతమాత్రాన అయ్యేపని కాదది.   పూర్వ జన్మ సుకృతానికి, ఈ జన్మలో మనంచేసిన పుణ్యకార్యాలు తోడయితే ఆ కాశీ విశ్వేశ్వరుని దయ పొందవచ్చు. 

 

ఇంతకీ కాశీలో అంతిమ శ్వాస విడవాలనే అంత కోరిక ఎందుకంటే, కాశీలో మరణించినవారికి పునర్జన్మ వుండదట.  వారెవరైనా సరే..మనిషిగానీ, పశుపక్ష్యాదులుగానీ,  కాశీలో ప్రాణం విడిచే ఏ ప్రాణికైనాసరే, అంతిమ ఘడియలలో, ఆ ప్రాణి కుడి చెవిలో సాక్షాత్తూ విశ్వేశ్వరుడు ఉపదేశిస్తాడుట.  అందుకనే అక్కడ మరణించినవారికి మరు  జన్మ వుండదనీ, మోక్షం తప్పక లభిస్తుందనీ అందరి విశ్వాసం.

 

అంతటి మహా పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావాలని అనుకుంటేనే ఎన్నో జన్మల పాపాలు పటాపంచలవుతాయట.   ఆ నామమాత్ర సంకల్పమే అంత గొప్ప శక్తికలదయితే మరి నిజంగా సంకల్పించి వెళ్ళి వస్తే….కానీ వెళ్ళి రావటానికి మన జీవిత గమనంలో అనేక అడ్డంకులు.   ఆర్ధిక వెసులుబాటులేక కొందరు .. అమ్మో అంత దూరం వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో, దాన్ని భరించగలమో లేదో అని భయంతో వెళ్ళలేకపోతే, కొందరు  అన్నీ చూడటానికి ఎన్ని రోజులు పడుతుందో, అంత సెలవు దొరుకుతుందో లేదోనని ఆందోళన పడతారు.  కొందరికి, తీరా కుటుంబాలతో వెళ్తే అక్కడ వుండటానికీ వాటికీ సరైన వసతి దొరుకుతుందో లేదో, అసలే రోజూ వేలల్లో జనాలొచ్చే ప్రదేశమది అనే ఆలోచన. 

 

పూర్వకాలంలో కాశీకి వెళ్ళటం కాటికి వెళ్ళటం సమానమనే వాళ్ళు.  ఈ నానుడి అలవాటయ్యే కాబోలు మనవాళ్ళు చాలామంది కాశీ వెళ్ళిరావటంకంటే అమెరికా వెళ్ళిరావటం సులువనుకుంటున్నారు.  అలాంటివాళ్ళంతా ఓస్ కాశీ ప్రయాణం అంటే ఇంతేనా వెళ్ళోచ్చేస్తే పోలా అనుకుంటారు ఇది చదివాక.  ఇంత గ్యారంటీ ఇచ్చానని మూటా మల్లే కట్టేయకండి...ముందు అక్కడి విశేషాలు తెలుసుకోండి.

 

ఏదో ఒక ఆలోచనలతోనో లేక అనుమానాలతోనో కాశీ ప్రయాణం వాయిదా వేసుకునేవారికి కాశీ ప్రయాణానికి భయ పడక్కరలేదు, సరైన ప్రణాళిక వేసుకుంటే, ఏ ఇబ్బందీ లేకుండా మీ బడ్జట్ లోనే వెళ్ళిరావచ్చని చెప్పాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టామీ కబుర్లు. ఈ కబుర్లు వినెయ్యండి..అదేనండి చదివెయ్యండి.  అక్కడ పరిస్ధితులన్నీ తెలుసుకోండి.  మీ కాశీ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోండి.  ఇంక మొదలెట్టనా మరి…

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)