అర్థనారీశ్వర దేవాలయం – విరూపాక్షపురం (Viroopakshapuram – Ardhanareeswaralayam)

 

అర్థనారీశ్వర దేవాలయం – విరూపాక్షపురం

(Viroopakshapuram – Ardhanareeswaralayam)

 

శ్రీకాళహస్తి తాలూకా తొట్టంబేడు మండలంలో, సువర్ణముఖినదీ తీరాన విరూపాక్షపురమనే గ్రామంలో ప్రాచీనమైన ‘అర్థనారీశ్వరస్వామి’ దేవాలయం వెలసి ఉంది. శివుని అర్థనారీశ్వరునిగా ఆలయగోడలపైన, విమానం మీద చూపడం కలదుగాని, మూలవిరాట్టు అయిన లింగమే అర్థనారీశ్వరుడి రూపంలో వెలయడం అపూర్వం. పురాణాలలో ఈ ఆలయాన్ని ‘పాపివిచ్చేద క్షేత్రం’ అని పేర్కొన్నారు. శివపురాణం ప్రకారం కృతయుగంలో, ఈ స్వామిని సకలదేవతలు పూజించారట. ఆ యుగంలో ఇచ్చటి స్వామి లింగాన్ని ‘సత్యలింగ’మనే వారు. ద్వాపర యుగంలో అవంతీ నగరానికి చెందినా ‘విజయ’ మరియు ‘సుభగా’ అనే పురాణ దంపతులు ఈ స్వామిని సేవించి తరించడం మూలాన, ఈ స్వామిని ‘సుఖగాంబ సామెత శ్రీ విజయేశ్వరస్వామి’ అని పేర్కొంటున్నారు. శివపురాణంలో ‘శ్రీ విజయసుఖమాంబల’ చరిత్ర ఇది.

ఉత్తరదేశంలోని ఆర్యావర్తంలోని అవంతీనగరంలో అందమైన యువ దంపతులు నివసించేవారు. వారు విజయ, సుభగలు. బాల్యం నుంచి విజయునికి పరమేశ్వరునిపై ఎనలేని భక్తి ఉండేది. అతను పిన్నవయసులోనే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి దైవాన్ని దర్శించాలని నిశ్చయించుకొన్నాడు. ఒకరోజు విజయుడు మార్కండేయ మహర్షిని దర్శించి, తనకు మోక్ష మార్గాన్ని ప్రబోధించమన్నాడు. మహర్షి విజయునితో పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకునే విధానాన్నితెలుపుతూ దక్షిణకాశిగ వాసికెక్కిన శ్రీకాళహస్తి వెళ్ళి, జ్ఞాన ప్రసూనాంబ సామెత శ్రీ కాళహస్తీశ్వరుని పూజించి జన్మను తరింపజేసుకోమన్నాడు.

మార్కండేయ మహర్షి చెప్పినట్లుగా శ్రీకాళహస్తికి భార్యాసమేతంగా వచ్చి, విజయుడు చిన్నపర్ణశాలలో నివసిస్తూ రోజూ సువర్ణముఖిలో స్నానం చేసి నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు ధరించి ఆలయానికి వెళ్ళి, దీక్షతో స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు విజయుడు స్వామి ధ్యానంలో సాయంకాలం వరకు ఆలయమందే గడిపి ఇంటికి వచ్చాడు. అతడి భార్య సుభగ భర్తకు ఇష్టమైన తీయటి వంటలు చేసి, అతడి చేత తినిపించింది. భుక్తాయాసంతో విజయుడు మేను వాల్చగానే, సుభగ పూర్తిగా అలంకరించుకొని భర్తను చేరింది. భార్య కోరేదేమిటో అతడికి అర్థం కాలేదు. యుక్తవయసులో ఉన్న భార్య చనుకట్టు విజయునికి రెండు బంగారు శివలింగాలుగా కనబడసాగినాయి.

భార్య పడక పక్కనే ఉంచిన పూలు, సుగంధ ద్రవ్యాలు ఆ చనులపై జల్లి, వాటిని శివలింగాలుగా భ్రమించి రాత్రంతా పూజించసాగాడు సుభగ, భర్త తన కోర్కె తీర్చలేదని బాధపడింది. తెల్లవారగానే విజయుడు లేచి యథావిధిగా ఆలయానికి వెళుతూ రాత్రి తన ఇంటిలో ఎలా రెండు శివలింగాలు వెలిసినాయి? అది సాధ్యమేనా! అని ఆలోచిస్తూ తన భార్య శారీరక సుఖాన్ని ఆశించి తన్ను మభ్యపెట్టినందువల్లే ఈ విధంగా జరిగి ఉంటుందని, ఇక తాను ఇంట్లోనే ఉంటే తన ధ్యేయం వృథా అయిపోతుందేమో! అయినా చిన్న వయసులో ఉన్న భార్యను ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఏమీ నిర్ణయించుకోలేక పోయాడు.

యథావిధిగా ఆరోజు రాత్రి ఇంటికి వచ్చి మౌనంగా నిద్రించాడు. నిద్రలో పరమేశ్వరుడు కనబడి శ్రీకాళహస్తికి ఉత్తరంగా సువర్ణముఖి నదీ తీరాన యుగాలకు పూర్వం నుంచే దేవతలు, ఋషులు మొదలగు వారి చేత పూజలందుకుంటూన్న అర్థనారీశ్వరుని సేవించి తరించమన్నాడు. మరునాడు విజయుడు వేకువజామునే లేచి భార్యను, ఇంటిని వదిలి వంటరిగా స్వామి సెలవిచ్చినట్లు సువర్ణముఖీ నది గట్టు వెంటే నడిచి వెళ్ళి అర్థనారీశ్వర స్వామి వెలసి యున్న ‘పాపవిచ్చెద క్షేత్రం’ చేరి స్వామిని నిష్టతో కొలువసాగాడు.

పొద్దున లేచి చూస్తే భర్త జాడ లేదు. పెనిమిటి కనిపించక పోవడంతో సుభగ తన వల్లనే పరమపవిత్రుడైన తన భర్త ఇల్లు వదిలి వెళ్ళినాడని, అతడి అడుగు జాడలలోనే నడిచి స్వామిలో లీనమై పోవాలని నిశ్చయించుకొని కొంతమంది యోగుల ద్వారా శివపూజా విధానాన్ని తెలుసుకొని రోజూ బంకమట్టితో 108 శివలింగాలు చేసి ఎంతో భక్తితో ఆ స్వామిని పూజించసాగింది.

ఆమె భక్తిని పరీక్షించదలచి ఒకరోజు మహేశ్వరుడు అందమైన బ్రాహ్మణ యువకుని వేషంలో ఆమెను సమీపించి “ఎందుకిలా అందమైన కాలాన్ని వృథా చేస్తావు? నేను నీకు సకల సౌకర్యాలు కలుగజేస్తాను. నీవు నాతో వస్తే మనం ఆనందంగా జీవించవచ్చు’’ అని పలుకగా, అతడి మాటలేవీ ఆమె మనస్సుకు సోకలేదు. తుదకా బ్రాహ్మణుడు ఆమెను సమీపించి బలవంతం చేయబోగా, ఆమె కళ్ళు మూసుకుని “స్వామీ! కాళహస్తీశ్వరా నన్నురక్షించు’’ అనగా ఆమె కళ్ళ ఎదుట జ్ఞాన ప్రసూనాంబ సామెత శ్రీకాళ హస్తీశ్వరుడు ప్రత్యక్షమై “బాల! నీ భక్తిని పరీక్షించడానికే ఆ విధంగా నాటక మాడినాము. నీకు ఏమి వరం కావాలో కోరుకోమనగా, సుభగ “ఆది దంపతులారా! నాకు పునర్జన్మ లేకుండా శాశ్వతంగా మీలో ఐక్యం చేసుకోండి’’ అని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ఆమె కోరిక మేరకు ఆమెను తమలో విలీనం చేసుకొన్నారు. పాపవిచ్చేద క్షేత్రంలో ఉన్న విజయునికి తన అర్థాంగి విషయం తెలిసి తాను కూడా స్వామిలో ఐక్యం చెందాలని నిద్రాహారాలు మాని స్వామి ధ్యానంలోనే మునిగిపోయాడు.

హరుడు అతడిని కూడా పరీక్షింపనెంచి తన గణాలలోనే చంద్రహాసుని విష్ణురూపంలో విజయుని వద్దకు పంపి ఎందుకు ఆ భిక్షగాడిని పూజిస్తావు, ఇల్లు వాకిలి లేదు, శ్మశానంలో వుంటాడు. ఆభరణాలు లేవు, సర్పాలు ధరిస్తాడు. శ్మశానంలో బూడిదను ఒంటికి రాసుకుంటాడు. అతడి వల్ల నీకు కలిగే లాభమేమిటి? నన్ను పూజిస్తే సకల సౌకర్యాలు లభిస్తాయి. స్వర్గప్రాప్తి కలుగుతుంది. నా భార్య లక్ష్మీదేవి కటాక్షం వల్ల సకలభోగాలు అనుభవిస్తావు అని చెప్పగా విజయుడు కోపగించి, హరుడి మహత్యం తెలియదా!

బ్రహ్మ తేజో రూపంలో శివుని ఆద్యంతాలు గురించక అపహాస్యం పాలు కాలేదా? శివుడి వల్లే కదా సకల ఐశ్వర్యాలు నీవు కృతఘ్నుడవై మాట్లాడుట తగునా అని పలుకగా, చంద్రహాసుడి రూపంలో ఉన్న హరి ప్రత్యక్షమై “భక్తా! స్వామి వారే నీ భక్తిని పరీక్షించుటకు నన్ను ఈ రూపంలో పంపినాడు. నీ భక్తికి మెచ్సినాను. పార్వతి పరమేశ్వరులు త్వరలో నీకు ప్రత్యక్షమౌతారని సెలవిచ్చి వెళ్ళాడు. శ్రావణమాసం, పూర్ణిమ రోజున శ్రీకాళహస్తీశ్వరుడు దేవీ సాహితగా విజయునికి ప్రత్యక్షమైనాడు. భక్తుని ఆనందానికి అవధులు లేవు. స్వామి వారిని ఎన్నో విధాల స్తుతి చేసినాడు. శ్రీకాళహస్తీశ్వరుడు, విజయుడు పూజిస్తున్న లింగమందు సతీసమేతంగా ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటామని, ఈరోజు నుంచి ‘సుఖగాంబ సమేత శ్రీ విజయేశ్వరస్వామి’ అని మీ దంపతుల పేరున పిలువబడుతూ భక్తుల కోర్కెలు తీర్చేదని చెప్పి ఇచట యజ్ఞము, దానము, తపస్సు చేసిన వారికి శ్రీ కాళహస్తీశ్వరుని సన్నిధిలో యజ్ఞ, దాన, తపఃఫలితాలతో సమానమైన ఫలితం దక్కుతుందని దీవించి విజయుణ్ణి కూడా తనలో లీనం చేసుకొన్నాడు.

ఆలయ సౌందర్యం

అర్థనారీశ్వర దేవాలయం తూర్పునకు అభిముఖంగా నిర్మించారు. ఇందులో గర్భగృహం, అంతరాళం, ముఖమండపాలున్నాయి. గర్భాలయంలో ‘సుఖగాంబ సమేత శ్రీ విజయేశ్వరస్వామి’ పేరా స్వయం భూలింగం ఉంది. ఈ లింగం రెండు ముఖాలను కలిగి ఉంది. శివుని భాగంగా భావించబడుతూ ఉన్న పక్షం తెల్లగా మంచు వలే ఉండగా, దేవి భాగం పసుపు రంగును కలిగి ఉంది. ఈ అర్థనారీశ్వర స్వామిని భక్తులు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటి ప్రత్యేక సందర్భాల్లో, శుక్ర, సోమవారాల్లో, ఏకాదశి, కృత్తిక, శివరాత్రి పర్వదినాల్లో విశేషంగా పూజించి తరిస్తారు.