ఏయే దేవతలను ఎప్పుడు పూజించాలి? (Timings for Praying Gods)
ఏయే దేవతలను ఎప్పుడు పూజించాలి?
(Timings for Praying Gods)
రోజుకు 24 గంటలు కదా! ఆ 24 గంటలను అష్ట దిక్కులతో భాగిస్తే ఒక్కో దిక్కుకూ మూడు గంటల కాలం వస్తుంది. భూమి రోజూ తన చుట్టూ తాను తిరిగే స్వ పరిభ్రమణ కాలంలో అష్ట దిక్కులను సూర్నునికి అభిముఖం చేసి, ప్రదక్షిణ చేస్తుంది. ఉదయం 6 గంటలకు జరిగే సూర్యోదయం మొదలు సాయంత్రం 6 గంటలకు అయ్యే సూర్యాస్తమయం వరకూ పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు కలిస్తే ఒకరోజు అవుతుంది.
సూర్యుడు తూర్పు ఈశాన్య సంధిలో తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు ప్రవేశించి ఒకటిన్నర గంటల కాలం ఆరోహణ క్రమంగా ఉదయం 6 గంటల సమయానికి తూర్పు మధ్య బిందువును చేరి ఉదయిస్తుంది.
ఈ అష్టదళ పద్మ స్వరూపాన్ని అనుసరించి ఆయా దేవతలకు, దిక్పాలకులకు పూజలు చేయాలి.
తెల్లవారు ఝామున 3 గంటలకు విష్ణుమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, గోవిందరాజ స్వాములను ఆరాధించాలి.
ఉదయం 6 గంటల సమయంలో సూర్య నమస్కారాలు చేయాలి. అలాగే, వేంకటేశ్వరునికి, రాములవారికి పూజలు చేయడానిక్కూడా ఈ సమయం అనుకూలమైంది.
ఉదయం 6 గంటల నుండి ఏడున్నర గంటల వరకూ తూర్పు మధ్య బిందువు నుండి అవరోహణ క్రమంగా తూర్పు, ఆగ్నేయ దిక్కుల సంధి భాగానికి చేరుతుంది. ఆవిధంగా సూర్యుడు 3 గంటలపాటు తూర్పు దిక్కున ఉంటాడు.
ఉదయం 9 గంటలకు సూర్యుడు ఆగ్నేయాన మధ్య బిందువును చేరతాడు. కనుక ఈ సమయంలో కనకదుర్గాదేవి అమ్మవారిని పూజించాలి.
ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఆంజనేయ స్వామివారిని అర్చించాలి.
సాయంత్రం 3 గంటలకి రాహువుకు, అయిదు ముఖాలున్న నాగ దేవతకు పూజ చేయాలి.
సాయంత్రం 6 గంటలవేళ సూర్యాస్తమయ సమయాన మహాశివుని అర్చించాలి.
రాత్రి 9 గంటలకు లక్ష్మీదేవిని పూజించాలి.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, కుమారస్వాములకు పూజ చేయాలి.