రావణాసుడి కొడుకులు ఎలా మరణించారు?

 

రావణాసుడి కొడుకులు ఎలా మరణించారు?

కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ అయ్యయ్యో, నిద్రపోతున్న వాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో హతమయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు. నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది" అని కిందపడి ఏడుస్తుంటే, రావణుడి  కుమారులు, కుంభకర్ణుడి కుమారులు అక్కడికి వచ్చారు.

వాళ్లు రావణుడితో "నాన్నగారు మీరు అంత బాధ పడకండి, మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము" అన్నారు.

అప్పుడు రావణుడు "ఇప్పటికయినా నా కోరిక తీర్చండి" అన్నాడు.

 యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. ఆ తరువాత మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు.

ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు.  రాముడు వాడిని చూసి  "విభీషణ! అంత పెద్ద శరీరముతో ఉన్నాడు. అసలు వాడెవడు" అని అడిగాడు. 

అప్పుడు విభీషణుడు "ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం" అన్నాడు.

ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడు లక్ష్మణుడితో "లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో" అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు "ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి" అన్నాడు.

అతికాయుడు "పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు" అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు 'నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను' అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు "అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే" అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి  కవచానికి తగిలి పడిపోతున్నాయి.

ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో "వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది" అన్నాడు. 

అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి అతికాయుడిని సంహరించాడు.

అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు ఒక్కసారిగా కూలబడిపోయాడు., సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి "నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది" అన్నాడు.

                                     ◆నిశ్శబ్ద.