నవవిధ భక్తి

 

 

 

నవవిధ భక్తి

భగవంతుని సాన్నిధ్యంలో నిరంతరం నిలిచేందుకు ఒక్కొక్కరిదీ ఒకో మార్గం. వాటిలో ముఖ్యమైన వాటిని నవవిధ భక్తులుగా పేర్కొన్నారు పెద్దలు. బాబా చరిత్రను చదివినవారికి అందులో హేమాడ్ పంతు మాటల్లోనూ, సాక్షాత్తూ బాబా పలుకుల్లోనూ నవవిధ భక్తి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇక భాగవతంలోనూ ప్రహ్లాదని మాటల్లో నవవిధ భక్తులు వినిపిస్తాయి.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్
అర్చనం వన్దనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్.

శ్రవణం: భగవంతుని గురించి శ్రద్ధగా వినే ప్రతి మాటా, తెలియకుండానే మన మనసుని ప్రభావితం చేస్తుంది. అందుకే భక్తులు సత్సంగం పేరుతో నలుగురూ ఒకచోటకి చేరి నాలుగు మంచి మాటలు చెప్పుకొనే అవకాశాన్ని వదులుకోరు. మరణం సమీపిస్తోందని తెలిసినవారు సైతం ఆధ్యాత్మిక విషయాలను వింటూ చనిపోవాలని కోరుకుంటారు. సాక్షాత్తూ భాగవతమే ఇందుకు ఉదహరణ! తాను శాపవశాన మరో వారం రోజులలో చనిపోతానని తెలిసిన పరీక్షిత్తు మహారాజు, శుక మహర్షి ద్వారా భాగవతాన్ని వినాలనుకున్నాడు.

కీర్తనం: భగవంతుని లీలలను పాడుతూ, ఆడుతూ మైమరచి… తానను తానే కీర్తించుకుంటున్నానంతగా భగవంతునిలో లీనమవ్వడమే కీర్తనం. భారతదేశంలో భక్తి సామాన్యులకు మరింత చేరువయ్యేందుకు తోడ్పడిన ‘భక్తి ఉద్యమం’లో కీర్తనం ఒక ముఖ్య భాగం. మీరా, తుకారాం, చైతన్య మహాప్రభు మొదలుకొని తెలుగునాట త్యాగయ్య, అన్నమయ్య వరకూ భగవంతుని వేనోట కీర్తించి తరించినవారే.

స్మరణం: ‘యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్‌, విముచ్యతే…’ అని విష్ణుసహస్రానామం ఆరంభంలోనే కనిపిస్తుంది. స్మరిస్తే చాలు ఈ భవసాగరం నుంచి శాశ్వతంగా విముక్తిని ప్రసాదిస్తాడు అని దీని అర్థం. భగవంతుని సదా స్మరిస్తూ ఉంటే, కొన్నాళ్లకి ఆ స్మరణ అసంకల్పితంగానే మన మనసులో మెదులుతూ ఉంటుందని పెద్దల అనుభవం. మనం దేనినైతే నిరంతరం తల్చుకుంటూ ఉంటామో దాన్ని తప్పక పొందగలం అని కొత్తగా వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా చెబుతున్నాయి. భక్తులకి కావల్సింది కూడా అదే కదా!

పాదసేవనం: గరుత్మంతునిలా నిరంతరం స్వామివారి పాదాల చెంత మనం ఉండలేకపోవచ్చు. లక్ష్మీదేవిలాగా ఆయన పాదాలను తాకలేకపోవచ్చు. కానీ ఆ పాదుకల మీద నిరంతరం మన ధ్యాసను నిలిపినా చాలు, అవి మనల్ని ఈ సంసారంలో నుంచి తేలికగా నడిపించి వేస్తాయి. సత్పురుషుల పట్లా, భగవంతుని పట్లా మనకి ఉన్న వినమ్రతకు గుర్తుగా పాదుకలను పూజిస్తాము. అదే పాదసేవనంతో సమానం!

అర్చనం: భగవంతుని ధూపదీపనైవేద్యాలతో, పూజా క్రతువులతో, షోడశోపచారాలతో… ఇవేవీ కాకున్నా సాక్షాత్తూ శ్రీకృష్ణుడే సెలవిచ్చినట్లుగా ‘పత్రం పుష్పం ఫలం తోయం(నీరు)’…. ఎలాగైనా కానీ, వేటితోనైనా కానీ తనను శ్రద్ధగా పూజిస్తే చాలు ఆ భగవంతునికి మన భక్తి ని అందించినట్లే!

వందనం: వయసులోనైనా, జ్ఞానంలోనైనా, వ్యక్తిత్వంలోనైనా మనకంటే పెద్దలు కనిపిస్తే నమస్కరించడం మనకి పెద్దలు సూచించిన సంస్కారం. మనసావాచాకర్మణా నిన్ను నేను గౌరవిస్తున్నానన్న భావనకు వందనం ఒక సూచన. వందనం అంటే అభివాదమే కాదు స్తుతించడం, కృతజ్ఞతలు తెలుపడం అన్న అర్థాలు కూడా ఉన్నాయి. భగవంతుని పట్ల పరిపూర్ణమైన వినమ్రతను మనసులో నింపుకోవడమే దీని భావమై ఉంటుంది.

దాస్యం: దాస్యం అన్న మాటలోనే చిన్నతనం ధ్వనిస్తుంది. హోదాపరంగానో, డబ్బుకోసమో ఒకరి కింద ఊడిగం చేయడం వల్ల ఎవరి అభిమానమైనా దెబ్బతింటుంది. కానీ ఆ అభిమానంతోనే ఒకరికి వీలైనంత సేవ చేయాలనుకోవడం, ఇద్దరిలోనూ ఉన్నతత్వాన్ని సూచిస్తుంది. హనుమంతుడు ఎంతటివాడు? సాక్షాత్తూ చిరంజీవులలోనే ఒకడు! కానీ మానవరూపంలో ఉన్న రాముని కోసం ఏ పనికైనా సిద్ధపడ్డాడు. సముద్రాన్ని లంఘించినా, సంజీవిని వెంటతెచ్చినా… తాను శ్రీరామునికి ఉపకారం చేస్తున్నానన్న భావనతో చేయలేదు. ఆయనకు సేవ చేసే అవకాశం వచ్చిందన్న సంబరంలో చేశాడు.

సఖ్యం: శ్రీకృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే అయినా కుచేలుడు, అర్జునుడు కొన్ని సందర్భాలలో ఆయనను స్నేహితునిగానే భావంచారు. తమ పరిమితులను గ్రహిస్తూనే నేస్తంగా ఆయన దగ్గర మంచి విషయాలెన్నో తెలుసుకున్నారు. గోపికలు సైతం శ్రీకృష్ణుని సఖునిగానే భావించి ఆరాధించారు. సఖుడు అన్న మాటలోనే ఒక తెలియని చనువు ఉంది. ఆయన మనవాడే అన్న ఆత్మీయత ఉంది. నిరంతరం నా తోడుగా ఉంటాడన్న భరోసా ఉంది. అందుకే సఖ్యం కూడా నవవిధ భక్తులతో ఒకటిగా ఎంచబడింది.

ఆత్మనివేదనం: నిరాకారుడు, నిరంజనుడు అయిన పరమాత్మకు సమానంగా మనం దేనిని నివేదించగలం. ఈ దేహంతో మనం పొందిన ఆస్తిపాస్తులను కాదు, ఈ దేహమూ కాదు- ఎప్పటికైనా ఇవన్నీ నశించిపోయేవే! ఈ భౌతిక వస్తువులకు, వాటి వెనుక పడే దేహానికీ అతీతమైన ఆత్మ ఒక్కటే ఆ భగవంతునికి సరైనా కానుక. ఆత్మ ఒక్కటే శాశ్వతం అని తెలుసుకుని, ఆ ఆత్మకు తుది గమ్యం పరమాత్మ అని గ్రహించి మసలుకోవడమే ఆత్మనివేదనం.

 

- నిర్జర.