ఏకవస్తు చింతన!!

 

ఏకవస్తు చింతన!!

ప్రపంచంలో అనేక వస్తువులున్నాయి. బల్ల, కుర్చీ, పుస్తకం, కలం, ఇల్లు, నగలు, ఆకాశం, కొండలు, నదులు.. ఇలా ఎన్నో. ఆ వస్తువులను చూడటానికి, వాటి గురించి తెలుసుకోవటానికి మన వద్ద ఇంద్రియాలున్నాయి. మనోబుద్ధులున్నాయి. అంటే అనేక వస్తువులు ప్రపంచంలో ఉన్నాయి. వాటిని తెలుసుకొనే అనేక ఇంద్రియాలున్నాయి. మనస్సులో అనేక ఆలోచనలున్నాయి. బుద్ధిలో అనేక కోరికలున్నాయి. అయితే వీటన్నింటిని తెలుసుకొనేవాడు, మార్పు చెందేవాటన్నింటి యొక్క మార్పులను తెలుసుకుంటూ ఉండేవాడు మాత్రం ఒక్కడే. తానెప్పుడూ మార్పు చెందకుండా ఉంటాడు. అతడే ఆత్మ. అతడెప్పుడూ ఒక్కడే. అందుకే ఆత్మ ఏక వస్తువు. 

లడ్డు కొద్దిగా నోట్లో వేసుకొని చూసావు. అది తీపిగా వుంది, చింతకాయ కొరికావు. పుల్లగా ఉంది, వేపకాయ రుచిచూచావు. చేదు, మిరపకాయ కొరికావు. కారంగా ఉంది, వీటన్నింటిని తెలుసుకొనే నీ ఏం ఉంది? తీపి ఉందా? కారం ఉందా? పులుపు ఉందా? ఇవేవీ లేవు. కాని ఆయా వస్తువులలో ఉన్న రుచి ఏదో తెలుసుకొనే తెలివి ఉంది. అంటే తెలియబడే తీపి, పులుపు, కారం, చేదు అవేవి నేను కాదు. వాటిని తెలుసుకొనే తెలివిని నేను. అంటే ప్రజ్ఞను. జ్ఞానాన్ని. ఈ జ్ఞానం ఏకం. ఎప్పుడూ మారేది కాదు. రెండు రకాల జ్ఞానాలు లేవు. తీపిని తెలుసుకొనే జ్ఞానం ఒకటి, కారాన్ని తెలుసుకొనే జ్ఞానం ఒకటి  ఇలా లేదు. వున్నదంతా ఒక్కటే జ్ఞానం. ఆ జ్ఞానమే ఆత్మ. అదే నేను. దాన్నే చింతన చేయాల్సింది. ఈ ఏక వస్తుచింతనం వల్లనే మనో నాశం జరుగుతుంది. ఎలా చేయగలం ఈ ఏక వస్తు చింతనం ? నీకన్న వేరుగా ఉన్న ఈ ప్రపంచాన్ని గురించిగాని, వ్యక్తుల గురించి గాని, పక్షుల గురించి గాని, శరీరాన్ని గురించి గాని, మనోబుద్ధుల గురించి గాని  ఇలా దేన్ని గురించైనా సరే చక్కగా చింతన చేయగలం, చేస్తున్నాం కూడా. అయితే ఆత్మనైన నన్ను నేను చింతన చేయాలంటేనే కుదరటం లేదు. ఆత్మ చింతనం అనేది చాలకష్ట సాధ్యంగా ఉంది. కనుక దీనిని నీకు నీవుగా తెలుసుకోవటం కుదరదు. నీవు మనోబుద్ధుల స్థాయిలో ఉన్నావు గనుక వాటికి అందినంత వరకే చింతన చేయటం కుదురుతున్నది. ఆ స్థాయిని దాటి పోవాలంటే చేయాలి?

"యత్ స్వతహా అప్రాప్యం తత్ శాస్త్రేన బోధితవ్యం" అని శంకర భాష్యం. ఏది నీకు స్వతహాగా లభించదో దానిని శాస్త్ర బోధ ద్వారానే గ్రహించాలి. శాస్త్రాన్ని అందించేవాడు గురువు. గురువు అంటే జ్ఞానం తానైనవాడు. వెలుగుతున్న దీపంలాంటి వాడు. వెలుగుతున్న దీపం ఎన్నిదీపాలనైనా వెలిగించగలదు. అలాగే గురువులోని జ్ఞానం శిష్యుని బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. గురుబోధను గ్రహించటం వల్ల శిష్యుడు దేదీప్యమానంగా జ్ఞానంతో ప్రకాశిస్తాడు. అలా గురుబోధ ద్వారా జ్ఞానాన్ని పొందినవారే ఏకవస్తు చింతనం చేయగలుగుతారు. అయితే ఈ గురుబోధను గ్రహించాలంటే మానసిక ప్రశాంతత కావాలి. బుద్ధి సూక్ష్మత కావాలి. ఏకాగ్రత కావాలి. ఇలాంటి మానసిక ప్రశాంతత మనోలయం జరిగినప్పుడే కలుగుతుంది. ఈ మనోలయం అనేది ప్రాణాయామం ద్వారా లేదా వాయునిరోధనం ద్వారా సాధించవచ్చు. అంటే వాయు నిరోధనం లేదా ప్రాణాయామం ద్వారా మనోలయం. మనోలయం వల్ల మానసిక ప్రశాంతత. ప్రశాంతంగా ఉన్నప్పుడే గురుబోధను గ్రహించగలం. గురుబోధవల్లనే జ్ఞానం, ఏకవస్తువు గురించిన జ్ఞానం  కలిగితేనే ఏకవస్తు చింతనం. ఆ ఏక వస్తు చింతనం వల్ల మనోనాశనం. ఇదీ వరస.

ఇలా మనోనాశం సాధిస్తే ఇంతవరకు ఉన్న నానాతం అదృశ్యం. ఇంతవరకు మనస్సుతో చూసావు గనుక అనేకత్వం ఉంది. ఇప్పుడు మనస్సు నాశనమైనది గనుక అనేకత్వానికి ఆస్కారం లేదు. అంతటా ఆత్మదర్శనమే. ఏకత్వ దర్శనమే. 

◆ వెంకటేష్ పువ్వాడ