కార్తీక పూర్ణిమ ఎప్పుడు.. పూర్ణిమ రోజు ఏ ఏ పనులు చేస్తే మంచిది!

 

కార్తీక పూర్ణిమ ఎప్పుడు.. పూర్ణిమ రోజు ఏ ఏ పనులు చేస్తే మంచిది!

మాసాలన్నింటిలోకి కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హరిహరులకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైనది. అందుకే శివాలయాలు, విష్టువాలయాలు పూజలతోనూ, భక్తులతోనూ కిటకిటలాడతాయి. ఇక కార్తీకమాసంలో దీపారాధనకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఈ ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నవంబర్ 26 వ తేదీన మధ్యాహ్నం 03:53 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ 27 వ తేదీ 02-45 గంటలకు ముగుస్తుంది. దీనిప్రకారం కార్తీక పూర్ణిమను నవంబర్ 27వ తేదీ సోమవారం జరుపుకుంటారు.  ఈాసారి కార్తీక పూర్ణిమ సోమవారం రావడంతో ఈ పూర్ణిమ మరింత విశిష్టతను సంతరించుకుంది.

ఈ కార్తీకమాసంలో పూర్ణిమ సోమవారం రావడం మరింత పుణ్యప్రదం. కార్తీక పూర్ణిమ రోజు చాలామంది సత్యనారాయణ వ్రతం చేస్తారు. దీనివల్ల విష్ణుమూర్తి కృపకు పాత్రులవుతారని నమ్మకం. ఇంకా కార్తీక పూర్ణిమ రోజు  ఉపవాసం ఉండాలి.  ఉపవాసం ఉంటే విష్టుమూర్తి సంతోషిస్తాడు. ఉదయాన్నే గంగా స్నానం, ఉపవాసం, దేవుడి దర్శనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, దానదర్మాలు చేయడం మంచిది.

కార్తీక పూర్ణిమ రోజు పారే నీటిలో దీపాలను వదలడం ఎంతో మంచిది.  ఈ దీపాలు పితృదేవతలకు దారి చూపిస్తాయని అంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే కార్తీక మాస పూర్ణిమ రోజు సాయంత్రం సమయంలో చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఇది చాలా పవిత్రమైనది. దేవాలయంలో పిండి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. సంవత్సర కాలంలో దేవుడి ముందు దీపాలు వెలిగించని వారికి కూడా ఈరోజున దీపం వెలిగిస్తే అన్ని రోజులు దేవుడి ముందు దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది. కేవలం పిండి ప్రమిదలే కాకుండా ఉసిరికాయతో దీపం పెట్టడం కూడా ఎంతో శ్రేష్టం.