పాకిస్తాన్‌లో శక్తిపీఠం – హింగ్‌లాజ్ మాత!
పాకిస్తాన్‌లో శక్తిపీఠం – హింగ్‌లాజ్ మాత!
గోపీచంద్ కథానాయకుడుగా వచ్చిన సాహసం సినిమా గుర్తుండే ఉంటుంది. ఇందులో హీరోయిన్ (తాప్సీ) పరమభక్తురాలు. ఎన్ని కష్టనష్టాలకు ఓర్చుకునైనా పాకిస్తాన్‌లో ఉన్న ‘హింగ్‌లాజ్ మాత’ శక్తిపీఠాన్ని చేరుకోవాలన్న ఆశయంతో ఉంటుంది. కథానాయకుడు మరో ఆశయంతో ఆమెకు తోడుగా బయల్దేరతాడనుకోండి. ఇంతకీ ఎవరీ హింగ్‌లాజ్ మాత. శక్తిపీఠాలలో ఆమె స్థానం ఏమిటి!
సతీదేవి శరీరభాగాలు పడిన శక్తిపీఠాలు 18 అని అందరికీ తెలిసిందే. కానీ వేర్వేరు గ్రంథాలలో ఈ సంఖ్య వేర్వేరుగా కనిపిస్తుంది. 4, 51, 55, 108... ఇలా వేర్వేరుగా ఈ శక్తిపీఠాలను పేర్కొంటారు. చాలా సందర్భాలలో వాటిలో ‘హింగ్‌లాజ్‌దేవి’ ని కూడా ఓ శక్తిపీఠంగా పేర్కొనడం గమనించవచ్చు. పాకిస్తాన్‌లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో, బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నదే ఈ హింగ్‌లాజ్ దేవి ఆలయం.
స్థలపురాణం ప్రకారం ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడింది. అందుకే ఇక్కడి మూర్తికి ఒక రూపు అంటూ ఉండదు. ఒక చిన్నగుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని ‘హింగళము’ అని పిలుస్తారు. అలా ఈ దేవికి హింగ్‌లాజ్‌మాత అన్న పేరు వచ్చిందని అంటారు. మరో ఐతిహ్యం ప్రకారం ఒకప్పుడు హింగులుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. అతన్ని సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారే అవతరించారు. ఆ అమ్మవారి నుంచి తప్పించుకుంటూ హింగులుడు ఈ గుహలోకి ప్రవేశించాడు. అతని వెనకే గుహలోకి వెళ్లిన అమ్మవారు, హింగులుడిని సంహరించారు. అలా అమ్మవారికి హింగ్‌లాజ్ దేవి అన్న పేరు స్థిరపడింది.
హింగ్‌లాజ్‌దేవి ఆలయం ఇరుకైన లోయల మధ్య ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ పెరిగిన సదుపాయాల దృష్ట్యా ఇప్పుడంత కష్టపడనవసరం లేదు. దాంతో నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో అయితే... భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా... హింగ్‌లాజ్ మాత ఆశీస్సులతో అవి తొలగిపోతాయని ఓ నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పైగా క్షత్రియులలో కొన్ని శాఖల వారికి ఈ తల్లి కులదైవం. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగ్‌లాజ్‌దేవి కొందరు క్షత్రియులను రక్షించిందట. అందుకని వారి వారసులు ఇప్పటికీ ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు.
హింగ్‌లాజ్‌దేవిని హిందువులు కొలవడం సరే! కానీ ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించడం ఓ విశేషం. వారంతా ఈ ఆలయాన్ని ‘నానీ కీ మందిర్’ అని పిలుస్తారు. ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు అందిస్తారు. స్థానికులలో ఇలాంటి భక్తి ఉండబట్టే... పాకిస్తాన్‌లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినా ‘హింగ్‌లాజ్ మాత’ ఆలయం మాత్రం ఇంకా చెక్కుచెదరకుండానే ఉంది.
- నిర్జర.