లేపాక్షి (Lepakshi)

 

లేపాక్షి (Lepakshi)

 

దక్షిణ భారత సువర్ణ యుగంగా భావించే విజయనగర రాజుల కాలంలో నిర్మించిన సుందర దేవాలయాలలో లేపాక్షి దేవాలయం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో హిందూపురానికి తూర్పుదిశలో దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉన్న లేపాక్షికి హిందూపురం నుండి బస్సుల సౌకర్యం ఉంది. లేపాక్షి ఒక కుగ్రామమైనా, ఇక్కడున్న ప్రాచీన దేవాలయం వల్ల నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విజయనగర ప్రభువైన శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో పెనుగొండ ప్రాంతానికి మాండవీకుడైన విరూపన్న తన కులదైవం వీరభద్రుని పేర ఈ ఆలయాన్ని కట్టించాడు. దీని విస్తీర్ణం తూర్పు, పడమర 110 మీటర్లు, దక్షిణోత్తరం 93 మీటర్లు ఉంది. ఈ దేవాలయం ఒక లోకోత్తర కళాఖండం, దీని నిర్మాణకాలం క్రీ.శ, 1528 నుండి 1549వరకు అని ఇక్కడి శాసనాలనుబట్టి తెలుస్తోంది.

స్థల పురాణం ప్రకారం లేపాక్షి ప్రాచీనత రామాయణ కాలం నాటిది. చరిత్ర పూర్వకాలాన దీని పేరు “కూర్మశైలం’’. మహర్షి అగస్త్యుల వారు “పాపనాశేశ్వర’’ అనే శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించి ఇక్కడున్న గుహలో కొంతకాలం తపస్సు చేసుకుంటూ కాలం గడిపారని స్థల పురాణం చెపుతోంది. సీతాపహరణ అనంతరం రామలక్ష్మణులు మరణావస్థలో ఉన్న జటాయువును చూసి ‘లేపాక్షి’ అని పిలువగా నాటినుండి ఈ స్థలానికి “లేపాక్షి’’ అనే పేరు స్థిరపడిందనే కథ ఒకటి ఇక్కడ ప్రచారంలో ఉంది.

కూర్మశైలం మీద ఉత్తరాభిముఖంగా నిర్మించిన ఈ దేవ మందిరం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా లేదని విద్వాంసుల అభిప్రాయం. అయినా పండిత పామరులందరినీ ఆకర్షించే శక్తిగల సుందర శిల్పాలు, లెక్కలేనన్ని అద్భుతమైన వర్ణచిత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి శిల్ప కళకు ముఖ్యంగా స్థంభాలపైన స్త్రీ, పురుష, ప్రాణి, పక్షి, లతా పరివారములను గండరించి, వాటిలో మనోహర సౌందర్యాన్ని నిక్షేపించారు.

మొదటి ప్రాంగణాన్ని అందమైన జంగస్తంభాలు కలిగిన చతురస్రాకారపు మంటపంగా నిర్మించారు. ఇక్కడున్న నాలుగు దేవాలయాలూ విగ్రహాలు లేక పాడుపడ్డాయి. ప్రకృతి మలచిన నీటికొలను గర్భగృహానికి పడమటి దిశలో ఉంది. ఇంక రెండవ ప్రాంగణపు వెలుపలి గోడపై అసంఖ్యాక శాసనాలు కన్నడ భాషలో చెక్కి ఉన్నాయి. రెండవ ప్రాంగణంలోని నాగలింగేశ్వర శిల్పం అయిదు మీటర్ల ఎత్తు ఉంది. లింగానికి రక్షణగా వున్న సర్పం సప్త శిరస్సుల విశాలమైన పడగ అతిభయంకరంగా ఉన్నా, చతుర శిల్ప పనితనంతో కళాత్మకంగా రూపుదాల్చి తూర్పు దిశలో ఉంది. అటు పక్కనే శ్రీకాళహస్తి క్షేత్ర కథ చక్కగా మలిచారు. ఇక్కడున్న ఉగ్రగణపతిని చూసి తీరవలసిందే.

రెండవ మహాద్వారం దాటితే కనపడేది నాట్య మంటపం. దీనిని ఎనిమిది జతల ఉత్తమాశ్వాలు కట్టిన రథంలా తీర్చిదిద్దారు. శిల్ప, చిత్ర, నృత్య, సంగీతాది చతుర్విధ లలిత కళలు సరిసమానంగా విజ్రుంభించిన పరమేశ్వరుని నర్తన మందిరమిది. ఇక్కడ భిన్న ముఖాల విపుల శిల్పాలతో కూడిన డెబ్బయ్ బృహత్ స్తంభాలు ఉన్నాయి. ఈ మంటపం పైకప్పులో అమర్చిన శత పత్ర కమలం ప్రత్యేక ఆకర్షణ. నాట్యాచారుడైన భ్రుంగీశ్వరుని పర్యవేక్షణలో రంభ, ఊర్వశిల నాట్యం, తాళాలు చేతపట్టిన దత్తాత్రేయుడు, పరమశివుని తాండవ నృత్యం, నాట్య వీక్షిత పార్వతి, సేవానిరతులైన చెలికత్తెలు, సూర్యుని నాదస్వరం, తుంబురాన్ని చేత పట్టిన కిన్నెర, నందీశ్వరుడు మృదంగం, విశ్వబ్రహ్మ మద్దెల, కఠిన నృత్య భంగిమలో నటరాజు. ఇంకోపక్క వీణా మృదంగ ధారులైన చదువుల తల్లి, సృష్టికర్తల ఆసక్తికరమైన శిల్పాలు, యాచక వృత్తి నిరత పరమేశ్వరుని శిల్పం మిక్కిలి ఆకర్షణీయం. నాట్యమంటపంపై కప్పునుండి పెద్ద స్తంభం ఒకటి వేలాడుతున్నది. దీనిని అంతరిక్షం స్తంభం అంటారు.

ఈ నాట్య మంటపంపై కప్పులో అసంఖ్యాక వర్ణ చిత్రాలు ఉన్నాయి. భారత, రామాయణం శివపురాణాలలోని ప్రముఖ ఘట్టాల్ని కథా రూపంగా వీటిలో చిత్రీకరించారు. విజయనగరాన్ని పరిపాలించిన అనేక రాజ ప్రముఖుల్ని ఈ చిత్రాలలో చూడచ్చు.

గర్భగుడిలోని వీరభద్రుని మూల విగ్రహం పురుష ప్రమాణంలో ఉంది. ఈశాన్యంలో నవగ్రహాలు, పద్మిని స్త్రీ వాస్తు పురుష మూర్తుల రూపకల్పన అతిసున్నితం. ప్రదక్షిణ పథంలో క్రమంగా గణపతి, పాపనాశేశ్వర, అగస్త్య మహర్షి గుహ, పార్వతి, నైరుతిలో నాగలింగం, భద్రకాళీ, హనుమలింగం, పరివార సమేతుడైన రఘునాథుడు, వాయువ్యంలో దుర్గాదేవి. మార్కండేయుడు నెలకొని ఉన్నారు. ఈ ఆలయపు ప్రధాన దేవతలు వీరభద్రుడు, భద్రకాళి అయినా దుర్గాదేవికి కూడా నేడు నిత్యపూజలు జరుగుతున్నాయి.

నలభై ఒక్క స్తంభాలతో అలరారే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మంటపం గర్భగుడికి పడమట ఉంది. ఈ కల్యాణ మంటపం ఎంతో మంగళకరంగా ఉంటుంది. ఆంజనేయ మంటపం ముందున్న బండపై ఎల్లప్పుడూ ఎడతెగక నీరు ప్రవహించే పాదముద్ర, తాండవేశ్వర లింగం, ఎదురుగా బండపై గల శాసనం ఇక్కడ గల మరో ఆకర్షణ. లేపాక్షిలో మహానంది నిర్మాణ ఇతిహాసం చాలా ఆసక్తికరమైనది. ఒకప్పుడు కూలీ సందర్భంగా విరూపన్నతో పొత్తు శిల్పులందరూ ఒక్కుమ్మడిగా చెక్కడం ఆపి సమ్మేచేశారట. అప్పుడు కాలాన్ని వృథాగా గడపడం ఇష్టపడని శిల్పులు ఆలయానికి తూర్పు దిశలో భువి నుండి మొలకెత్తిన ప్రచండ శిలకు నంది రూపాన్ని ఇచ్చారట. సమస్త శిల్పగణం ఏకమై తమ అంతఃసత్యాన్ని ధారపోసి సృష్టించిన ఈ మహానది సౌందర్యం వర్ణానాతీతం.

అయిదు మీటర్ల ఎత్తు, 9.5 మీటర్ల పొడవు వుంది ఈ నంది. ఒంటినిండా అరుదైన సొమ్ములు ధరించి, చెవులు పై కెత్తి, కుడికాలు ముందు మోపి రాజఠీవితో హుందాగా కూర్చున్న లేగదూడ ముద్దులొలికే చిలిపి రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు చెక్కించిన అనేక శాసనాలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. విజయనగర రాజ్య పతనానంతరం కాలఘట్టంలో గుర్తు తెలియని కొందరి దురాగతాలకు గురై దేవాలయ ప్రాంగణంలోని అనేక సుందర శిల్పాలు కొద్దిగా దెబ్బతిన్నా, ఎక్కువ నష్టమేమీ జరగకుండా విరుపన్నగారి స్వప్నలోకం ధృడంగా నిలిచి ఉండటం మన అదృష్టం.

స్థానికుల నిర్లక్ష్యం వల్ల, దాతలు, రక్షకులు లేని ఈ దేవాలయం పాడుబడి అంధకారంలో మునిగిపోయింది. ఇలా శతాబ్దాలు గడవగా, స్వాతంత్ర్య పూర్వం బహుముఖ ప్రతిభావంతులైన అడవి బాపిరాజు గారు ఒకనాడు లేపాక్షికి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించి, ఈ దేవాలయపు దుస్థితిని చూసి బాధపడ్డారు. ఈ మందిర సౌందర్యం చూసి వారి కళాహృదయం ద్రవించింది. ఇక్కడి మహానది గాంభీర్యం చూసి ఆనందపరవశుడై

“లేపాక్షి బసవయ్య లేచి రావయ్య

కైలాస శిఖరాన నడచి రావయ్య’’

అని పాడి ఆ నంది గొప్పదనం చాటారు. స్వాత్రంత్ర్యం అనంతరం జరిపిన కృషివల్ల లేపాక్షి పునరుజ్జీవనం పొందింది. ఈ దేవాలయ దర్శనానికి నేడు ప్రతి దినం దేశం నలుమూలల నుండి అనేకమంది యాత్రికులు వస్తున్నారు. ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా లేపాక్షి ఎంతో పేరు పొందింది.

చొక్కాపు వెంకటరమణ