ఆ ఊర్లో ఏ పెళ్లి అయినా గుడిలో జరగాల్సిందే.. 350 ఏళ్ల నుండి ఇదే తీరు!
ఆ ఊర్లో ఏ పెళ్లి అయినా గుడిలో జరగాల్సిందే.. 350 ఏళ్ల నుండి ఇదే తీరు..!
పెళ్లిని జీవితంలో చాలా పెద్ద వేడుకగా పరిగణిస్తాము. జీవితంలో గుర్తుండిపోయే విధంగా పెళ్లిళ్లు జరపడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగమే.. కళ్యాణ మండపాలు.. ఫంక్షన్ హాల్ లు.. ఇళ్లు విశాలంగా ఉంటే.. చాలామంది పెళ్లిళ్లు ఇళ్లలో కూడా చేస్తుంటారు. అయితే.. భారతదేశంలో ప్రజల జీవితాలలో నమ్మకాలు, సంప్రదాయాలు చాలా ఉన్నాయి. పెళ్లి విషయంలో ఒక గ్రామం పాటిస్తున్న ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ వారు మాత్రం తమ ఆచారమే తమ జీవితానికి శ్రీరామ రక్ష అనుకుంటున్నారు. అందుకే ఆ ఊర్లో ఏ పెళ్ళి అయినా సరే.. ఆ ఊరిలో ఉన్న గుడిలోనే జరుపుతున్నారు. ఈ ఆచారం నిన్న లేక మొన్న పుట్టినది కాదు.. దాదాపు 350 ఏళ్ళ క్రితం నుండి ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది? పెళ్లిళ్ళు గుడిలోనే చేయడం వెనుక కారణం ఏమిటి? తెలుసుకుంటే..
రాజస్థాన్..
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఆటి గ్రామం ఒక వింత సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. అక్కడ గత 350 సంవత్సరాలుగా ఏ ఇంటి ఆవరణలోనూ పెళ్లి జరగలేదు. ఆటి గ్రామంలో ప్రతి వివాహం చాముండ మాత ఆలయంలో మాత్రమే జరుగుతుంది. వివాహం ఆలయంలో జరగకపోతే కూతురు లేదా కోడలికి సంతానం కలగదని గ్రామస్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడి ప్రజలు ఈ సంప్రదాయాన్ని కచ్చితంగా పాటిస్తారు.
అన్ని వివాహాలు ఇక్కడే..
దేవాలయాలలో కూతుళ్ల వివాహాలే కాకుండా, కుమారుల వివాహ వేడుకలు కూడా నిర్వహిస్తారు. పెళ్లి ఊరేగింపు వచ్చిన తర్వాత, వధువును గుడిలో ఉంచి, రాత్రంతా జాగరణ చేస్తారు. మరుసటి రోజు ఉదయం పూజ చేసిన తర్వాతే ఆమెను అత్తగారింటికి పంపిస్తారు.
చాముండి మాత ఆలయం..
రాజస్థాన్‌లోని బార్మర్ నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం, జైపాత్ర వంశానికి చెందిన మేఘ్వాల్ సమాజానికి నిలయం. గ్రామం దిగువన ఉన్న చాముండా దేవి మాత ఆలయం వారి కులదైవం, వివాహాలకు ప్రధాన వేదిక ఈ అమ్మవారి గుడే.
350 సంవత్సరాల చరిత్ర..
స్థానిక నమ్మకం ప్రకారం, సుమారు 350 సంవత్సరాల క్రితం, జైసల్మేర్‌లోని ఖుహ్ది గ్రామానికి చెందిన జైపాల్ వంశస్థులు ఇక్కడ స్థిరపడటం మొదలు పెట్టారు. వారు తమతో పాటు చాముండా మాత విగ్రహాన్ని కూడా తీసుకువచ్చారు. అప్పటి భూస్వామి హమీర్ సింగ్ రాథోర్, వారికి స్థిరపడటానికి భూమిని మంజూరు చేశారు. తదనంతరం ఆలయం నిర్మించబడింది, అప్పటి నుండి ఈ వివాహ సంప్రదాయం ప్రారంభమైందని చెబుతున్నారు.
భాద్రపద , మాఘ శుద్ధ సప్తమి నాడు చాముండ మాత ఆలయంలో ఒక గొప్ప జాతర జరుగుతుంది. నూతన వధూవరులు తమ పెళ్లి దుస్తులను సమర్పించి, అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి ఇక్కడికి వస్తారు.
*రూపశ్రీ.