శని ప్రదోష వ్రతం ఈరోజే.. ఈ రోజు అస్సలు మిస్ కాకండి..!
శని ప్రదోష వ్రతం ఈరోజే.. ఈ రోజు అస్సలు మిస్ కాకండి..!
పరమేశ్వర కృప చాలా గొప్పది. ఆయన అనుగ్రహం ఉంటే పామరుడు కూడా మోక్షాన్ని పొందగలుగుతాడు. సాధారణంగా పరమేశ్వర ఆరాధనకు సోమవారం శ్రేష్టం అంటారు. శివరాత్రి, మాస శివరాత్రి వంటివి పరమేశ్వర ఆరాధనకు చాలా శ్రేష్టం. ఇవి మాత్రమే కాకుండా ప్రదోష కాలం, ప్రదోష వ్రతం కూడా పరమేశ్వర ఆరాధనకు చాలా ప్రాముఖ్యత కలిగిన సమయాలు. ముఖ్యంగా ప్రతి నెలా వచ్చే ప్రదోష వ్రతానికి చాలా శక్తి ఉంటుంది. ప్రదోష వ్రతం రోజున పరమేశ్వరుడిని ఆరాధిస్తే తొందరగా అనుగ్రహం లభిస్తుంది. అయితే అక్టోబర్ 4వ తేదీన ప్రదోష వ్రతం వచ్చింది. ఇది శనివారం రావడంతో శని ప్రదోష వ్రతం అయ్యింది. శని ప్రదోష వ్రత ప్రాముఖ్యత.. పరమేశ్వరుడిని ఎలా ఆరాధించాలి అనే విషయాలు తెలుసుకుంటే..
శని ప్రదోష వ్రతం..
ప్రదోష వ్రతం అంటే ప్రతి పక్షంలో త్రయోదశి తిథి సాయంత్రం వచ్చే ప్రదోష కాలంలో చేసే శివారాధన.. ఇది ఏ రోజు వస్తే దాన్ని ఆ రోజుకు సంబంధించి ప్రదోష వ్రతం అంటారు. అక్టోబర్ 4వ తేదీన వచ్చిన త్రయోదశి తిథి శనివారం అయ్యింది. అందుకే ఇది శని ప్రదోష వ్రతం అయ్యింది. శనివారం సాయంత్రం సూర్యాస్తమయం ముందు, తర్వాత ఉండే ఒకటిన్నర గంటలలో శివుని ఆరాధిస్తూ చేసే ప్రత్యేక ఉపవాసం, పూజనే శని ప్రదోష వ్రతం అంటారు.
శని ప్రదోష వ్రతం ఎందుకు చేస్తారు?
ప్రదోష వ్రతం అనేది శివపూజకు అత్యంత శ్రేష్ఠమైన సమయం. ఈ కాలంలో శివుడు తన భక్తుల కోరికలు తీర్చుతాడని పురాణాలు చెబుతున్నాయి. శనివారం ప్రదోషం ప్రత్యేకం ఎందుకంటే ఇది శని గ్రహంతో ముడి పడి ఉంటుంది.
శని దోషాలు, శని మహాదశ, ఏలినాటి శని వంటి శని సంబంధిత దోషాలను తగ్గించుకోవడానికి శని ప్రదోషం చేస్తారు. ఇది పాప పరిహార వ్రతం కూడా. అనుకోకుండా చేసిన పాపాలు క్షమించబడతాయని నమ్మకం.
శని ప్రదోష వ్రతం ఎలా చేస్తారు..
ప్రదోష వ్రతం రోజున ఉపవాసం చేయాలి.
సాయంత్రం ప్రదోష కాలంలో శివలింగానికి పాలు, బెల్లం, బిల్వదళాలు సమర్పించి పూజ చేయాలి.
శివాష్టకం, లింగాష్టకం, శని స్తోత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం జపించడం శ్రేష్టం.
శివార్చనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.
శని ప్రదోష వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు..
శని దోష నివారణ.. శని మహాదశ, అష్టమ శని, ఏలినాటి శని వంటి దోషాల ప్రభావం తగ్గుతుంది.
పాపక్షయము .. చేసిన పాపాలు, దోషాలు క్షమించబడతాయి. ఆరోగ్యం, ఆయురారోగ్యం కలుగుతాయి.
అడ్డంకులు తొలగిపోవడం.. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సమస్యల్లో ఉన్న అడ్డంకులు తొలగుతాయి.
ఆర్థిక స్థిరత్వం .. ధన లాభం కలుగుతుంది, అప్పుల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి.
మనశ్శాంతి .. కోపం, ఆందోళన తగ్గి శాంతి కలుగుతుంది.
శివ, శనుల అనుగ్రహం .. శివుడు, శని ఇద్దరి కటాక్షం లభిస్తుంది.
*రూపశ్రీ.