యోగసాధన ఎందుకు ప్రాముఖ్యమైనది?

 

యోగసాధన ఎందుకు ప్రాముఖ్యమైనది?

తనలోని దైవత్వాన్ని క్రమక్రమంగా మెల్లమెల్లగా తన ఎఱుకలోకి తెచ్చుకోవడమే యోగసాధన యొక్క ప్రధాన లక్ష్యం! ఆత్మశక్తిని మనోశక్తిగా రూపాంతరం చెందించడంలో యోగసాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. మనోశక్తి అపారంగా వుంటున్నపుడు ఏకాగ్రత, బుద్ధికుశలత, ఏక సంధాగ్రాహ్యత, గ్రహణశక్తి, మానసిక వికాసం, బుద్ధి వికాసం, సూక్ష్మ బుద్ధి గ్రాహ్యత, అవగాహన శక్తి... వంటి ఎన్నెన్నో మైండ్ ఫ్యాకల్టీస్ వాటంతట అవే వృద్ధి చెందుతాయి. 

ఈ భూగోళం  సౌరవ్యవస్థలో ప్రతి పరమాణువు, ప్రతి జీవకణమూ, ప్రతి గడ్డిపోచ, ప్రతి రాయి, ప్రతి పర్వతమూ ఇంకా ఈ సౌర కుటుంబంలోని సృష్టి అంతా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం, ఒక నిర్దిష్ట లక్ష్యం, ఒక నిర్దిష్ట జీవ పరిణామం, ఒక నిర్ధిష్ట పరమార్ధకత వైపు పురోగమిస్తున్నాయి. ఈ భూమి ఇంకా సూర్యగోళం మధ్య విద్యుదయస్కాంత ఆకర్షణ శక్తి పనిచేస్తున్నది. శాస్త్రవేత్తలు దీనిని గురుత్వాకర్షణ బలం అని నామకరణం చేశారు. ఈ భూమి సౌరకుటుంబంలో ఒక భాగంగా ఉంటూ సూర్యగోళం చుట్టూ పరిభ్రమణం చేస్తున్నది. ఇది ఏ పరమార్థికత కోసం అంటే,  ఏదో ఒక లక్ష్యం, పరమార్థికత లేకుండా భూ పరిభ్రమణం, భూ ఆత్మభ్రమణం వుండవు గదా! భూమి ఒక ఆత్మ అట్లే ఇతర గ్రహాలూ ఆత్మలే, గ్రహాల చుట్టూ పరిభ్రమణం చెందుతూన్న ఉపగ్రహాలు ఆత్మలే. సూర్యగోళము ఒక ఆత్మ!

మానవుని దేహంలోని ప్రతి జీవకణమూ సూర్యకాంతితో అనుసంధానింపబడివుంది. సూర్యుని కాంతిలోని విద్యుదయస్కాంత తరంగాలు మానవుడి దేహంలోని ప్రతి జీవకణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సూర్యరశ్మి లేకుండా మానవజాతి, ఇతర ఏ జీవజాతులు ఈ భూమి మీద మనుగడ సాగించలేవు. అదేవిధంగా ఈ సౌరవ్యవస్థలోని అన్ని గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, కాళ్ళకు కనిపించని  ఇతర డైమన్షన్స్ ని లోకాలలోని సమస్త జీవజాలమూ సౌరశక్తిపై ఆధారపడి వున్నాయి. సౌరవ్యవస్థలోని సమస్తమూ ఒకదానిపైన ఒకటి ఆధారపడి వున్నాయి. మీ దేహంలోని జీవకణం  సూర్యుడిపై ఆధారపడినట్లే, సూర్యుడు కూడ మీ దేహంలోని జీవకణంపై ఆధారపడడం జరుగుతుంది.

ఈ సృష్టిలో ఒక ఎలక్ట్రాను, ఒక జీవకణమూ ఎంత ప్రాముఖ్యతను కలిగి వుంటాయో, అంతే ప్రాముఖ్యతను సూర్యుడు కూడ కలిగి వున్నాడు. ఈ సృష్టిలో సమస్తమూ ప్రాముఖ్యత గలవే సమస్తమూ విశేషమైనవే. వృక్షాలు తమ మనుగడకు కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా సూర్యరశ్మిని తీసుకుంటున్నాయి. సూర్యరశ్మి లేకుండా ఈ భూమిపైన ఒక చెట్టుకూడ జీవించదు. ఒక జీవకణం నుండి సూర్యగోళం వరకు మరి గెలాక్సీల వరకూ ప్రాణశక్తిగా పిలువబడే ఈ విద్యుదయస్కాంత తరంగాల ఆధారంగా చైతన్య పరిణామం సంభవిస్తున్నది.

భూమికి సంబంధించినంత వరకూ జంతుజాతులు, వృక్షజాతులు, క్రిమి కీటకజాతులు, క్రిమి జాతులూ, పక్షి జాతులూ, జలచర జాతులు, మరి మానవ జాతి ఒకదానికొకటి చైతన్యశక్తి పరంగా అనుసంధానం 
కలిగివుంటూ సమిష్టిగా ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతున్నాయి. భూమిలోని అన్ని దాతువులూ వాతావరణంలోని అన్ని ధాతువులూ ఈ అన్ని జీవజాతులలో ఏకరీతి నమూనాతో వాటి దేహాలతో ఇమడ్చ బడివున్నాయి. ఒక జీవజాతి చైతన్య పరిణామం ఇతోధికంగా వృద్ధి చెందితే దాని ప్రభావం మిగతా ఇతర అన్ని జాతుల చైతన్య పరిణామంను ప్రభావితం చేసి పురోగతి చెందించగలదు.

ఈ భూతలంలో మానవజాతి ఇతర అన్ని జీవజాతులకంటే చైతన్య పరిణామాన్ని వేగవంతం చేయడంలో ఎంతో కీలకమైన పాత్రను కలిగివుంది. ఈ కీలకపాత్రను పోషించుటలో మానవుడు అవలంబించవలసిన మార్గం యోగసాధన. అందుకే యోగసాధన మనిషి జీవితంలో ఎంతో ప్రముఖ్యమైనదిగా మారింది.

                                         ◆నిశ్శబ్ద.