గురువుగారి రుణం ఎలా తీర్చుకోవాలి?

 

 

గురువుగారి రుణం ఎలా తీర్చుకోవాలి?

మట్టి ముద్దల్లాంటి మనల్ని విద్యావంతులుగా, వ్యక్తిత్వ సంపన్నులుగా తీర్చిదిద్దేది గురువులు. ఉదర పోషణార్థం ఏదో ఒక వృత్తి ఉద్యోగంలో స్థిర పడుతున్నాం అంటే, అది ఖచ్చితంగా ఆచార్యుల చలవే. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంత ప్రాధాన్యత ఉంది. కనుక ఆచార్యుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలి.

గురువుగారి రుణం ఎలా తీరుతుంది అంటే, ముందుగా వారికి కృతజ్ఞులుగా ఉండాలి. మనంతట మనకు ఏదీ రాదనీ, ఫలానా విద్యలో మనకు ప్రావీణ్యం కలిగింది అంటే, అది నేర్పినవారి గొప్పతనం అని గ్రహించాలి. నేర్చుకున్న విద్యను మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా లోక కళ్యాణార్ధం కూడా వినియోగించాలి. ఇది ఇతరులను ఉద్ధరించడం కాదు. మన కనీస బాధ్యత అని గుర్తించాలి. మన ప్రావీణ్యం మనతో అంతరించకుండా మరికొందరికి అందులో తర్ఫీదు ఇవ్వాలి. మన విద్యకు మంచి ప్రాచుర్యం వచ్చేలా చేయాలి.

బంధుమిత్రులను మించిన గొప్ప నేస్తం పుస్తకం. కానీ, చాలామంది చదువు పూర్తవడంతో పుస్తకాలను అటక ఎక్కించేస్తున్నారు. మంచి పుస్తకాల విలువ తెలుసుకుని జీవితాంతం చదువుతూనే ఉండాలి. తోటివారితోనూ మంచి పుస్తకాలు చదివించాలి. ఇలా కూడా గురువుగారి రుణం తీరుతుంది.

మనలో కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే దుర్గుణాలు ఉంటాయి. వాటిని తరిమికొట్టే ప్రయత్నం నిరంతరం చేస్తుండాలి. ఎప్పుడు ఆ అవగుణాలు తలెత్తినా, వాటిని వెంటనే అణిచేయాలి. యజ్ఞోపవీతం ధరించడంలో ఉన్న ఆంతర్యం కూడా ఇదే. యజ్ఞోపవీతానికి ఐదు గంట్లు ఉంటాయి. అవి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటాయి.