కార్తీక మాసంలో తులసి పూజ ప్రాముఖ్యత ఇదే..!
కార్తీక మాసంలో తులసి పూజ ప్రాముఖ్యత ఇదే..!
కార్తీక మాసం ధనుర్మాసంలో భాగం. ఈ ధనుర్మాసంలో శివకేశవుల పూజ ప్రధానంగా సాగుతుంది. కార్తీక మాసంలో చేసే పూజ, దీపం, జపం, దానం వంటివి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. వీటి వల్ల కలిగే పుణ్యం కూడా చాలా గొప్పది. అయితే కార్తీక మాసంలో తులసి పూజ, తులసి దగ్గర దీపారాధనకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి దగ్గర నెయ్యితో దీపారాధన చేయడం కూడా చాలా శ్రేష్టం. తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసంలో కలిగే ఫలితాల గురించి తెలుసుకుంటే..
లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని చెబుతారు. ఈ కారణంగా లక్ష్మీదేవికి తోడుగా ఆ శ్రీమన్నారాయణుడు కూడా తులసిని ఇష్టపడతాడు. అందుకే విష్ణు పూజకు తులసిని చాలా కీలకంగా ఉపయోగిస్తారు. తులసిని నిత్యం పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయట. నిత్యం తులసి దగ్గర నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసేవారికి ఆర్థిక సమస్యలు తొలగడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరతాయి.
కార్తీక మాసంలో తులసిని పూజించడం వల్ల సుఖ సంతోషాలతో పాటు అభివృద్ది కూడా ఉంటుంది. కెరీర్ లో అడ్డంకులు తొలగిపోతాయి. సమస్యల నుండి బయటపడతారు.
వైవాహిక జీవితం బలంగా ఉండాలన్నా తులసి ఆరాధన సహాయపడుతుంది. కార్తీక మాసంలో ప్రతి రోజూ తులసిని పూజిస్తూ తులసి దగ్గర దీపం పెడుతూ ఉంటే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది.
వాస్తు దోషాల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఉన్నా, ఇంట్లో డబ్బు కొరత ఉన్నా తులసి ఆరాధన, తులసి దీపం వల్ల సమస్యలు తగ్గుతాయి. రోజూ తులసి దగ్గర దీపం పెట్టి తులసి పూజ చేస్తుంటే తొందరలోనే ఏదో ఒక రూపంలో ఇంటికి డబ్బు వచ్చి చేరడం గమనించవచ్చు.
రోజూ సాయంత్రం సమయంలో తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ప్రతికూల వాతావరణం తగ్గిపోతుంది.
*రూపశ్రీ.