భూమి వయసెంత? (Age of the Earth)

 

భూమి వయసెంత?

(Age of the Earth)

మనలో చాలామందికి మనదేశంపట్ల చులకనభావం ఉంది. మనవాళ్ళకి ఏమీ తెలీదని, మనం వెనకబడి ఉన్నామని, విదేశీయుల్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలని వ్యాఖ్యానించడం ఎన్నోసార్లు మన చెవిన పడుతుంది. నిజానికి మన మహర్షుల దార్శనికత ముందు ఈనాటి అభివృద్ధి, సాంకేతికత బలాదూరే అంటే అతిశయోక్తి కాదు.

ఇతర దేశాల్లో ఈమధ్యకాలంలోనే సైన్సు టెక్నాలజీ అభివృద్ధి చెందాయి. ప్రతిదానికీ పరికరాలు వచ్చాయి. నిరంతరం ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ మనదేశంలో కొన్ని వేల సంవత్సరాల నాడే అంతరిక్ష, ఖగోళ శాస్త్రాలకు సంబంధించి కూలంకష వివరాలు ఉన్నాయి. దూరశ్రవణ, దూరదర్శన విద్యలు ఉన్నాయి.

మన మునీశ్వరులు ఎంత మహానీయులో, మహా మేదావులో మనం గుర్తించడం లేదు. కానీ సంస్కృత గ్రంధాలను అధ్యయనం చేసిన విదేశీయులు వారి గొప్పతనాన్ని చాటిచెప్పి ప్రశంసించారు. ఆర్థర్ హోమ్స్ అనే శాస్త్రవేత్త, తన ''Age of the Earth'' అనే గ్రంధంలో భూమి వయసుకు సంబంధించి ఇప్పటి సైన్సు చెప్పే లెక్కలు ఏనాడో హిందూదేశ పండితులు చెప్పిన లెక్కలు సరిపోతున్నాయి - అంటూ రాశారు.

మన పంచాంగంలో భూమి వయసు 1972949079 సంవత్సరాలని రాస్తారు. అంటే 197 కోట్ల 29 లక్షలకు పైగా సంవత్సరాలన్నమాట. సైన్సు ప్రకారం మరికొన్ని సంవత్సరాలు ఎక్కువ. అంటే 200 కోట్ల సంవత్సరాలు. కొన్ని వేల సంవత్సరాల నాడే మన మహర్షులు ఏ సాంకేతిక సౌలభ్యము, పరికరాల అవసరం లేకుండానే ఖచ్చితమైన లెక్కలు వేశారు. భూమి వయసు, గ్రహాల స్థితిగతులు, నక్షత్రాల తీరుతెన్నులు మొదలైన విషయాలను వివరించారు. వారి అంచనాలు తప్పలేదు.

భూభ్రమణం గురించి అంటే.. భూమి తనచుట్టూ తాను తిరుగుతుంది అనే అంశాన్ని మొట్టమొదట వెల్లడి చేసింది ఆర్యభట్టు. అంతేకాదు, చంద్రమండలం గురించి కూడా ఆర్యభట్టు ఎన్నో విషయాలను తెలియజేశాడు. చంద్రుడికి స్వయం ప్రకాశశక్తి లేదని, సూర్యకాంతి చంద్రునిమీద పడటంవల్లనే చంద్రునికి వెలుగు వస్తుందని వివరించాడు. అలాగే భూమి, చంద్రుడి నీడల వల్లనే గ్రహణాలు వస్తాయని చెప్పాడు.