కోడిపుంజు పై అమ్మవారి సవారీ.. ట్రాన్స్ జెండర్లకు ఎంతో ముఖ్యమైన ఈ దేవాలయం ఎక్కడుందంటే!
కోడిపుంజు పై అమ్మవారి సవారీ.. ట్రాన్స్ జెండర్లకు ఎంతో ముఖ్యమైన ఈ దేవాలయం ఎక్కడుందంటే!
భారతదేశం దేవాలయాలకు నిలయం. ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినా అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. దేవాలయాలు భక్తుల నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకలు. అయితే కొన్ని దేవాలయాలు మహిళలకు ఎంతో ముఖ్యమని, మరికొన్ని పురుషులకు ముఖ్యమని, కొన్ని దేవాలయాల దర్శనం పిల్లలకు ఎంతో మంచిదని ఇలా.. చాలా చెబుతూ ఉంటారు. అయితే.. భారతదేశంలో మహిళలు, పురుషులు మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. వీరిని అర్థనారీశ్వర తత్వానికి ప్రతిరూపంగా భావిస్తారు. అయితే భారతదేశంలో ఈ ట్రాన్స్ జెండర్లకు కూడా ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయం అంటే ట్రాన్స్ జెండర్లకు చాలా విశ్వాసం. ముఖ్యంగా ఈ ఆలయంలో అమ్మవారు కోడిపుంజు పై సవారీ చేస్తుందట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి? తెలుసుకుంటే..
బహుచర దేవి ఆలయం..
గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో బహుచర మాతా ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంలో అమ్మవారు అంటే ట్రాన్స్ జెండర్లకు చాలా నమ్మకం. దేశం నలుమూలలలోని చాలా ప్రాంతాల నుండి ట్రాన్స్ జెండర్లు ఈ ఆలయానికి వచ్చి బహుచర మాతను పూజిస్తారు. ఇక్కడి అమ్మవారు అర్థనారీశ్వరురాలిగా పూజించబడుతున్నారు.
బహుచర మాతా ఆలయం వెనుక ఉన్న నమ్మకం..
స్థానిక నమ్మకాల ప్రకారం, బహుచర మాత ఒకేసారి అనేక మంది రాక్షసులను సంహరించడం వల్ల ఆమెకు బహుచర అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయంలో చాలా కోడిపుంజులు తిరుగుతూ ఉంటాయి, అందుకే ఈ అమ్మవారిని "కోడిపుంజుల దేవత" అని కూడా పిలుస్తారు. బహుచర అమ్మవారు కోడిపుంజుపై సవారీ చేస్తుందట. ఈ ఆలయం ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. ఇక్కడి అమ్మవారిని పూజించి, ఆశీర్వాదం పొందిన వారు తమ మరుజన్మలో ట్రాన్స్‌జెండర్‌గా జన్మించరని నమ్ముతారట. అంతేకాకుండా, బహుచర దేవి సంతానం కోరికను కూడా తీరుస్తుందట.
బహుచర మాత ఆశీర్వాదంతో బిడ్డ పుడితే.. ఆ బిడ్డను ఆలయానికి తీసుకుని వచ్చి ఈ ఆలయంలోనే బిడ్డకు వెంట్రుకలు తీయించి, ఆ జుట్టును అక్కడే వదిలివేస్తారట, అలాగే కోడిపుంజులను కూడా ఆలయానికి దానం చేస్తారట. సంతానం కలగని వారు.. ఈ ఆలయంలో అమ్మవారికి.. తమకు పిల్లలు పుడితే వెంట్రుకలు సమర్పిస్తామని, కోడిపుంజులు దానం చేస్తామని మొక్కుకుంటారట.
ఆలయ కథ..
ఆలయ ప్రాంగణంలో తిరిగే కోడిపుంజుల గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఈ కథ ప్రకారం.. అల్లావుద్దీన్ ఖిల్జీ పటాన్‌ను జయించి ఇక్కడికి వచ్చినప్పుడు, ఆలయ వైభవం అతడిని మొదటి చూపులోనే ఆకట్టుకుందట. దాంతో అతను ఆలయాన్ని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడట. అతను ఆలయంపై దాడి చేశాడు, కానీ అతని సైనికులు లోపల పెద్ద సంఖ్యలో కోడిపుంజులను గమనించారు. సైనికులు చాలా రోజులుగా ఆకలితో ఉన్నందున ఆ కోడిపుంజులను తిన్నారట. ఆ తర్వాత వారు నిద్రపోయారు.
కోడిపుంజులన్నింటినీ తినేసినప్పటికీ, ఒక కోడిపుంజు మిగిలిపోయిందట. అది ఉదయాన్నే కూసినప్పుడు, సైనికుల కడుపులు ఆ కూతల శబ్దాలతో ప్రతిధ్వనించాయట, ఒక్కొక్కరి ఆరోగ్యం క్షీణించి మెల్లగా ఒక్కొక్కరు మరణించడం మొదలైందట. ఖిల్జీ తన మిగిలిన సైన్యంతో అక్కడి నుండి పారిపోయాడట, అప్పటి నుండి ఆ ఆలయం "కోడిపుంజు దేవత"గా ప్రసిద్ధి చెందిందట.
ట్రాన్స్ జెండర్లతో సంబందం..
బహుచర మాతా ఆలయానికి, ట్రాన్స్ జెండర్లకు చాలా గాఢమైన సంబంధం ఉంది . ఒక పురాణ గాథ ప్రకారం, గుజరాత్‌కు చెందిన ఒక రాజుకు సంతానం ఉండేది కాదు. అతను పూర్తీ నమ్మకంతో, భక్తిశ్రద్ధలతో బహుచర మాతను పూజించగా, అతనికి ఒక కుమారుడు కలిగాడట. అయితే ఆ కుమారుడు నపుంసకుడిగా జన్మించాడు. ఒకరోజు బహుచర మాత ఆ రాజు కుమారుని కలలో కనిపించి జననేంద్రియాలను ఆమెకు సమర్పించడం ద్వారా మోక్ష మార్గాన్ని చూపిందట. ఆ రాజు కుమారుడు తన జననేంద్రియాలను సమర్పించడమే కాకుండా ఆ దేవత భక్తిలో పూర్తిగా లీనమై ఆమె భక్తుడయ్యాడట. అప్పటి నుండి ట్రాన్స్ జెండర్లు అందరూ బహుచర మాతను తమ కులదైవంగా ప్రకటించుకుని ఆమెను పూజించడం ప్రారంభించారట.
*రూపశ్రీ.