జపమాల ప్రాముఖ్యత (Importance of Japamala)

 

జపమాల ప్రాముఖ్యత

(Importance of Japamala)

 

''ఓం నమశ్శివాయ'' తదితర మంత్రాలను లేదా దేవుని శ్లోకాలను వేలి కణుపులు లేదా జపమాల సాయంతో గణిస్తూ అనుకున్న సంఖ్య పూర్తిచేస్తాం. మొత్తానికి దేవుడి నామస్మరణ చేసేందుకు, గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసేటప్పుడూ జపమాలను ఉపయోగిస్తాం. పూజల్లో జపమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.

 

సాధారణంగా జపమాలలో 108 పూసలు ఉంటాయి. బౌద్ధుల జపమాలలోనూ 108 పూసలే. అయితే, జపాన్ దేశస్తుల జపమాలలో మట్టుకు 112 పూసలుంటాయి. జైనుల జపమాలలో 111 ముత్యాలుంటాయి.

 

జపాన్ దేశస్తులు రావిచెట్టు కొమ్మలతో రూపొందించిన చెక్క పూసలతో జపమాలను తయారుచేస్తారు. రుద్రాక్షలతో చేసిన జపమాలలు ఎక్కువగా కనిపిస్తాయి. జనసామాన్యం వాడే జపమాలల్లో నకిలీ రుద్రాక్షలే ఎక్కువ. తులసిమాలలు కూడా విరివిగా కనిపిస్తాయి. నాగాదమను గారుడీ మాల అనేది ఒకటుంది. దీన్ని పాము ఎముకల పూసలతో తయారుచేస్తారు. ఇవి చాలా అరుదు. ఈ మాలను ధరించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు.

 

బర్మా, భారత దేశాల్లో 108 పూసల జపమాలనే ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో ఈ సంఖ్యని పరమ పవిత్రమైందిగా భావిస్తారు. హిందూ జపమాలలో ఉపయోగించే 108 సంఖ్యను మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ పరమ పవిత్రంగా భావిస్తారు. జపాన్లో చనిపోయిన వారి కర్మకాండలు జరిపించేటప్పుడు 108 దీపాలను వెలిగించి, 108 రూపాయలు దానం చేస్తారు. బర్మాలోని బుద్ధుని పాద చిహ్నంలో 108 భాగాలున్నాయి. టిబెట్టు బౌద్ధుల ''కహగ్పూర్''లో 108 పంక్తులతో లిఖించి ఉంటుంది. పెకింగ్ లో ప్రకాశవంతంగా కనిపిచే చైనీస్ వైట్ హౌజ్ లో 108 స్తంభాలు ఉన్నాయి.

 

వేలి కణుపులను లెక్కిస్తూ కూడా మంత్రాలను పఠించవచ్చు. కానీ ఇలా అయితే మర్చిపోయే అవకాశం ఉంది. కొందరు 108 ధాన్యపు గింజలను ఒక చిన్న పాత్రలో ఉంచి, మరో చిన్న ఖాళీ పాత్రను ఇంకో చేతిలో ఉంచుకుంటారు. ఒక్కో ప్రదక్షిణ పూర్తయ్యాక ఒక్కో గింజ చొప్పున రెండో పాత్రలో వేస్తారు. అలా మంత్రాలు, లేదా ప్రదక్షిణలు పూర్తిచేస్తారు. కానీ వీటికంటే జపమాల సాయంతో మంత్రోచ్చారణ లేదా ప్రదక్షిణలు చేయడం సులభం అనేది ఎక్కువమంది అభిప్రాయం.

 

దేవుని స్మరించడం, ప్రదక్షిణలు చేయడం ద్వారా ప్రశాంతత చిక్కుతుంది. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. తద్వారా శారీరక ఆరోగ్యమూ బాగుంటుంది. ఈ పనిలో జపమాల ప్రాముఖ్యం ఎనలేనిది.

Japamala, Hindu Japamala, Hindu Rudrakshamala, Importance of Japamala, Japamala in Hindu Pooja, Pradakshinas and Japamala, Japamala 108 beats