కదిరి నరసింహ స్వామి (Kadiri – Narasimhaswamy)
కదిరి నరసింహ స్వామి
(Kadiri – Narasimhaswamy)
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉంది మహిమాన్వితుడుగా పేరుమోసిన నరసింహస్వామి కొలువైన ఆలయం. 2.75 ఎకరాల్లో ఉన్న ఈ ఆలయ ప్రాథమిక నిర్మాణం 13వ శతాబ్దంలో జరిగిందనీ తరువాత దశల వారీగా ఆలయ నిర్మాణం పూర్తయిందనీ కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. చుట్టూ ఎత్తైన ప్రహారీగోడలు, నాలుగువైపులా నాలుగు ప్రవేశ గోపురాలతో అత్యంత వైభవంగా ఉండే ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పసంపద ఉంది. ఆలయంలోని వాస్తు, శిల్పరూపాలు ద్రావిడ, హోయసల, విజయనగరరాజుల కాలంనాటి శిల్పాలను పోలి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోనే అనేక మంటపాల్లో ఏనుగు, గుఱ్ఱం ... వంటి అనేక జంతువుల శిల్పాలు అందంగా చెక్కి ఉండడం హోయసల వాస్తు శైలిని తలపిస్తుంది.
భ్రుగు తీర్థం
గోపురాల పైభాగంలో పావురం నిర్మాణం, సిహాలలాటాలతో కూడిన గవాక్షాలు ఆలయానికి మరింత శోభ చేకూరుస్తాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదక్షిణాపథముఖ మంటపం, అర్థమంటపం, రంగమంటపాలు ఉన్నాయి. రంగ మంటపంలో శ్రీవారివైపు కైమోడ్చి ప్రణమిల్లుతున్న గరుదాళ్వారులు కనిపిస్తారు. గర్భాలయానికి ఎడమ భాగంలో ఉన్న రంగమంటపంలో కనిపించే నాలుగు స్తంభాలు నాటి శిల్పకళా వైభవానికి అద్దం పడతాయి. గర్భ గుడిపై ఏకతల విమానాన్ని నాగర శైలిలో నిర్మించారు. ఆలయానికి పశ్చిమాన ఉన్న గోపురంలో వెనుక భాగంలో ఓ కోనేరు ఉంది. దీన్ని భ్రుగుతీర్థమని పిలుస్తారు.
పౌరాణిక ప్రాశస్త్యం
దశావతారాల్లో నృసింహస్వామి నాలుగో అవతారం. ఇక్కడి ఆలయంలోని నృసింహస్వామి, అమృతవల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ‘బేట్రాయి సామిదేవుడా! నన్నేలినోడు! బేట్రాయి సామి దేవుడా! కదిరి నరసింహుడా! కాటీమరాయడా!’ అనే జానపదులు, చెలగి కదిరిలో శ్రీ వేంకటాద్రిమీద యెలగేటి చక్కటి లక్ష్మీ నృసింహము! శ్రీ వెంకటాద్రిమీద యెలగేటి చక్కటి నృసింహము, శ్రీ నారసింహమాం పాహి – క్షీరాబ్ది కన్యరా రమణశ్రీ అన్న కీర్తనల్లోని నృసింహస్వామి ప్రాశస్త్యాన్ని కళ్ళారా తెలుసుకోవాలంటే ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే.
‘ఖ’ అంటే విష్ణుపాదము. ‘అద్రి’ అనగా కొండ. అందుకే ఈ పట్టణానికి ‘ఖద్రి’ అనే పేరు వచ్చి కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని చెబుతారు. ఇప్పటికీ కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపించే పాదాల గుర్తులను విశ్నుపాదాలుగా విశ్వసిస్తారు. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో ‘ఖదిర’ (సండ్ర) వృక్షాలు అధికంగా ఉండడంతో ఈ పట్టణానికి కదిరి అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది.
ఉత్సవాలు
ప్రతి సంవత్సరం ఉత్తరాయణంలో తొలి పండుగగా జరుపుకొనే సంక్రాంతి వేడుకల తరవాత ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగలో భాగంగా జరుపుకునే పశువుల పండగ రోజున శ్రీదేవి భూదేవిలతో కలిసి వసంత వల్లభులు కదిరి కొండకు పారువేట నిమిత్తం వస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అందుకే పాలు పొంగు వేడుక తర్వాత పారువేటానంతరం పురవీధుల్లో ఊరేగిస్తూ స్వామి వారిని ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఏటా ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు ఇక్కడ జరిగే రథోత్సవం సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఉత్సవంలో ఊరేగింపు రథం సుమారు 120 టన్నుల బరువుంటుంది. ఆరు చక్రాలుండే ఈ రథం 45 అడుగుల ఎత్తు ఉంటుంది. వెనుక చక్రాలకు తెడ్డును అమర్చి, దీన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు.
రథోత్సవం సమయంలో స్వామివారి రథంపై దవనం, మిరియాలు, పండ్లు చల్లుతుంటారు. కిందపడిన వీటిని ఏరుకొని తింటే సర్వరోగాలూ నయమవుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఆ రోజు భక్తులు ఉపవాసముంటారు. ఏటా ఆలయంలో నృసింహ జయంతిని వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్ళను వైశాఖ శుద్ధ పౌర్ణమి. చింతపూల తిరుణాళ్ళను ఆషాడ శుద్ధ పౌర్ణమి, ఉట్ల తిరుణాళ్ళను శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు. వైఖానన ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రతిరోజూ స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు. ముందుగా ఉదయం నివేదన, ఆర్జిత అభిషేక పూజ, సర్వదర్శనం, కల్యాణోత్సవం, మధ్యాహ్న నివేదన, సాయంకాలం నాలుగున్నర గంటల నుంచి సర్వదర్శనం, సాయంకాల నివేదన, తర్వాత మళ్ళీ సర్వదర్శనం ... ఈ క్రమంలో ఆలయమ్లో ప్రతిరోజూ కార్యక్రమాలు జరుగుతాయి.
ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం ఇటీవలే ఆధునిక సౌకర్యాలతో ఓ వసతి గృహాన్ని నిర్మించారు. ఆలయ దక్షిణ గోపురం శిథిలమైపోగా దాదాపు ఐదేళ్ళ క్రితం దీన్ని పునర్నిర్మించారు.
పట్టణ ప్రాముఖ్యం
అన్ని మతాలవారూ కదిరి నరసింహస్వామిని ఆరాధించడం ఈ ఆలయం వైశిష్ట్యం హిందూ, ముస్లీం, క్రైస్తవులందరూ మతాలకతీతంగా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, పూజలు నిర్వహించడం విశేషం. కదిరి పట్టణానికి 27 కి.మీ. దూరంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటుచేసుకుంది. 7.25 ఎకరాల స్థలంలో 1100 ఊడలతో సుమారు 600 సంవత్సరాల వయసున్న ఈ అతిపెద్ద మర్రిచెట్టు యాత్రికుల సందర్శన స్థలంగా ప్రసిద్ధి చెందింది. కదిరికి 12 కి.మీ. దూరంలోని కటారుపల్లిలో యోగివేమన జీవ సమాధి అయినట్లు చెబుతున్న ఆలయం కూడా ఉంది.