స్నానాలు ఎన్ని రకాలు? (Types of Bathing)
స్నానాలు ఎన్ని రకాలు?
(Types of Bathing)
ఉదయానే దేహాన్ని శుభ్రం చేసుకోడానికి స్నానం చేస్తాం. నిజానికి శుచితో బాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది.
మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, విద్యుచ్ఛక్తి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న విద్యుచ్ఛక్తి ఎక్కువగా బయటకు పోతుంది.
శరీరంలో విద్యుచ్ఛక్తి కొత్తగా తయారౌతూ, బయటకు పోతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు.
రాత్రి పడుకున్నది మొదలు, ఉదయం నిద్ర లేచేవరకూ విద్యుచ్ఛక్తి బయటకు పోదు. అందుకే పొద్దున్నే మనం చురుగ్గా ఉండం. నీరసంగా, బద్దకంగా ఉంటుంది. అప్పుడు ఏ పనీ చేయకుండా అలాగే పడుకోవడమో, కూర్చోవడమే చేస్తే ఆ సోమరితనం అలాగే కొనసాగుతుంది. అందుకే ఉదయం కాసేపు వ్యాహ్యాళికి వెళ్ళమంటారు. అలా చేయడంవల్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉత్సాహం చేకూరుతుంది. స్నానపానాదులు పూర్తయ్యాక మరింత ఉల్లాసంగా ఉంటుంది.
స్నానం చేసిన తర్వాత ఎంత హాయిగా, ఉత్సాహంగా ఉంటుందో మనందరికీ అనుభవమే. తాజాదనం, సంతోషం మన సొంతమౌతాయి. మనలో చాలామందికి మామూలుగా నీళ్ళతో చేసే స్నానం మాత్రమే తెలుసు. ఇతర స్నానాలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
పంచ స్నానాని విప్రాణాం కీర్తితాని మహర్షిభిః |
ఆగ్నేయం వారుణం బ్రహ్మం వాయవ్యం దివ్యమేవచ ||
ఈ శ్లోకాన్ని అనుసరించి స్నానాలు ఐదు రకాలు. అవి వరుసగా - ఆగ్నేయ స్నానం, వారుణ స్నానం, బ్రహ్మ స్నానం, వాయవ్య స్నానం, దివ్య స్నానం. ఆగ్నేయ స్నానం అంటే విభూతిని ధరించడం. నీటిలో మునిగి లేదా నీళ్ళను పోసుకుంటూ చేసే స్నానం వారుణ స్నానం.
బ్రహ్మ స్నానం అంటే
"ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః"
అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉదకాన్ని తలపై చల్లుకోవడం.
వాయవ్య స్నానం అంటే గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే ధూళిలో తేలుతూ నడవడం.
ఇక దివ్య స్నానం అంటే ఎండావానా కలిసొచ్చినప్పుడు అందులో తడవడం. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది. అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు.
ఇవి రోజూ కాకున్నా అరుదుగా మనమూ చేస్తుంటాం. అయితే, వీటిని స్నానాలు అంటారని మనకు తెలీదు. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభూతమే. అది శాస్త్రీయంగా మేలు కూడా చేస్తుంది. ఈ స్నానాలు చేసేటప్పుడు మంత్రాన్ని స్మరిస్తే మరీ శ్రేష్టం.