సూర్యుడికి ఇష్టమైన ఈ పనులను చేస్తే ఆయన అనుగ్రహం తథ్యం..!
సూర్యుడికి ఇష్టమైన ఈ పనులను చేస్తే ఆయన అనుగ్రహం తథ్యం..!
సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. శాస్త్రీయంగా చూసినా సూర్యుడి వెలుగు వల్లే చాలా రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. సూర్యుడి కాంతి వల్ల విటమిన్ల లభ్యత, శరీరంలో చాలా రకాల రోగాలు.. ముఖ్యంగా చర్మ సంబంధ రోగాలు నశిస్తాయని అంటారు. అయితే హిందూ ధర్మం ప్రకారం సూర్యుడిని పూజించడం సాంప్రదాయం. సూర్యుడి అనుగ్రహం పొందాలని అనుకునేవారు సూర్యుడికి ఎంతో ఇష్టమైన పనులను చేయడం వల్ల అది నెరవేరుతుందని అంటారు. అసలు సూర్యుడికి ఇష్టమైన పనులేవి..
సూర్యుడికి ఆదివారం చాలా ముఖ్యమైన రోజు అని చెప్తారు. సూర్యుడి అనుగ్రహం పొందాలని అనుకునేవారు ఆదివారం రోజు ఉదయాన్నే లేవాలి. సూర్యోదయం ముందే స్నానం చేయాలి. తరువాత ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తున్నా సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. ఆదివారం మరీ శ్రేష్టం.
ప్రతిరోజూ సూర్యుడికి నమస్కారం చేయడమే కాదు.. తులసికోట దగ్గర కూడా తప్పకుండా నమస్కారం చేయాలి. తులసికి ఉదయాన్నే నమస్కారం చేస్తే సకల దోషాలు నశిస్తాయి.
సూర్యుడి అనుగ్రహం లభించాలి అంటే ముఖ్యంగా భార్యాభర్తలు ఆదివారం రోజు అస్సలు గొడవపడకూడదని అంటున్నారు శాస్త్రజ్ఞులు. కాబట్టి కుటుంబం వృద్ధి చెందాలన్నా, సూర్య అనుగ్రహం కుటుంబానికి లభించాలన్నా ఆ ఇంటి భార్యాభర్తలు అస్సలు గొడవ పడకుండా ఉండటమే మంచిది.
సాధారణ రోజులలో కంటే ఆదివారం రోజు ఉదయాన్నే సూర్యకాంతి కోటిరెట్లు శక్తివంతంగా ఉంటుందట. అందుకే ఎన్ని పనులు ఉన్నా ఆదివారం రోజు ఉదయించే సూర్యుడి వెలుగు సమక్షంలో కనీసం అరగంట సేపు అయినా గడపాలి. అలాగే ఆదివారం సూర్యుడి ఎదురుగా కూర్చొన్నప్పుడు ఆదిత్యహృదయం, సూర్యాష్టకం, మహా సౌరం.. వంటివి పఠించాలి. ఇవి చాలా శక్తివంతమైనవి. జబ్బులు నివారించడంలో సహాయపడతాయి.
అనుకున్న పనులు నెరవేరాలి అంటే ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామికి అటుకులు, బెల్లం, పాలు కలిపిన పాయసాన్ని నైవేద్యంగా ఉంచాలి. దీన్ని ఇంట్లో కాకుండా నేరుగా ఉదయిస్తున్న సూర్యుడి ఎదురుగా ఉంచి సూర్యుడిని స్తోత్రాలతో స్తుతించాలి.
ఎవరికైనా జాతక దోషాలు ఉంటే ఆదివారం రోజు ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి బిక్ష అడిగితే వారికి లేదనకుండా దానం చేయాలి. అలాగే వారికి వస్త్ర దానం చేస్తే చాలా మంచిది. దీనివల్ల జాతక దోషాలు నశిస్తాయి.
చాలామంది ఆదివారం అంటే నాన్ వెజ్ తింటూ ఉంటారు. కానీ ఆదివారం రోజు సూర్యుడిని ఆరాధించి మద్యం, మాంసం ముట్టకుండా ఉండాలి. ఇలాంటి వారి ఇంట్లో సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
*రూపశ్రీ.