దైవ నామ జపం శక్తి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
దైవ నామ జపం శక్తి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
హిందూ మతంలో దైవ నామ జపానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని దేవుడికి దగ్గరగా చేర్చేది జపమే.. వేదాలు, పురాణాలు, శాస్త్రాలలో జపం చేయడం వల్ల, దైవ నామాన్ని పదే పదే జపించడం వల్ల అద్బుతమైన ఫలితాలు ఉంటాయని అంటారు. ఇక ఈ కలియుగంలో ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కలియుగంలో దైవం కూడా మౌనం వహిస్తాడని, ఆయన ఏ విషయాలకు అంత త్వరగా స్పందించడని అంటారు. అయితే ఆ దైవ నామ స్మరణ మాత్రం అద్భుతాలు చేస్తుంది. ఒకప్పుడు దైవానుగ్రహం కోసం తపస్సు, యజ్ఞాలు, దీక్షలు చేసేవారు. కానీ ఈ కలియుగంలో అవన్నీ అవసరం లేదు.. కేవలం ఆ భగవంతుడి నామాన్ని స్మరించనంత మాత్రాన భగవానుగ్రహం కలుగుతుందని అంటారు. దీని గురించి తెలుసుకుంటే..
శ్రీ రామచరితమానస్‌లో తులసీదాస్ ఒక విషయాన్ని ప్రస్తావించారు.. "కలియుగంలో దైవ నామస్మరణ మాత్రమే మనిషి భవసాగరాన్ని అంటే ప్రాపంచిక దుఃఖాలను దాటగల ఆధారం. దేవుని నామం కేవలం శబ్దం కాదు, అది దేవుని సాక్షాత్కారాన్ని కలిగించే గొప్ప మార్గం. దేవుడి నామానికి, దేవుడి స్వరూపానికి ఎలాంటి తేడా లేదు. దైవ నామ స్మరణ చేస్తుంటే.. దేవుడిని స్వయంగా ఆరాధిస్తున్నట్లే" అని తులసీదాస్ అంటారు.
దైవ నామ జపం చేస్తే ఏం జరుగుతుంది..
దైవ నామ జపం ద్వారా మనస్సు, బుద్ధి శుద్ధి అవుతాయి. ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. మనస్సు కేంద్రీకృతమవుతుంది. అంతేకాకుండా నామ జపం వ్యక్తిలో విశ్వాసం, నమ్మకం, భక్తి భావనను మేల్కొల్పుతుంది. నామాన్ని క్రమం తప్పకుండా జపించే వ్యక్తి తన జీవితంలో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాడు. నామ జపం ద్వారా అనేక జన్మల పాపాలు కూడా కొట్టుకుపోతాయని, పుణ్యాలు పోగవుతాయని అంటారు.
నామ జపంలో రకాలు..
నామ జపంలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి. అవి..
1. మౌఖిక జపం..
దేవుని నామాన్ని స్పష్టమైన ఉచ్ఛారణతో ఉచ్ఛరిస్తారు. ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది, ఇతరులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
2. ఉపాంశు జపం –
నామాన్ని నెమ్మదిగా ఉచ్ఛరిస్తారు. తద్వారా సాధకుడు మాత్రమే దానిని వినగలడు. ఇది మానసిక ఏకాగ్రతను పెంచుతుంది.
3. మానసిక జపం –
దేవుని నామం మనస్సులో మాత్రమే పునరావృతమవుతుంది. ఇది పూర్తిగా అంతర్ముఖ సాధన కాబట్టి ఇది ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
నామ జపం ఫలితం..
నారద పురాణంలో దైవ నామాన్ని స్మరించడం ద్వారా పాపాలు నశించి ఆత్మ శుద్ధి అవుతుందని పేర్కొనబడింది. నామజప చేసేవారి పిలుపును భగవంతుడు చాలా తొందరగా వెంటాడని అంటారు. శివ పురాణంలో 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించడం వల్ల విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. నామ జపం ప్రాపంచిక ప్రయోజనాలను ఇవ్వడమే కాకుండా, జీవిని జనన మరణ చక్రం నుండి కూడా విముక్తి చేస్తుంది. ఆత్మను పరమాత్మతో అనుసంధానించడానికి ఇది ప్రత్యక్ష, సరళమైన మార్గం. కాబట్టి దేవుని నామాన్ని జపించడం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఇది మోక్షానికి వేసే మొదట అడుగుి . దీనిని ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా జపం చేయవచ్చు.అయితే ఆత్మశుద్ది, శారీరక శుద్ది ఉంటే చాలా మంచిది.
*రూపశ్రీ.