అమ్మవారి అగ్ని స్వరూపం-జ్వాలాముఖి

 

 

అమ్మవారి అగ్ని స్వరూపం-జ్వాలాముఖి

 

 

అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో, మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారిని  అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. అదే హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం!

దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుందేనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా! వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం.

 

 

జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించినవారు భంగపడకా తప్పలేదు. మొగల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా... నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తల్చుకుంటూ వెనుదిరగక తప్పలేదు.

 

జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారికి అమ్మవారు కలలో కనిపించి... తన ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు సరికదా... భగభగ మండుతున్న మంట మాత్రం కనిపించిందట. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పటికీ అక్కడ ‘జ్వాల’ తప్ప మరే విగ్రహమూ కనిపించదు.

 

దౌలాధర్ పర్వతాల దిగువున... ధర్మశాల- సిమ్లా రోడ్డు మార్గం పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ, నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపుని దర్శించుకుని పునీతులవుతుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తర్ప్రదేశ్లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాధ్లోని జ్వాలామాయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తుంటారు.

- నిర్జర.