ఆ స్వామికి చేపలు... కల్లు నైవేద్యం కుక్కలకే తొలి ప్రసాదం!

 

 

ఆ స్వామికి చేపలు... కల్లు నైవేద్యం కుక్కలకే తొలి ప్రసాదం!

 

 

భగవంతుని ఆరాధించే మనుషులకి నియమనిష్టలు ఉంటాయి. కానీ ఆ దైవాన్ని ఎలాంటి నిబంధనలూ శాసించలేవు కదా! ఆర్తులు భక్తితో ఏది అందించినా స్వీకరించే సహృదయం దైవానిది. అందుకు ఉదాహరణగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పూజలందుకునే ముత్తప్పన్ గురించి చెప్పుకొని తీరాల్సిందే!

శివకేశవుల స్వరూపం

సాధారణంగా మన గ్రామీణ దేవతలంతా అటు శైవ అంశంగానో, ఇటు విష్ణు స్వరూపంగానో ఆరాధింపబడతారు. కానీ ముత్తప్పన్ను మాత్రం ఇద్దరు దేవతలకూ ప్రతీకగా భావిస్తుంటారు. ముత్తప్పన్ ఆకారంలో ఉండే చిన్న పాటి మార్పుని బట్టి వలియ ముత్తప్పన్గానో (విష్ణువు) చెరియ ముత్తప్పన్గానో (శివుడు) కొలుచుకుంటారు.

పూలపాన్పు మీద దర్శనం

కేరళలో ప్రచారంలో ఉన్న ముత్తప్పన్ జన్మవృత్తాంతం విచిత్రంగా ఉంటుంది. సదాచార సంపన్నులైన అయ్యంకర వళువనార్, పడికుట్టి అనే దంపతులకు సంతానం లేదు. సంతానం కోసం వారు చేయని పూజా లేదు. పాపం పడికుట్టి తన కడుపులో ఒక కాయ కాసేలా చూడమంటూ.... ఆ పరమేశ్వరుని నిత్యం ప్రార్థించేదట. ఆ ప్రార్థనలు మన్నించిన శివుడు త్వరలోనే ఆమెకు సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు. మర్నాడు పడికుట్టి నదికి వెళ్లి వస్తుండగా ఆమెకు పూలపాన్పు మీద ఒక చిన్నారి కనిపించాడు. ఆ బాబుని, సాక్షాత్తు పరమేశ్వరుని వరప్రసాదంగా భావించిన పడికుట్టి దంపతులు అతన్ని పెంచుకోసాగారు.

 

 

అడవిలో సహవాసం

పడికుట్టి దంపతుల సంరక్షణలో పెరిగి పెద్దవాడవుతున్న ఆ బాబుకి వేట అంటే మహా సరదాగా ఉండేది. సమీపంలో ఉండే అడవికి వెళ్లి అక్కడ జంతువులను వేటాడి వాటి చర్మాన్ని ధరిస్తుండేవాడు. అడివిలో ఉండేవారిలో సహవాసం చేసేవాడు. వారి కోసమని ఆహారాన్ని తీసుకువెళ్లేవాడు. ముత్తప్పన్ తీరు సహజంగానే సంప్రదాయవాదులైన తల్లిదండ్రులకి నచ్చలేదు.

విశ్వరూపం

ముత్తప్పన్ స్వభావానికి కోపగించుకున్న తండ్రి ఓసారి అతన్ని తీవ్రంగా మందలించబోయారు. అంతే తాను సామాన్య మానవుడిని కాదంటూ ముత్తప్పన్ విశ్వరూపాన్ని చూపించారు. ఆపై ఆ ఊరి నుంచి నిష్క్రమించారు. అలా వెళ్తుండగా ఆయనకు సహ్యాద్రి పర్వతాల మీద ఉన్న కున్నత్తూరు అనే ప్రదేశం కనిపించింది. ఎటుచూసినా పచ్చదనంతో తాటిచెట్లతో నిండిన ప్రదేశాన్ని చూసి... కొన్నాళ్లు అక్కడ సేదతీరాలని నిశ్చయించుకున్నారు.

చేపలు, కల్లు...

అదే కున్నత్తూరులో తాటికల్లు తీసుకుని జీవించే చందన్ అనే అమాయకుడు ఉండేవాడు. ఓరోజు అతను ఏదో విషయంలో ముత్తప్పన్తో గొడవకు దిగాడు. అంతే! స్వామివారి కోపాగ్నికి గురై ఒక్కసారిగా మూర్ఛపోయాడు. విషయం తెలిసిన చందన్ భార్య పరుగుపరుగున వచ్చి తన భర్తను క్షమించమంటూ ముత్తప్పన్ను వేడుకుంది. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు వేయించిన పప్పులు, కొబ్బరికోరు, కల్లు, చేపలను అర్పించింది. స్వామివారు ప్రసన్నం కావడంతో చందన్ మూర్ఛ నుంచి తేరుకున్నాడట. అప్పటినుంచి స్వామివారికి ఆయా పదార్థాలను నైవేద్యంగా అర్పించడం మొదలైంది. కల్లు బదులుగా కొందరు టీ కూడా అందిస్తుంటారు.

 

 

పరసిని ఆలయం

కున్నత్తూరులో కొన్నాళ్లు సేదతీరిన తరువాత, మున్ముందు ఎక్కడ నివసించాలన్న ఆలోచన మొదలైంది. అందుకు జవాబు కోసం తన విల్లుని సంధించి బాణాన్ని వదిలాడు ముత్తప్పన్. అది పరసిన్కడవు అనే ప్రాంతంలో పడింది. అప్పటి నుంచి ఆ ఊరిలో స్థిరనివాసాన్ని ఏర్పరుచుకున్నాడు ఆ పరమేశ్వరుడు. పరసిన్కడవులో ఆయన బాణం పడిన చోటు గొప్ప తీర్థంగానూ, ఆయన వెలసిన చోటు బ్రహ్మాండమైన ఆలయంలోనూ రూపొందింది. అక్కడ కొలువైన దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ‘తెయ్యం’ అనే సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నృత్యాన్ని కేరళకే గర్వకారణంగా భావిస్తుంటారు. కమల్హాసన్ నటించిన ఉత్తమవిలన్ అనే చిత్రంలో ఈ తెయ్యం నృత్యమే ప్రధానాంశం!

కుక్కలకు ప్రవేశం

సాధారణంగా గుడి ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే చాలు... అవతలకి తోలేస్తూ ఉంటారు. కానీ ముత్తప్పన్కు కుక్కలంటే మహా ప్రీతి అంటారు. అందుకనే పరసిన్కడవు ఆలయంలో గుంపులు గుంపులుగా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆలయద్వారానికి ఇరువైపులా కూడా కుక్కల విగ్రహాలు ఉంటాయి. ఆలయంలో స్వామివారికి నైవేద్యం అర్పించిన తర్వాత దాన్ని తొలి ప్రసాదంగా కుక్కలకే అందిస్తారట.

- నిర్జర.