రాయి ఎందుకు గొప్పది? (Importance of Rocks)
రాయి ఎందుకు గొప్పది?
(Importance of Rocks)
మనం రాళ్ళకు ఎంతమాత్రం విలువ ఇవ్వం. పైగా పనికిమాలిన రాళ్ళు అంటూ విసిరి పడేస్తాం. ఎవరయినా మనసు లేనట్లు ప్రవర్తిస్తే, ''రాతి మనిషి, చలించడు'', ''రాతి మనసు, కరగదు..'' అనేస్తాం. ఇదంతా మన తెలివిలేనితనమే.
నిజానికి రాళ్ళు చాలా విలువైనవి. అసలు రాళ్ళు లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి. ఎంత దారుణంగా, దుర్భరంగా ఉంటుంది కదూ! నిజమే, లోకంలో ఏదీ వ్యర్ధమైంది కాదు. ప్రతిదీ పనికొస్తుంది. దేన్ని, ఎప్పుడు, ఎలా వాడుకోవాలో తెలిస్తే చాలు, అన్నీ విలువైనవే, కావాల్సినవే.
''రాయి స్థిరమైంది'' అంటూ ధార్మిక గ్రంధాల్లోమంత్రమే ఉంది.
శిలలతో దేవుడి ప్రతిమలు, ఇతర విగ్రహాలు చెక్కుతారు. రాతిలో గొప్పతనం ఉంది కనుక, స్థిరత్వం, శాశ్వతత్వం ఉన్నాయి కనుకనే శిలలతో శిల్పాలను రూపొందిస్తారు.
అమూల్యమైన నవ రత్నాలు కూడా ఒక విధమైన రాళ్ళే.
అయస్కాంతం కూడా ఒక శిలే.
చెకుముకి రాయిలో నిప్పు దాగి ఉంది.
చెకుముకి రాళ్ళను ముక్కలుగా చేసి విద్యుత్ సంపర్కం కలిగిస్తే అవి కదులుతాయి. కుంకుమ రాళ్ళు, సున్నపు రాళ్ళు లాంటి ఎన్నో రాళ్ళను మనం నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నాం.
కంకర్రాళ్ళు, గ్రానైట్, మార్బుల్ - ఇలా అనేక రాళ్ళతో అందమైన ఇళ్ళు కట్టుకుంటున్నాం.
ఒకటా, రెండా... రాళ్ళవల్ల బోల్డన్ని ఉపయోగాలు... రోడ్లు వేయాలంటే, ఇళ్ళు, భవనాలు కట్టాలంటే, మరెన్నో, ఇంకెన్నో పనుల్లో రాళ్ళు లేనిదే పని జరగదు. మహా శిల్పి చేతిలో, శిలలు వెన్నలా సాగి, మహా శిల్పాలుగా తయారౌతాయి. తరతరాలు మురిసిపోయేలా శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయి. గోల్కొండ, చార్మినారు, తాజ్ మహల్ లాంటి కళాఖండాలు సగర్వంగా నిలబడతాయి.