Read more!

ధ్యానం ఎంతసేపు చేయాలో తెలుసా!!

 

ధ్యానం ఎంతసేపు చేయాలో తెలుసా!!

ధ్యానం గురించి చాలమంది చెబుతారు. అయితే కొందరుంటారు కృత్రిమ జీవితం నుండి, ముఖ్యంగా ఇప్పటి రద్దీ పనుల నుండి సాంత్వన కావాలని కోరుకునేవాళ్ళుంటారు. వాళ్ళు మొట్టమొదటగా  అడిగే ప్రశ్న “ధ్యానం ఎంతసేపు చెయ్యాలి?” అని. “భోజనం ఎంత చెయ్యాలి?” అని ఎవ్వరైనా అడిగితే, "ఆకలి తీరేంతవరకూ!" అనీ, అట్లాగే, “ఎంతసేపు మాట్లాడాలి?" అంటే “అవసరమున్నంత వరకూ!" అనీ అందరికీ తెలుసు. మరి అట్లాగే “ధ్యానం ఎంతసేపు చెయ్యాలి?” అంటే “ఆలోచనలు రాకుండా వుండేంతవరకూ!", "కొంతైనా శక్తి వచ్చేంతవరకూ!”, లేదా “కొన్నైనా నూతన అనుభవాలు పొందేవరకూ!" అని అందరూ గ్రహించాలి. ఇది చాలా గొప్ప సమాధానం అని కొందరికి అనిపిస్తుంది. అలా ఎలా అని మరికొందరికి అనిపిస్తుంది. 

‘ఆలోచనలు” అన్నవి సమసిపోయిన తరువాతే “శక్తి” అన్నది మనలోకి నూతనంగా ప్రవహిస్తుంది. అలాగే "ఆలోచనలు" అన్నవి మూగబోయిన తరువాతే “అనుభవాలు" అనేవి మొదలయ్యేవి! మరి ఆలోచనలు అందరికీ ఒకేలా వుంటాయా? అని ప్రశ్నించుకుంటే, ప్రశ్నిస్తే వుండవు! ఆమెదే సమాధానం అవుతుంది. ఈ “ఆలోచనలు” అనేవన్నీ వారి వారి వయస్సు, వారి వారి పరిస్థితులపై ఆధారపడి వుంటాయి. వయస్సుతో పాటే ఆలోచనలూ పెరుగుతూ వస్తాయి. అలాగే ఆ వయసు ఇంకా ఇంకా పెరిగేకొద్దీ ఆ ఆలోచనలూ తగ్గుతూ వస్తాయి. 

కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు వయస్సు ఎక్కువగా ఉన్నపుడు ధ్యాన సమయాన్ని కూడా ఎక్కువ చేయాలి. "ఎంతసేపు ధ్యానం చెయ్యాలి?" అన్న ప్రశ్నకు చక్కటి ఫార్ములా వుంది.

 అదేమిటంటే  "నూతన ధ్యానాభ్యాసకులు తమ తమ వయస్సును సంవత్సరాలలో లెక్కపెట్టి తర్వాత కూర్చున్న ప్రతి సిట్టింగ్ లోనూ అన్ని నిమిషాలు కళ్ళు తెరవకుండా ధ్యానంలో వుండడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి 50 సం॥ వయస్సు వుంటే, ఆ వ్యక్తి కనీసం 50 నిమిషాలు సేపు ధ్యానం చెయ్యాలి. అప్పుడే ఆ వ్యక్తి కనీసం 5 నిమిషాలన్నా "ఆలోచనా రహిత స్థితి”లో వుండగలడు. అంటే యాభై నిమిషాల ధ్యానంలో మనసు అటు ఇటు పరిగెత్తుతూ ఏ ఒక సందర్భంలో మాత్రమే కనీస మొత్తం మీద అయిదు నిమిషాల సేపు ఎలాంటి ఆలోచనా లేకుండా నిశ్చలత్వాన్ని పొందగలుగుతాడు.  అంటే ‘ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు' కనీసం చేయాలి.

అలాగే 10 సం౹౹ వయస్సు గలవారు కనీసం 10 నిమిషాలూ, 20 సం॥ వయస్సు వున్నవారు కనీసం 20 నిమిషాలూ, 30 సం॥ వయస్సు గలవారు. 30 నిమిషాలూ, ఈ విధంగా అందరూ ఎవరి వయస్సును బట్టి వారి ధ్యానసాధనను కొనసాగించాలి.

శారీరక మానసిక పరిస్థితులు అధ్వాన్నంగా వుండేవారు, కనీసం రోజుకు “రెండు సిట్టింగ్స్”గా ధ్యానం చేస్తుంటే క్రమేణా వారు చక్కటి సత్ఫలితాలను పొందుతారు. అంతేకానీ, ప్రతిసారీ ఏదో మొక్కుబడిగా 10 నిమిషాలు కూర్చుని “నేను చాలా రోజుల నుంచీ ధ్యానం చేస్తున్నా నాకు ఏమీ ఫలితం కనిపించడం లేదు,  ఇంట్లో వాళ్ళూ సహకారం ఇవ్వటంలేదు, వ్యాపారం వల్ల వీలుకావడంలేదు" అనుకుంటే ఏమీ లాభంలేదు!

అయితే, సీనియర్ ధ్యానాభ్యాసకులు తమను తాము గొప్ప యోగులుగా మలుచుకోవాలంటే గంటలు గంటలు కూర్చోక తప్పదు!

కోరింది దక్కాలనుకుంటే వయస్సుకు తగినంతసేపు ధ్యానం చేసితీరాలి. అదే చిన్న వయస్సులోనే ధ్యానం ప్రారంభించి వుంటే ఇప్పుడు ఈ కష్టం, నష్టం, దుఃఖం అన్నవి వుండేవే కాదు కదా! అయినా “గతం గతః”! తెలియక యుగాలు గడపవచ్చు  కాని, తెలిసిన తరువాత క్షణం కూడా వృధా చేయరాదు.

మన భారతీయ మహర్షులు అందుకే ధ్యానాన్ని మనుషుల జీవితంలో భాగం చేశారు. కానీ అందరూ పాశ్చాత్య సంప్రదాయాల మోజులో పడి జీవితానికి శక్తినిచ్చే గొప్ప ధ్యాన ప్రక్రియను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మళ్లీ దాని అవసరం వచ్చింది. అందుకే మళ్లీ ఇటువైపు మళ్లుతున్నారు. ఇప్పుడు ఎవ్వరూ ఎలాంటి సందేహం లేకుండా వారి వయసు ఎంతైతే అన్ని నిమిషాలు ధ్యానం చేయడం ఉత్తమం.


◆వెంకటేష్ పువ్వాడ