తుమ్మి పువ్వుల విశిష్టత తెలుసా..
తుమ్మి పువ్వుల విశిష్టత తెలుసా..
దేవుడి పూజ అనగానే బంతి, చామంతి, మల్లె, జాజి, విరజాజి, సంపెంగ.. ఇలా బోలెడు పువ్వులు గుర్తొస్తాయి. చాలామందికి దేవుడికి ఎన్ని పువ్వులు పెట్టి పూజ చేసుకుంటే అంత తృప్తి అనిపిస్తుంది. అయితే దేవుడికి ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే మరింత పూజా ఫలితం, అంతే కాకుండా ఆ దైవ కృప కూడా తొందరగా లభిస్తుంది. ఈ కాలంలో చాలామందికి ఎక్కువగా తెలియని పేరు తుమ్మి పువ్వులు. ఈ పువ్వులతో పూజ చేస్తే పరమ శివుడు పరమానందభరితుడు అవుతాడట. అసలింతకూ తుమ్మి పువ్వులంటే శివయ్యకు ఎందుకంత ప్రీతి. ఈ పువ్వు విశిష్టత ఏంటి తెలుసుకుంటే..
తుమ్మి పువ్వులు బంతి పువ్వు రేకు అంత పరిమాణంలో ఉంటాయి. ఇవి తెలుపు రంగులో.. మనిషి పాదాల ఆకారంలో ఉంటాయి.
తుమ్మి పువ్వు ఎందుకిష్టం..
తుమ్మి పువ్వులు అంటే శివుడికి చాలా ప్రీతి. దీని వెనుక ఒక పురాణ కథనం ఉంది. అడవిలో ఒక ఆటవికుడు దారిగుండా వెళుతున్నాడట. ఆ దారిలో ఒక చోటికి చేరగానే అతనికి చలి ఎక్కువగా అనిపించింది. చలి బాధ తాళలేక కాసేపు అక్కడే ఆగి నిద్రపోదాం అనుకున్నాడు. దానికి తగ్గట్టే అక్కడ ఒక స్థలం చూసుకున్నాడు. అయితే అక్కడే ఒక శివలింగం కనబడింది. వెంటనే శివయ్యకు ఒక నమస్కారం చేసుకుని ఆ శివలింగం పక్కనే తను పడుకున్నాడు. చలిని భరించలేక తన దగ్గర ఉన్న ఒక సంచిని కప్పుకుని నిద్రపోతాడు. అయితే వెంటనే మేల్కొని అయ్యో.. శివలింగానికి చలేస్తుంది కదా.. అనుకుని తను కప్పుకున్న సంచిని పక్కనే ఉన్న శివలింగానికి కూడా కప్పుతాడట. ఆ ఆటవికుడి అమాయకత్వానికి ముగ్ధుడైన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై.. ఏం కావాలో కోరుకోమని అడిగాడట.
శివుడిని చూసిన ఆనందంలో.. గందరగోళంలో.. శివుడి పాదాలు తనపైన ఉండాలని కోరుకోవాల్సింది పోయి.. తన పాదాలు ఎప్పుడూ శివుడి పైన ఉండాలి అని కోరుకుంటాడు. అతను కోరుకున్నది తప్పే అయినా.. శివుడు అతని కోరికను అనుగ్రహిస్తాడు. మరసటి జన్మలో అతను తుమ్మి పువ్వుగా పుడతాడు. తుమ్మి పువ్వులు పాదాల ఆకారంలో ఉంటాయి. ఈ విధంగా తుమ్మిపువ్వులు శివుడి పైన ఉండటంతో ఆటవికుడి కోరికను శివుడు తీర్చాడు.
ఇక తుమ్మి పువ్వు వెనుక కథ లాగే.. దాని తో చేసే పూజ కూడా చాలా గొప్పదట.
జిల్లెడు పూలు అంటే శివుడికి ప్రీతి.. అలాంటి వెయ్యి తెల్ల జిల్లెడు పూలు తెచ్చి శివుడికి సహస్రనామ పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో.. ఒక గన్నేరు పువ్వుతో పూజ చేస్తే అంత ఫలితం ఉంటుందట.
ఒక గన్నేరు పుష్పాలతో చేసే పూజ కంటే.. ఒక బిల్వపత్రం సమర్పించి చేసే పూజ చాలా శ్రేష్టం. ఒక బిల్వ పత్రాన్ని శివుడి పైన ఉంచితే మూడు జన్మల పాపాలు హరిస్తాయట.
వెయ్యి బిల్వ దళాలను శివుడికి సమర్పించి చేసే పూజ కంటే.. ఒక తామర పువ్వును సమర్పించి చేసే పూజ శ్రేష్టమట.
వెయ్యి తామర పువ్వులను సమర్పించి చేసే పూజ కంటే.. ఒక ఉమ్మెత్త పువ్వుతో చేసే పూజ చాలా శ్రేష్టం.
వెయ్యి ఉమ్మెత్త పువ్వులతో చేసే పూజ కంటే.. ఒక జమ్మి పత్రితో చేసే పూజ చాలా శ్రేష్టం.
వెయ్యి జమ్మి పత్రితో చేసే పూజా ఫలాన్ని ఒక తుమ్మి పువ్వు తో చేసే పూజ అందిస్తుందట. సాధారణంగా శివుడికి బిల్వ దళాల పూజ అంటే చాలా శ్రేష్టం అంటుంటారు కదా.. కానీ బిల్వ దళాల కంటే కూడా తుమ్మి పువ్వులతో చేసే పూజ చాలా చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.
*రూపశ్రీ