జీమూతవాహనుడు
జీమూతవాహనుడు
పాము అన్న మాట వినిపిస్తే చాలు మనకి కంపరమెత్తిపోతుంది. పాము కనిపిస్తే దాని అంతు చూసేదాకా నిద్రపోము. ఇక ఈ రోజుల్లో త్యాగం అన్నమాట కూడా మూర్ఖత్వానికి మారుపేరుగా నిలిచిపోయింది. అలాంటిది ఒక పాము కోసం ఓ రాకుమారుడు తన జీవితాన్నే పణంగా పెట్టిన కథ వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే జీమూతవాహనుడి కథ!
పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమారుడే జీమూతవాహనుడు! రాకుమారుడైన జీమూతవాహనుడు చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజల పట్లే కాదు, అన్నిప్రాణుల పట్లా కారుణ్యంతో ఉండేవాడు. తండ్రి తరువాత రాజ్యాన్ని పాలించేది తానేనన్న అహంకారం కానీ, తన మాటకు ఎదురులేదన్న దుడుకు కానీ అతనిలో లేశమైనా కనిపించేవా కావు. చక్రవర్తికి వయసు మీద పడగానే తన రాజ్యభారాన్ని జీమూతవాహనుడికి అందించి, వానప్రస్థానికి బయల్దేరాడు. తల్లిదండ్రుల పట్ల అనురాగం కలిగిన జీమూతవాహనుడు, తరచూ వారిని సేవించుకునేందుకు అడవిలో ఉన్న పర్ణశాలకు చేరుకునేవాడు.
ఒకసారి అడవిలో విశ్వవసు అనే రాజుగారి కుమార్తె అయిన మలయవతిని చూసి ప్రేమలో పడ్డాడు జీమూతవాహనుడు. ఆమె ఫలానా రాజుగారి కుమార్తె అన్న విషయం అతనికి తెలియదు. తనను జీమూతవాహనుడు చూసిన విషయం మలయవతికి తెలియదు. కానీ ‘నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు వారితో పెళ్లి చేస్తాం.’ అని మలయవతి అన్నగారైన మిత్రవసు అడిగినప్పడు. ‘ఈ ప్రపంచలోకెల్లా ఉత్తముడైన జీమూతవాహనుడినే నేను పెళ్లి చేసుకుంటాను’ అని తన మనసులోని మాటను చెబుతుంది మలయవతి. తన చెల్లెలి కోరికను నెరవేర్చేందుకు జీమూతవాహనుడి దగ్గరకు బయల్దేరతాడు మిత్రవసు. కానీ తాను అడవిలో ఒక అందగత్తెను చూశాననీ, ఆమెను తప్ప వేరెవ్వరినీ వివాహం చేసుకోనని కుండబద్దలుకొడతాడు జీమూతుడు. తనను వివాహం చేసుకునేందుకు జీమూతవాహనుడు తిరస్కరించాడని తెలియగానే ఆత్మహత్యకు పాల్పడుతుంది మలయవతి. ఆఖరి నిమిషంలో అసలు విషయం తెలియడంతో వారి ప్రేమకథ సుఖాంతమవుతుంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది…
ఒకరోజు జీమూతుడు అడవిలో విహారం చేస్తుండగా ఒక తెల్లని గుట్ట కనిపించింది. అదేమిటా అని కుతూహలంతో దగ్గరకు వెళ్లి చూసిన అతను, అవన్నీ ఎముకుల పోగులు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరించిన జీమూతవాహనుడికి ఒక ముసలి పాము కనిపిస్తుంది. ‘అమ్మా! నువ్వెవరు? ఎందుకలా ఏడుస్తున్నావు? ఆ ఎముకుల గుట్ట ఏమిటి?’ అని అడుగుతాడు జీమూతుడు. ‘ఏం చెప్పమంటారు! ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నాడు. రోజూ మా మీద పడి మమ్మల్ని చీల్చి చెండాడుతున్నాడు. అతని బాధ తట్టుకోలేని మేము- ‘ఇలా రోజూ మా మీద పడి అలజడిని కలిగించవద్దు. రోజూ మాలో ఎవరో ఒకరం స్వచ్ఛందంగా నీకు ఆహారంగా మారతాము’ అని వేడుకున్నాము. రేపు నా కుమారుడైన ‘శంఖచూడు’ని వంతు. అందుకే ఈ వేదన!’ అని చెప్పుకొచ్చింది ఆ వృద్ధురాలు. ఆ మాటలు విన్న జీమూతవాహనుడి మనసు కరిగిపోయింది. ‘తాను జీవితంలో అన్ని సుఖాలనూ చవిచూశాడు, సకలభోగాలనూ అనుభవించేశాడు. పైగా గరుత్మంతుని హింస ఇలాగే కొనసాగితే, ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి ఏదీ మిగలదు. శంఖచూడునికి బదులుగా తను కనుక గరుత్మంతునికి ఆహారంగా మారితే, అతని ప్రాణాన్ని కాపడటమే కాదు… ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లవుతుంది.’ ఇలా పరిపరి విధాలుగా ఆలోచించిన జీమూతవాహనుడు, శంఖచూడునికి బదులుగా మర్నాడు తానే గరుత్మంతునికి ఆహారంగా మారేందుకు సిద్ధపడ్డాడు.
మర్నాడు గరుత్మంతుడు అనుకున్న సమయానికి రానేవచ్చాడు. భారీకాయుడైన గరుత్మంతునికి బలిపీఠం మీద ఉన్నది ఎవరో తెలియలేదు. తన మానాన తాను, ఆ శరీరాన్ని పొడిచి పొడిచి చంపసాగాడు. ఇంతలో అక్కడి చేరుకున్నాడు మిత్రవసువు. ‘గరుత్మంతా! నీ ముందు ఎవరు ఉన్నారో కూడా సరిచూసుకోనంతగా కళ్లు మూసుకుపోయాయా! నీ కాలి కింద ఉన్నది నాలాంటి మనిషే కానీ పాము కాదు. దయచేసి అతణ్ని వదిలిపెట్టు. ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధపడిన అతని త్యాగాన్ని గుర్తించు’ అని వేడుకున్నాడు. మిత్రవసువు మాటలకి కింద చూసిన గరుత్మంతునికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. కానీ జీమూతవాహనుడిలో ప్రాణం అప్పటికే అడుగంటింది.
చేసిన తప్పుకు తనను తాను తెగ నిందించుకున్నాడు గరుత్మంతుడు. కానీ ఏం లాభం! జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్ని జీమూతవాహనుడి కుటుంబం భోరున విలపించసాగింది. వారి దుఃఖాన్ని చూసిన గరుత్మండికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే స్వర్గలోకానికి వెళ్లి అమృతభాండాన్ని తీసుకువచ్చాడు. దానితో జీమూతవాహనుడిలో కొడగట్టిన ప్రాణం తిరిగి మేల్కొంది. తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్న జీమూతవాహనుడు సంతోషించలేదు సరికదా, సాటి జీవులు నిరంతరం గరుత్మంతునికి ఆహారంగా మారుతుంటే దాన్ని చూస్తూ గడిపే జీవితం ఎందుకు అని దుఃఖించాడు.
జీమూతవాహనుడి దుఃఖం గరుత్మంతునిలో సైతం పరివర్తన కలిగించింది. ఇకమీదట తాను పాముల జోలికి పోనని జీమూతునికి వాగ్దానం చేశాడు. అంతేకాదు తాను తెచ్చిన అమృతాన్ని ఆ ఎముకుల గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నింటినీ తిరిగి బతికించాడు. అలా ప్రాణం ఎవరిదైనా ఒకటే అని నిరూపించిన జీమూతవాహనుడు, తన దీక్షతో ఏకంగా ఒక జాతినే కాపాడినవాడయ్యాడు.
- నిర్జర.