కాశీ కబుర్లు – 3
కాశీ కబుర్లు – 3
భోజన, వసతులు
రైలు దిగంగానే మేము వసతి చూసుకోవటం, తర్వాత గంగా హారతికెళ్ళటంతో వసతి గురించి మీకు వివరాలు చెప్పలేదు కదూ. మేము వెళ్ళి 7 సంవత్సరాలు అయింది. అందుకని నేను చెప్పే రేట్లు ఇప్పుడు మారి వుంటాయి. చూసుకోండి. కాశీలో వసతికి ఇబ్బంది లేదు. అనేక సత్రాలు, హోటల్స్ వున్నాయి. సత్రాలలో కూడా ఎటాచ్డ్ బాత్ రూమ్స్, ఎసీ రూమ్స్ వుంటాయి. సత్రాలని ఫ్రీ అనుకునేరు. వాటికి అద్దెలు కూడా వుంటాయి. మేమున్నది నాన్ ఎ.సి. రెండు వరస గదులు, ప్రతి గదిలో రెండు బెడ్స్, కానీ ఒకే బాత్ రూమ్, రోజుకి అద్దె 500 రూ. లు. పెద్ద వరండా. అందులోనే భోజనాలు.
భోజనాలంటే గుర్తొచ్చింది. ఇక్కడ చాలా సత్రాలలో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫెన్ ఏర్పాట్లు వుంటాయి. ఇవి ఉచితమేగానీ, కాశీలో అన్నదాన మహాత్యాన్ని గురించి కొన్నిచోట్ల ఊదరగొడుతూ వుంటారు. అర్ధమయిందిగా. మేమున్న సత్రంలో రూ. 1516 ఇస్తే సంవత్సరంలో మనం కోరుకున్న ఒక రోజు మనమేపేరు చెప్తే ఆపేరుతో అన్నదానం జరుగుతుందని చెప్పానుకదా. ఆ రోజు దాతలు చాలామంది వుండవచ్చు...వుండాలి కూడా..ఎందుకంటే మేమున్న సత్రంలో కొన్ని రోజులు రోజుకి 200, 300 మంది పైన భోజనం చేశారు. అలాంటప్పుడు అంతమందికి భోజనం పెట్టటానికి డబ్బు సరిపోవాలికదా. పెద్ద గ్రూప్స్ కూడా వస్తూ వుంటాయి. బహుశా టూరిస్టు బస్సులవాళ్ళనుకుంటా. వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఆ హడావిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చుగానీ ఊళ్ళనుంచి వచ్చిన గ్రూప్స్ అంతా ఒక చోట వుండాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవుకదా. పైగా కొన్ని చోట్ల వంటలకికూడా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు.
నేను మా నాన్నగారు కీ.శే. శ్రీ పులిగడ్డ జనార్దనరావుగారి పేరు మీద మేముండగానే ఒక రోజు అన్నదానం చేయించాను. అన్నదానం చేసేవారు వారికిష్టమైతే వడ్డన కూడా చెయ్యవచ్చు. మనకీ సంతోషం, తృప్తి కదా. సాధారణంగా మనం వున్న చోట మనం మధ్యాహ్నం భోజనం, రాత్రికి ఫలహారం చేస్తామనుకుంటారు. ఒకవేళ మనం అక్కడ భోజనం చెయ్యకపోతే ఆ విషయం వాళ్ళకి ఉదయమే చెప్పాలి. మేము మాకు తెలియక ముందు మా సత్రంలో చెప్పకుండా వేరే చోట భోజనం చేశాము. మేనేజర్ కొంచెం కోపం చేశాడు. మాకు ఆ పదార్ధాలు వృధా అవుతాయని.
వేరే చోట ఎక్కడన్నా భోజనం చేద్దామనుకున్నా, ఎక్కడ చెయ్యాలనుకుంటే అక్కడవాళ్ళకి ఉదయమే చెప్పి పేర్లు రాయించుకోవాలి. మేము మా సత్రంలో, కరివెనవారి సత్రంలో, అన్నపూర్ణ ఆలయ భోజన శాలలో భోజనం చేశాం. ఎక్కడైనా మసాలాలు అవీ వుండవు. సాత్విక భోజనం. భోజనం అన్ని చోట్లా బాగున్నది. చిన్న సత్రాలలో ఆ రోజు దాతల సంఖ్యనుబట్టి పదార్ధాలు వుంటాయి. ఇంక అన్నపూర్ణమ్మది చెప్పేదేమున్నది.. కాశీలో ఎవరూ భోజనం చెయ్యకుండా వుండకూడదు అన్నది ఆవిడ అభిలాష. జగజ్జనని కదా. అక్కడ కూడా ముందు చెప్పటం మంచిది. మాకు తెలియక ముందు చెప్పకుండా వెళ్ళినా భోజనం పెట్టారు. పేరుకు తగ్గట్లే వచ్చేవారు పోయేవారు అన్నట్లు వుంటుంది. అయితే మీరెక్కడ భోజనం చేసినా మీకు తోచినంత విరాళమివ్వటం మరచిపోకండి. మనలాంటివారందరికీ ఉచితంగా భోజనం పెట్టటం కష్టంకదా. మనమున్నచోటయితే చివరికి ఒకసారికూడా ఈ విరాళాలివ్వచ్చు. వాళ్ళు విరాళాల గురించి ఎనౌన్స్ చేస్తూవుంటారుగూనీ ఎవరూ మిమ్మల్ని ఆడగరు. బలవంతంచెయ్యరు. ఇంకొక్క సంగతి..కొన్ని కులాల పేరుతో వున్న సత్రాలలో కేవలం వారి కులంవారికి మాత్రమే భోజనాలు పెడతారు. చూసుకోండి.
సాయంకాలం టిఫెన్లన్నానని ఇడ్లీ, వడా వూహించుకోకండి. మా సత్రంలో ఇంచక్కా రోజుకోరకం ఉప్మా పెట్టారు. రెండు రోజులు తినేసరికి ఎక్కడ ఏమున్నాయా అని వెతుక్కోవటం మొదలు పెట్టాం. కిందనే అయ్యర్స్ హోటల్ లో ఊతప్పం, ఇడ్లీ, వడ, దోశ దొరికాయి. పొద్దున్న రోడ్డు పక్కన వేడి వేడి ఇడ్లీ, దోశ తిన్నాము. కాఫీ, టీలకు లోటు లేదు. మంచి పాలు కూడా దొరుకుతాయి. ఇంచక్కా కొంచెం మీగడ వేసి చిక్కని లస్సీ దొరుకుతుంది. స్వీట్స్ కోవాతో చేసినవి బాగుంటాయి. పూరీ, గులాబ్ జామ్, జిలేబీ మనదగ్గరకన్నా అక్కడ రుచి ఎక్కువ. భోజన ప్రియులూ, ఆహారం గురించి కంగారు పడకండి. ఆహార పదార్ధాలేవీ మరీ ఎక్కువ ధర కూడా వుండవు. ఎటొచ్చీ యాత్రా స్ధలాల్లో తినటం అలవాటు చేసుకోవాలి. కొత్త ప్రదేశం, సరిగ్గా తినలేకపోయినా పాలు, లస్సీలు తాగి గడిపెయ్యచ్చు.
కాశీలోని కొన్ని ఆశ్రమాల పేర్లు అడ్రసులు ఇస్తున్నాను. వీటన్నింటికీ మేము వెళ్ళి చూడలేదు. కేవలం నేను సేకరించిన వివరాలేనని గమనించండి. శ్రీ రామ తారక ఆంధ్రాశ్రమం, మానసరోవర్, బెంగాలీటోలా, పాండేహవేలి, వారణాసి – 221 001
2 భోలానంద సన్యాస ఆశ్రమ్, పాండే హవేలి, వారణాసి – 221 001
3, శ్రీ శృంగేరి శంకర మఠ్, కేదారఘాట్, వారణాసి
4. శ్రీ సాయి విశ్వనాధ అన్నపూర్ణా సేవాసమితి, దశాశ్వమేధ రోడ్, గడోలియా (ఫోన్ నెం. 0542 2090801) (మేము వున్నది)
5. కాశీ జంగంబాడి మఠ్, గడోలియా (పైదానికి చాలా దగ్గర..గడోలియా టాంగా స్టాండు దగ్గరే రెండూ)
కాశీలో అనేక సత్రాలు వున్నాయి. ఇవేకాక కొందరు ఇళ్ళల్లో కూడా వసతి ఏర్పాటు చేస్తారట. వసతికి ఇబ్బంది వుండదు. కొంచెం ఓపిగ్గా వెతకాలి. బెంగాలీ టోలా గల్లీ, ఆ చుట్టుపక్కల చాలా గెస్ట్ హౌస్లు, లాడ్జిలు వున్నాయి. అన్ని సత్రాల అడ్రసులు అక్కడ రిక్షా, ఆటోవాళ్ళకి తెలుసు. అందుకే వసతికి, ఆహారానికీ ఇబ్బంది వుండదుగానీ ఆ పరిసరాలకి మీరు ఎడ్జస్టు అవ్వాలి. అంతే.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)