లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఏమిటి?

 

లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఏమిటి?

 

 

దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వస్తువులంటే ప్రీతి. ఆ వస్తువులలో వారు నివిసిస్తారని, ఆ వస్తువులను భక్తిశ్రద్ధలతో కొలిచేవారిని అనుగ్రహిస్తారని ఆస్తికుల నమ్మకం. ఈ నమ్మకమే లక్ష్మీదేవి నివాసం ఉండే వస్తువులకు మూలం.ఇక ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్షీదేవి ఏయే వస్తువులలో నివాసం ఉంటుందంటే ... దక్షిణావర్త శంఖం, ముత్యాల శంఖం, ఏకాక్షి నారికేళం అని చెబుతారు. ఈ వస్తువులను పూజామందిరాలలో ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ వస్తువుల గురించి వివరంగా తెలుసుకుందాం ...

 

 


దక్షిణావర్త శంఖం : ఈ శంఖం కడుపు ఊదేవారి కుడివైపునకు తెరుచుకుని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తి శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరుచుకుని ఉండేవి వామావర్తి శంఖమని పేరు. అసలు లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు ఇష్టమంటే ... లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. శంఖం కూడా మనకు సముద్రంలో దొరికేవే. మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖాలే. అయితే దక్షిణావర్తి శంఖాలు దొరకడం కష్టసాధ్యమే. ఈ శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరిగా వర్ణిస్తారు. రామేశ్వరం, కన్యాకుమారిలలో ఈ శంఖాలు విస్తారంగా దొరుకుతాయి. దక్షిణావర్తి శంఖం మోగదు, కానే మోగేది దొరికితే పూజామందిరంలో పెట్టుకుని పూజించాలి. దోషాలున్న శంఖాలు పూజకు పనికిరావు. పగిలినది, విరిగినది, పలచనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు ఉన్నవి పూజకు పనికిరావు. ఈ శంఖం ఉన్న ఇంటిలో అష్టైశ్వర్యాలతో, ఆనందంతో నిండుగా ఉంటుంది.

 

 


ముత్యపు శంఖం : ముత్యపు కాంతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అరుదుగా దొరికేదే. ఈ శంఖాన్ని బుధవారం నాడు
ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనధాన్య సమృద్ధిం దేహిదేహి నమః

అనే మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తూ పూజించాలి.

 

 


ఏకాక్షి నారికేళం : మామూలు కొబ్బరికాయలకు రెండు కళ్ళు ఉంటాయి. కానీ అరుదుగా దొరికే ఈ ఏకాక్షి నారికేళానికి ఒకే కన్ను ఉంటుంది. ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని వుంచి, ఏకాక్షి నారికేళాన్ని ఎఱ్ఱని వస్త్రంలో ఉంచి అభిషేకించి పూజించాలి.
ఇంకా పాదరస లక్షీదేవి వంటివి లక్షీదేవికి ప్రీతికరం. శ్రావణమాసంలో ఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.