మారద(న) వెంకయ్య మణిరత్నం ఈ పద్యం!

 

మారద(న) వెంకయ్య మణిరత్నం ఈ పద్యం!

ఈ ప్రపంచంలో అబద్ధాలను కప్పిపుచ్చి అందమైన నిజాలుగా చూపించడం చాలాచోట్ల జరుగుతుంది. అవన్నీ నిజాలుగా ఎక్కువ కాలం కొనసాగవు, ఏదో ఒక సందర్భంలో వాటిని నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది ఎలాగంటే…….

చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు? రాగిపై 

బూసిన బంగరున్ జెదరిపోవగడంగిన నాడు నాటికిన్ 

దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగ, భాస్కరా!

మారద(న) వెంకయ్య రచించిన భాస్కరశతకంలోని పద్యం ఇది. ఒకప్పుడు ఈ పద్యాలు పాఠశాలల్లో పిల్లలు నేర్చేవారు. అంతకు ముందే, ఇంట్లో తల్లులు నీతిశతకాలు నేర్పించేవారు. దాంతో అనేక జీవితసత్యాలు పిల్లలకు, ఈ పోటీ ప్రపంచంలో అడుగిడే ముందే తెలిసి ఉండేవి. మానవ మనస్తత్త్వం, సామాజిక మనస్తత్వాల పట్ల అవగాహన కలిగేది. వీటికి తోడుగా, వారు వినే పురాణకథలు, జానపద కథలు వారి ఊహాశక్తిని పెంచి, వారికి ఉత్తమాదర్శాలను అందించేవి. 'సత్య హరిశ్చంద్ర' కథ ఇచ్చిన స్ఫూర్తి, మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీని మహాత్మాగాంధీగా మార్చటం మనకందరికీ తెలుసు.

ఇక్కడ భాస్కరశతకంలోని ఈ పద్యం మనందరికీ తెలిసిన సత్యాన్నే, మరింత సరళంగా వివరిస్తోంది. రాగి మీద బంగారు పూత పూసి దాన్ని మొత్తం బంగారం అని చలామణి చేస్తే, పై పూత తొలగిపోగానే అసలు బండారం బయటపడుతుంది. కాబట్టి నీచుడు ఒక దుర్మార్గం చేసి చెప్పకుండా దాచినా, కొన్నాళ్ళకది ప్రజలకు తెలుస్తుంది అన్నది ఈ పద్యతాత్పర్యం.

మనకున్న సామెత "నిజం నిలకడ మీద తెలుస్తుంది" అనే దాన్ని ఈ పద్యం విపులీకరిస్తోందన్నమాట. తాత్కాలికంగా ఎదుటివాడిని మోసపుచ్చ గలిగినా, ఎవరినీ ఎల్లప్పుడూ మోసపుచ్చటం జరగని పని అని అర్థం. మోసం చేసి తప్పించుకోలేనప్పుడు, ఎదుటివాడిని మోసం చేయాలని ప్రయత్నించటం వల్ల లాభమేమిటి? మోసం చేసి సాధించేదేమిటి?

అయినా సరే, తెలివైనవాడు, తెలివి లేనివాడిని మోసం చేస్తాడు. అదీ ఎంత వరకూ చేయగలడు?? ఈ తెలివి లేనివాడికి తెలివి వచ్చేవరకూ. ఉదాహరణకు 'విజయం' అన్న పదం తీసుకుందాం. ప్రస్తుతం సమాజంలో ఒక వ్యక్తి 'విజయం సాధించాడంటే అర్థం, ఆ వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడని. ఒక వ్యక్తి 'పైకి వచ్చాడు, బాగు పడ్డాడు అంటే అర్థం వాడు పెద్ద పదవిని సంపాదించాడనో, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడనో అర్థం. 

వ్యక్తిలో మానసికంగా కలిగే మార్పే విజయానికి మూలం అవుతుంది. ఆ మార్పు గొప్ప ఆలోచనలు కలిగినది అయినపుడే అది విజయాన్ని తెచ్చిపెట్టే మార్గమవుతుంది. అదిగో ఆ మార్పు మనిషిలో వచ్చి ఏదైనా నిజం తెలుసుకునే గుణం పెరిగేవరకె మోసం చేయడం వీలవుతుంది. అదే ఆలోచనా గుణం పెరిగాక ఇక ఎవరూ ఎవరినీ మోసం చేయలేరు. 

                                       ◆ నిశ్శబ్ద.