తాంబూలం ఎందుకు? (Purpose of Tamboolam)

 

తాంబూలం ఎందుకు?

(Purpose of Tamboolam)

 

ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది.

 

ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు.

 

హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఆయర్వేద శాస్త్రం తమలపాకు సేవనం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుంది.

 

అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెప్తున్నాయి ధార్మిక గ్రంధాలు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని పండితులు చెప్తున్నారు.

 

వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులను చేర్చి ఇవ్వడం తెలిసిందే. ఇలా తమలపాకులను ఇవ్వడం వల్ల సర్వవిధాలా శుభం చేకూరుతుంది.

 

ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

 

ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.