ధృతరాష్ట్రుడు (Dhritarashtra)
ధృతరాష్ట్రుడు
(Dhritarashtra)
పుట్టుకతో అంధుడైన ధృతరాష్ట్రుడికి వందమంది సంతానం. వాళ్ళే కౌరవులు. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. భర్త పట్ల ఆమెకి ఎంత అభిమానం, గౌరవం అంటే, అతను చూడలేని లోకాన్ని తానూ చూడదలచుకోక జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుంటుంది.
ధృతరాష్ట్రుడు సహజంగా దుర్మార్గుడేమీ కాదు. విదురుడు చెప్పే మంచి మాటలు శ్రద్ధాసక్తులతో వినేవాడు. కాకపోతే పుత్ర వాత్సల్యంతో పక్షపాత వైఖరి ప్రదర్శించేవాడు.
ధృతరాష్ట్రుడికి తన కొడుకులంటేనే ప్రేమ. అయితే, వయసులో పెద్దవాడు కనుక ధర్మజునికి పట్టాభిషేకం జరిపించాడు. అందుకు అందరూ ధృతరాష్ట్రుని ప్రశంసించారు. శకుని తదితరుల చెప్పుడు మాటలు విని, ఆ ప్రభావంతో పాండవులమీద కోపం పెంచుకున్నాడు. కానీ, ఆ కోపావేశాలను పైకి చూపించేవాడు కాదు. లోపల ఎంత రగిలిపోతున్నా, పైకి మాత్రం నవ్వులు చిందిస్తూ పెద్దమనిషిలా, ఎంతో ఉదారునిలా కనిపించేవాడు. బొత్తిగా పక్షపాత వైఖరి లేనట్లు నటించేవాడు.
కానీ నిజం నిప్పు లాంటిది కదా.. ఎంత నివురు కప్పుకుని ఉన్నా సమయం వచ్చినప్పుడు ధృతరాష్ట్రుని కుటిలబుద్ధి తెలిసిపోయేది.
భారతంలో సంజయ రాయబారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అతను మహా మాటకారి. తన అపురూపమైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు. సంజయుడు, పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంభాషణ అంతా పూసా గుచ్చినట్లు చెప్పాడు. అదంతా విని, తన కొడుకులు కష్టాన్ని కొనితెచ్చుకుంటున్నారని, వారి వినాశనాన్ని సూచిస్తోందని ఎంతగానో బాధపడ్డాడు.
శ్రీకృష్ణుడు రాయబారిగా వస్తున్నాడని తెలిసి, ప్రేమగా స్వాగత వచనాలు పలకమని, ఎంతో మర్యాద చేయాలని కొడుకులకు చెప్పాడు. దుర్యోధనుడు తండ్రి మాటలను అపహాస్యం చేస్తూ ''రానీ.. పాండవులకు వత్తాసు పలకడానికి వస్తున్నాడా ఆ కృష్ణ పరమాత్ముడు.. వెనక్కి తిరిగి వెళ్ళకుండా తాళ్ళతో కట్టి పడేస్తాను.. ఇక గర్వంతో విర్రవీగుతున్న పాండవులకు సాయం లేకుండా పోతుంది..'' అంటూ కోపం వెళ్ళగక్కాడు. కానీ, అలా చేయకూడదని, రాయబారిగా వచ్చేవారిని ఆదరించి, గౌరవిన్చాలే తప్ప హాని తలపెట్టకూడదని గట్టిగానే చెప్పాడు ధృతరాష్ట్రుడు.
భీమసేనుడు, దుర్యోధనుని తొడలు విరగ్గొట్టడంతో ధృతరాష్ట్రుడికి కోపం ముంచుకువచ్చింది. కానీ, ఆ కోపాన్ని వ్యక్తం చేయకుండా ''భీమా, ఒకసారి ఇటురా నాన్నా'' అన్నాడు. ధృతరాష్ట్రుడు ఎందుకు పిలుస్తున్నాడో గ్రహించిన కృష్ణుడు, భీముడికి బదులుగా, ఒక శిలా విగ్రహాన్ని సజీవంగా పంపాడు. ఈ మర్మం తెలీని ధృతరాష్ట్రుడు ''రా నాన్నా'' అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆయన తన కసినంతా ఆ కౌగిలిలో చూపాడు. దాంతో ఆ విగ్రహం నజ్జునజ్జు అయింది. ఎవరైనా ప్రేమ నటిస్తూ దగ్గరికి తీసుకుంటే ''ధృతరాష్ట్ర కౌగిలి'' అనడం ఇప్పటికీ వింటూ ఉంటాం. దాని వెనుక ఉన్న కథ ఇదే.
ధృతరాష్ట్రుడు పాండవులను అరణ్యవాసానికి పంపినప్పుడు పెద్దలు, ప్రముఖులే కాకుండా సామాన్యులు కూడా బాధపడ్డారు. "ధృతరాష్ట్రుడు ఇంత కుటిల స్వభావుడా'' అని ముక్కున వేలేసుకున్నారు. అయితే, అప్పటికీ ధృతరాష్ట్రుడు తన దుష్టబుద్ధి బయటపడకుండా కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ''తనకు కౌరవులెంతో పాండవులు కూడా అంతే సమానమని, కానీ తన కొడుకులు మాట వినలేదని, తాను నిస్సహాయుడినని'' చెప్పుకున్నాడు. తాను పాండవుల శ్రేయస్సు కోరుకుంటున్నట్లే మాట్లాడేవాడు. కానీ, చివరికి ఏమీ ప్రయోజనం ఉండేది కాదు.
ధృతరాష్ట్రుని కొడుకులు దుర్యోధన, దుశ్శాసనులు ద్రౌపదీ వస్త్రాపహరణానికి పాల్పడినప్పుడు కూడా కొడుకులను నిందించాడు గానీ, అంతకుమించి ఆయన పెద్దరికం ఎందుకూ పనికిరాలేదు. కాకపోతే ద్రౌపదికి రెండు వరాలు ఇచ్చాడు. అందులో ఒకటి, ధర్మరాజును విడుదల చేయడం. రెండోది వాళ్ళ అస్త్రశస్త్రాలు వాళ్ళకి ఇప్పించడం.
ధృతరాష్ట్రుడు కురుక్షేత్రం జరక్కుండా ఆపాలని సాయశక్తులా ప్రయత్నించాడు. యుద్దంలో మనమే ఓడిపోతాం'' అంటూ హెచ్చరించినా దుర్యోధనుడు అస్సలు లక్ష్యపెట్టలేదు.
ఎప్పట్లాగే తండ్రి మాట పెడచెవిన పెట్టిన దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు తాళ్ళతో బంధించబోయాడు. దాంతో కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రునికి కృష్ణుని దివ్య దర్శనం అయింది. అందుకు ఎంతగానో సంతోషించాడు.
ఇలా ఉంటుంది ధృతరాష్ట్రుడి చిత్రణ. ఆయన్ను చెడ్డవాడు అనలేం. కాకపొతే కొడుకులు అపసవ్యంగా ప్రవర్తిస్తున్నా వారిని పూర్తిగా ఖండించలేని నిస్సహాయుడు. వాళ్ళు కుటిలంగా వ్యవహరించినా వారికే విజయం లభించాలని కోరుకున్న సగటు తండ్రిగా కనిపిస్తాడు.