మాతృనవమి.. ఈ రోజు విశిష్టత తెలుసా..
మాతృనవమి.. ఈ రోజు విశిష్టత తెలుసా..
హిందూ విశ్వాసాల ప్రకారం మరణించిన పెద్దల ఆత్మ శాంతి కోసం పితృపక్షాలలో శ్రాద్దకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు వదులుతారు. ఈ పక్షాలలో మాతృ నవమి అని పిలువబడే నవమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భర్త బ్రతికి ఉన్నప్పుడు మరణించిన లేదా మరణించిన తేదీ తెలియని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు మాతృ నవమి చాలా ముఖ్యం. పితృ పక్ష సమయంలో శ్రాద్ధం, తర్పణాలకు ఈ నవమి తిథి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది మరణించిన ఆత్మలకు శాంతిని ఇస్తుంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఈ క్రమంలో, మాతృ నవమి యొక్క ప్రాముఖ్యత, ఈ రోజు ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుంటే..
మాతృనవమి ప్రాముఖ్యత..
పితృ పక్షంలో వచ్చే నవమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని మాతృ నవమి అని కూడా పిలుస్తారు. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 15న మాతృనవమి వచ్చింది. భర్త బ్రతికి ఉండగానే మరణించిన వారు లేదా మరణించిన తేదీ తెలియని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల కోసం శ్రాద్ధ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించడానికి ఈ రోజు చాలా మంచిదట.
మాతృ నవమి రోజున చేసే శ్రాద్ధం మరణించిన తల్లిదండ్రుల ఆత్మలకు శాంతిని కలిగిస్తుంది, వారిని సంతోషపరుస్తుంది. ఈ రోజున చేసే శ్రాద్ధం వంశపారంపర్య, వంశ పురోగతికి దారితీస్తుందని నమ్ముతారు. అలాగే ఈ శ్రాద్ధం చేసే వ్యక్తి జీవితంలో మాతృత్వం, అనురాగం, ఆనందం ఉంటాయట.
ఈ రోజు ఏం చేయాలి..
మరణించిన స్త్రీల కోసం శ్రాద్దం, తర్పణం చేయాలి. బ్రాహ్మణులకు, ముఖ్యంగా బ్రాహ్మణ భార్యకు దానం చేయాలి.
వృద్ధ మహిళలకు ఏవైనా కానుకల రూపంలో ఇవ్వడం కూడా పుణ్యప్రదం. రావి చెట్టు కింద దీపం వెలిగించి మాతృ మూర్తులను స్మరించుకోవాలి.
ఆవు, కుక్క, చేప, చీమలు, కాకులకు ఆహారం, నీటిని నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే వీటికి ఆహారం పెడితే అది మరణించిన వారు స్వీకరిస్తారని నమ్మకం.
తప్పనిసరిగా చేయాల్సిన పనులు..
ఏ శ్రాద్ధ పూజలోనైనా తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే మాతృ నవమి రోజున తులసి పూజ చేయాలి.
శ్రాద్ద కర్మల కోసం ఉపయోగించే పాత్రలు రాగివి అయితేనే మంచిది.
ఏ స్త్రీని అవమానించకూడదు. మాతృ నవమి రోజున మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో కూడా ఇలా చేయాలి. ఇలా చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి.
వీలైతే మాతృ నవమి రోజున, మంగళకరమైన వస్తువులు అయిన ఎర్ర చీర, గాజులు, సింధూరం మొదలైన వాటిని అవసరమైన వివాహిత మహిళలకు దానం చేయాలి.
ఇంటికి వచ్చే ఎవరినీ అలాగే వెనక్కు పంపకూడదు. వారికి ఆహారం పెట్టాలి.
*రూపశ్రీ.