గాంధీని ఉత్తేజపరిచిన సాధువు
గాంధీని ఉత్తేజపరిచిన సాధువు
గాంధీగారి జీవిత చరిత్రను ఎప్పుడు స్మరించుకున్నా ఆయనకు ఇష్టమైన ‘వైష్ణవ జనతో…’ అన్న భజన కూడా గుర్తుకువస్తుంది. నిజమైన విష్ణుభక్తులు ఎలా ఉండాలో ఈ భజనలో సూచించారు. గాంధీగారు సదా స్మరించే ఆ భజన ఒక అసాధారణమైన సృష్టి. ఆ భజనను రాసిన వ్యక్తి కూడా అంతే అద్భుతమైనవాడు. ఆయనే గుజరాత్‌కు చెందిన ‘నర్సింహ మెహతా’. ఒక మహాత్ముడిని ప్రేరేపించిన ఆ మరో మహాత్ముడి గురించి…
భారతదేశపు మధ్యయుగాలలో సాగిన భక్తి ఉద్యమం సమాజంలో ఎంతో మార్పును తీసుకువచ్చింది. భగవంతునికి ప్రాధాన్యతను ఇస్తూనే, ఆయనను కేవలం కఠోరమైన పూజల ద్వారానే కాదు… కన్నీటితో నిండిన ఆర్తితో కూడా కొలుచుకోవచ్చునని నిరూపించాయి. భక్తి ఉద్యమం గుడిని కాదనలేదు కానీ, మనసుని కూడా ఒక గుడిగా మార్చుకోవచ్చని సూచించింది. అలాంటి సమయంలో గుజరాత్ లోని ‘తలాజా’ అనే ఊరిలో 1409లో జన్మించాడు ‘నర్సింగ్ మెహతా’. నర్సింహ్ మెహతా అతి చిన్న వయసులోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో అతని అన్నగారైన వంశీధరుడు ఉంటున్న ‘జునాగఢ్’ అనే పట్టణానికి చేరుకున్నాడు. ఈ జునాగఢ్ గాంధీ పుట్టిన పోర్‌బందర్‌కు అతి సమీపంలో ఉండటం ఒక విశేషం.
నర్సింహకు చిన్నప్పటి నుంచీ కృష్ణుడంటే మహా ప్రేమ. నిరంతరం కృష్ణ నామాన్ని జపిస్తూ, ఆయన లీలలను స్మరించుకుంటూ మైమరచిపోయేవాడు. బుద్ధిగా చదువుకోమని బడికి పంపిస్తే, తోటి పిల్లలందరినీ ఊరి చివర ఉన్న మామిడితోటలోకి చేర్చేవాడు. ఆ తోటనే బృందావనంగా భావించి అక్కడ శ్రీకృష్ణుని లీలలన్నింటినీ పిల్లలందరికీ కథలుకథలుగా చెప్పేవాడు. వారందరి చేతా కృష్ణభజన చేయించేవాడు. నర్సింహ మెహతా అన్నగారు నిరంతరం వ్యాపారంలో మునిగి ఉండటంతో ఆయనకు ఇవేవీ పెద్దగా పట్టేవి కావు. కానీ తమ పిల్లలంతా అసలు బడి మానేసి, మెహతా సాగిస్తున్న కొసరు బడిలో సమయాన్ని గడుపుతున్న విషయం అందరికీ తెలిసిపోయింది. వారంతా మెహతా వదిన దగ్గరకి వెళ్లి తమ ఆవేదన అంతా వెళ్లగక్కారు. వాళ్ల ఆవేదన కాస్తా వదినగారిలో ఆవేశంగా మారింది. తల్లిదండ్రులు లేని పిల్లవాడు కదా అని నర్సింహను తన భర్త ఎంతో గారాబంగా చూసుకుంటుంటే, ఇంత పని చేస్తాడా అని ఉడికిపోయింది. ఆ సాయంత్రం భజన కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని నిదానంగా ఇంటిని చేరుకున్న నర్సింహను చెడామడా తిట్టిపారేసింది.
వదిన ఉగ్రరూపాన్ని చూసిన నర్సింహ మెహతా హడలిపోయాడు. అతణ్ని కాచుకునేందుకు సమయానికి ఇంట్లో అన్న కూడా లేడయ్యే! మనసు విరిగిపోయిన మెహతా ఏం చేయాలో, ఎటు వెళ్లాలో దిక్కు తోచక నడుచుకుంటూ బయల్దేరాడు. వీధులు దాటిపోయాయి, ఇళ్లు దాటిపోయాయి, ఊరే దాటిపోయింది…. చూస్తూ చూస్తూ ఉండగానే అడవి మధ్యలోకి చేరుకున్నాడు మెహతా! చీకటి పడింది, చీకట్లో మెరుస్తున్న జంతువుల కళ్లు తప్ప వేరే వెలుతురు ఏదీ అతనికి కనిపించలేదు. గుడ్లగూబల శబ్దాలు తప్ప వేరే శబ్దం అతని చెవిన పడలేదు. మెహతా ఒళ్లు జలదరించింది. అతని హృదయం కంపించింది. కానీ నోట మాత్రం కృష్ణ నామస్మరణ ఆగలేదు సరికదా మరింత బిగ్గరగా కృష్ణుని స్మరించసాగాడు. మెహతా అదృష్టమో, అతని నామమహిమో కానీ అతనికి ఎదురుగా ఒక పాడుపడిన గుడి కనిపించింది.
గుడిలోకి ప్రవేశించిన మెహతా అది ఒక శివాలయమని గ్రహించాడు. మెహతా కృష్ణభక్తుడే కానీ శివకేశవులకు మధ్య బేధం లేదని తెలిసినవాడు. ఆ శివలింగాన్ని చూడగానే మెహతా మనసులోని బాధ అంతా ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆర్తిగా ఆ శివలింగాన్ని హత్తుకుపోయాడు. తనకు ఎలాగైనా దారి చూపమని వేడుకున్నాడు. ‘నువ్వే ఆ శ్రీకృష్ణుని నాకు చూపించాలని’ విలపించాడు. మెహతా కన్నీటికి శివలింగం కరగలేదు కానీ అందులోని శివుడు మాత్రం నీరైపోయాడు. వెంటనే నర్సింహ మెహతాకు దర్శనమిచ్చాడు ఆ పరమేశ్వరుడు. స్వయంగా తన ఒడిలో మెహతాను చేర్చుకుని అతడిని బృందావనానికి తీసుకుపోయాడు.
బృందావనంలో తన దివ్యనేత్రాలతో శ్రీకృష్ణుని రాసలీలలను చూసి, వేణుగానానికి చలించిపోయాడు మెహతా. ఆ తన్మయత్వంలోంచి తేరుకునేసరికి తన అన్నగారి ఇంట్లో పడి ఉన్నాడు. అప్పటి నుంచీ మెహతా మనసు కృష్ణుని మీద పూర్తిగా లగ్నమైపోయింది. ఆయన మీద భజనలను రాస్తూ, ఆయన లీలలను కీర్తిస్తూ కాలం గడపసాగాడు. యుక్తవయసు వచ్చిన తరువాత మెమతాకు పెళ్లి చేశారు కానీ అతనిలో ఎటువంటి మార్పూ రాలేదు. అతని భార్య కూడా మెహతా చూపించిన భక్తిమార్గంలోనే మునిగిపోయింది.
‘నీ భక్తి బాగానే ఉందికానీ, కాస్త బాధ్యతలను కూడా పట్టించుకో’మని మెమతాను అంతా హెచ్చరించేవారు. కానీ ‘అంతా ఆ శ్రీకృష్ణుడే చూసుకుంటాడం’టూ మెహతా వారికి చిరునవ్వుతో సమాధానమిచ్చేవాడు. సాధారణ భక్తులకైతే ఈ హెచ్చరిక సబబే, కానీ మెహతా సాధారణమైనవాడు కాదనీ, నిజంగానే అతని బాగోగులను శ్రీకృష్ణుడే చూసుకునేవాడనీ తెలియచేసే ఘటనలు అతని జీవితంలో చాలానే జరిగాయి. అలాంటి ఒక సందర్భంలో మెహతా కుమార్తెను కాపురానికి పంపేందుకు అవసరమయ్యే వ్యయాన్ని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడే ఒక ధనికుని రూపంలో అందించిన విషయం జునాగఢ్ మొత్తానికీ తెలిసిపోతుంది. దాంతో అతడిని నిజంగానే ఒక గొప్ప సాధువుగా కొలవడం మొదలుపెట్టారు. గుజరాతీ భాషలో ఆయన కృష్ణలీలలనూ, ఆ కృష్ణభక్తిలో తాను పొందిన అనుభవాలను వర్ణించడమే కాదు… ఆ భాషలో భజనలను రాయడంలోనూ ఆద్యుడయ్యాడు. అందుకే ఆయనను గుజరాతీ భాషకు ఆదికవిగా భావిస్తారు.
ఇప్పటికీ జునాగఢ్‌లో నర్సింహ మెహతా, సత్సంగాలను నిర్వహించిన ప్రదేశాన్ని ‘నర్సింహ మెహతా నొ చోరో’ పేరిట భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆయన రాసిన భజనలు ఉన్నంతకాలమూ మెహతా భక్తి కూడా నిలిచి ఉంటుంది. గాంధీకే కాదు, మరెందరికో మహాత్ములుగా మారేందుకు స్ఫూర్తినిస్తుంది.
- నిర్జర.