Read more!

ఘోషా ఆచారం మంచిదేనా? (ghosha tradition good or bad)

 

ఘోషా ఆచారం మంచిదేనా?

(ghosha tradition good or bad)

 

ఘోషా రాజుల కాలంలో పుట్టిన ఆచారం. ఇప్పటికీ కొందరు ఘోషాను పాటిస్తున్నారు. ముస్లింలలో ''బురఖా'' పేరుతో ఈ ఆచారం కొనసాగుతోంది.

పూర్వం రాచరిక కుటుంబాల్లో పుట్టిన స్త్రీలు అంతఃపురం, రాచకోటలోని ఉద్యానవనం తప్ప మరెక్కడికీ వెళ్ళేవారు కాదు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో మరెక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఇతరులకు కనిపించకుండా శరీరం అంతా కప్పేసుకుని వెళ్ళేవారు. ఆఖరికి వాళ్ళు ఎక్కిన గుర్రబ్బండిక్కూడా పరదాలు కప్పి ఉండేవి.

రాచరికంలో ఒక రాజ్యం మీద మరో రాజ్యం దండెత్తడం మామూలు. అలా ఒక రాజు, మరో రాజును ఓడించినప్పుడు లేదా ముష్కరుల బారిన పడినప్పుడు స్త్రీలు వాళ్ళ కంట పడకుండా ఉండటం కోసం ఏర్పాటు చేశారు ఘోషా పద్ధతిని. స్త్రీని తమ సొత్తుగా భావించే పురుషపుంగవులు ఇతర్లు తమ ఆడవాళ్ళను చూడకూడదనే ఉద్దేశంతో ఘోషాను పెంచి పోషించారు. ఇంత అభివృద్ధి సాధించిన ఈ రోజుల్లో కూడా ఘోషా పాటించడం మాత్రం విషాదం.

ఘోషా పాటించడం ఆరోగ్యానికి మంచిది కాదు. వాతావరణంలో ఉండే వేడి, చలి ల నుండి కాపాడుకోవడం కోసం దుస్తులు ధరించడం ఎంత ముఖ్యమో, పూర్తిగా కప్పేసుకోకుండా ఊపిరాడేలా ఉండటం కూడా అంటే అవసరం. శరీరానికి గాలీ, వెల్తురూ తగలాలి. సూర్య కిరణాలు చర్మానికి తప్పనిసరిగా తాకాలి. సూర్య కాంతిలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంపై ఉండే అనేక సూక్ష్మ క్రిములను చంపుతాయి. బొత్తిగా శరీరానికి వేడిమి సోకకపోతే సూక్ష్మ క్రిములు ప్రబలుతాయి.

సూర్యరశ్మి సోకడం వల్ల చర్మం విటమిన్ "డీ" తయారుచేసుకుంటుంది. ఘోషా పాటించే స్త్రీలకు ఎక్కడా సూర్య కిరణాలు పడవు గనుక ''డీ'' విటమిన్ కొరత ఏర్పడుతుంది.

చర్మానికి సూర్యరశ్మి తగలడం వల్ల చాలా జబ్బులు దరి చేరవు. ఎండ వల్ల చెమట పడుతుంది. అలా కూడా శరీరానికి మేలు జరుగుతుంది. లోపలి చెడు బయటకు వచ్చేస్తుంది. గాలీ, వేడీ తగలకపోతే క్రిములు హరించకపోగా, ఎక్కువై వైరల్ ఫీవర్లు, రకరకాల వ్యాధులు వస్తాయి. టీ.బీ. లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఘోషా పాటించే స్త్రీలపై ఎన్నో సర్వేలు జరిపారు. వీరిలో విటమిన్ ''డీ'' తక్కువ ఉన్నట్లు తేలింది. జబ్బులు ఎక్కువగా వస్తున్నట్లు, రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతోందని తెలియవచ్చింది.

''ఆడవాళ్ళు పూజ్యనీయులు, గౌరవనీయులు'' - అంటూ ఎక్కడో పీఠంమీద కూర్చోబెట్టి పూజించనక్కర్లేదు. ''పర పురుషులు చూసేస్తారు.. ముఖం నుంచీ పాదాలదాకా ముసుగు పెట్టేసుకో'' అంటూ వస్తువుగా జమకట్టనక్కర్లేదు. సాటి వ్యక్తిగా చూస్తే చాలు. అయినా, ఒకరు చూడాలని ఆశించడం ఏంటి, చాలామంది స్త్రీలు తమకు తామే సంకెళ్ళు వేసుకుంటున్నారు. ఘోశాలు, పరదాలు అవసరం లేదని, మంచిది కాదని తామే గుర్తించడం లేదు. ఘోషా పద్ధతి మంచిది కాదు గనుక ఆడవాళ్ళు అందులోంచి బయట పడేందుకు తక్షణం ప్రయత్నించాలి.