Read more!

కుంభకర్ణుడు ఎలా చనిపోయాడు?

 

కుంభకర్ణుడు ఎలా చనిపోయాడు?

సుగ్రీవుడు తప్పించుకుని ఆకాశంలోకి ఎగురిపోవడంతో కుంభకర్ణుడు కోపంతో మళ్ళీ యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయాన్ని అదనుగా చూసి  లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో "ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి, నిన్ను చంపితే లాభం ఏమిటి. నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను. నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దగ్గరి వెళతాను" అన్నాడు.

లక్ష్మణుడు కొట్టిన బాణాల దెబ్బలు, సుగ్రీవుడు కొరికిన పంటి గాట్ల వల్ల  కుంభకర్ణుడి శరీరం నుండి నెత్తురు కారుతోంది. అప్పుడు లక్ష్మణుడు  "వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు. వీడు కిందపడిపోతే గొడవ వదిలిపోతుంది. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి. అప్పుడా బరువుకి వాడు కిందపడిపోతాడు" అన్నాడు.

ఆ మాటలు వినగానే కొన్ని కోట్ల వానరాలు ఎగిరి ఒక్కసారిగా వాడిమీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు. అంతే, అన్ని వాసరాలు కిందపడిపోయాయి. అప్పుడు అందరూ రాముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. "రామ! ఈ కుంభకర్ణుడిని మీరు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు. మీరొచ్చి ఆ కుంభకర్ణుడిని సంహరించండి" అన్నారు.

రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి గురిచూసి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది, కాని ఆ కుంభకర్ణుడు ఇంకా ఎక్కువ కోపాన్ని పెంచుకుని రాముడి మీదకి వస్తున్నాడు. ఇంక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి, తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు  కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు అన్నీ జారిపోయాయి. ఆ బాణాల దెబ్బకు కుంభకర్ణుడికి కళ్ళు తిరిగినంత పనయ్యింది.

 తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. తన చెయ్యి పోవడంతో కోపోద్రిక్తుడైన కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వచ్చాడు. అప్పుడు రాముడు ఇంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకూ నరికేశాడు.

రెండు చేతులు పోయినా ఇంకా రోషం పెరిగిన  కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలని తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు రెండు అర్ధచంద్రాకార బాణములతో వాడి రెండు తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సుని ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది, మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకూ పడిపోయింది. అలా కుంభకర్ణుడు తన ప్రాణాలను వదిలాడు.

                                         ◆నిశ్శబ్ద.