Read more!

అర్జునుడి కుమారుడు అభిమన్యుడు (Abhimanya, Son of Arjuna)

 

అర్జునుడి కుమారుడు అభిమన్యుడు

(Abhimanya, Son of Arjuna)

 

సుభద్ర, అర్జునుల కొడుకు అభిమన్యుడు. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడి పాత్రకు ఎనలేని విలువా గౌరవం వచ్చాయి. శాస్వత కీర్తి తెచ్చుకున్నాడు. ఆ వైనమేంటో తెలుసుకుందాం.

 

కురుక్షేత్ర యుద్ధం అరివీర భయంకరంగా జరుగుతోంది. సంగ్రామం మొదలై అప్పటికి పన్నెండు రోజులు అయ్యాయి. అటు పాండవుల్లోనూ, ఇటు కౌరవసేన లోనూ ఎందరో యోధులు చనిపోయారు.

 

పదమూడవ రోజున ద్రోణాచార్యుడు కౌరవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైనికులు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. అది చూసిన ధర్మరాజు, అభిమన్యుని ఉద్దేసించి "అయ్యా, అభిమన్యా, శ్రీకృష్ణునికి, మీ నాన్నకి (అర్జునునికి), ప్రద్యుమ్నునికి (శ్రీకృష్ణుని కొడుకు), నీకు (అభిమన్యుడు) తప్ప మరెవరికీ పద్మవ్యూహాన్ని ఛేదింఛే నేర్పు లేదు. కనుక ఇప్పుడు ఈ వ్యూహాన్ని ఛేదించే భారం నీమీదే మోపుతున్నాను. వయసులో నువ్వు చాలా చిన్నవాడివి. కానీ తప్పడంలేదు. ప్రస్తుతం ఇక్కడ ఎవరికీ పద్మవ్యూహాన్ని ఛేదించే విద్య రాదు కనుక నిన్ను నియోగించక తప్పడంలేదు. వెంటనే నువ్వు నాయకత్వ బాధ్యత స్వీకరించు.. నీ వెంట సైన్యాన్ని తీసికెళ్ళు..'' అన్నాడు.

 

అందుకు బదులుగా అభిమన్యుడు ''పెదనాన్నా, మీరు అంతగా బ్రతిమాలి చెప్పాలా? వయసులో చిన్నవాడిని అయినా ధైర్యసాహసాల్లో కాదు. మీరన్నట్లు నాకు పద్మవ్యూహం గురించి తెలుసు. అయితే, పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోనికి వెళ్ళడం వరకే నేర్పించారు. వెనక్కి తిరిగి రావడం బోధించలేదు. అయినా చింతించనవసరం లేదు. వీరులు ఎట్టి పరిస్థితిలోనూ ధైర్యాన్ని కోల్పోకూడదు. నేను నేర్చుకున్న కొద్దిపాటి విద్యను ఉపయోగించే సమయం రావడం ణా అదృష్టం అనుకుంటాను.

 

నేనెవర్ని? సవ్యసాచి అనిపించుకున్న అర్జున కుమారుని.. కేవలం తండ్రి మాత్రమే కాదు.. మా అమ్మ కూడా వీరమాతే. కనుక, పిరికితనం అనేది నాలో అణుమాత్రం కూడా లేదు. నేను వెంటనే దూసుకువెళ్తాను.. శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తాను. విజయమో, వీర స్వర్గమో.. ఏది ప్రాప్తించినా మంచిదే.. ఆశీర్వదించు పెదనాన్నా'' అన్నాడు.

 

వయసులో పిన్నవాడిని యుద్ధభూమిలోకి అందునా వ్యూహంలోనికి పంపడం ధర్మరాజుజి ఒకపక్కన బాధగానే ఉన్నా తప్పలేదు. చిరునవ్వుతో తలపై నిమిరి ఆశీర్వదించాడు.

 

అభిమన్యుడు అత్యుత్సాహంతో ముందుకు ఉరికాడు. పాండవసేన అతన్ని అనుసరించింది. ప్రతిభావంతంగా పద్మవ్యూహాన్ని ఛేదించుకుని వెళ్ళాడు. కౌరవసేనను మట్టి కరిపిస్తూ సాగాడు. కొంతసేపు అభిమన్యుడు అపార ప్రతిభను ప్రదర్శించాడు. కానీ, కౌరవయోధులకు ఉక్రోషం ముంచుకొచ్చింది. ఉన్నట్టుండి అందరూ ఏకమై బాణాలు, కత్తులు, గదలతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అర్జునిని కొడుకు, లేతవయస్కుడు అయిన అభిమన్యుడు నేలకొరిగాడు. ఉన్నంతసేపూ విజయవంతంగా పోరాడి, చివరికి వీరస్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు.